రష్యాకు చెందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సరికొత్త రికార్డును నమోదుచేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి సుమారు ఒక బిలియన్ (100కోట్లకు) పైగా యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా టెలిగ్రామ్ నిలిచింది. టెలిగ్రామ్‌ను రష్యాకు చెందిన పావెల్ దురోవ్ 2013లో స్థాపించారు.
కలిసొచ్చిన ఫేస్‌బుక్ డౌన్...!
అక్టోబర్ 4 న ఒక్కసారిగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో టెలిగ్రామ్‌కు బాగా కలిసొచ్చింది. ఫేస్‌బుక్ డౌన్ అవ్వడంతో సుమారు 70 మిలియన్ల కొత్త యూజర్లు టెలిగ్రామ్ తలుపు తట్టారు. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్ కావడం ఇదే తొలిసారి.
శాన్‌ఫ్రాన్సిస్‌కోకు చెందిన సెన్సార్ టవర్ డేటా ప్రకారం... ఈ ఏడాది ఆగస్టులో టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డౌన్‌లోడ్‌ల మైలురాయిని దాటిందని పేర్కొంది. ఒక బిలియన్ డౌన్‌లోడ్స్‌ను దాటిన యాప్స్ జాబితాలో వాట్సప్ , ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ , స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్ సరసన టెలిగ్రామ్ కూడా చేరింది. అంతేకాకుండా టెలిగ్రామ్ భారత మార్కెట్‌లో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా ఆవిర్భవించిందని సెన్సార్ టవర్ వెల్లడించింది.
భారత్, రష్యా, ఇండోనేషియా దేశాలు టెలిగ్రామ్ ప్రధాన మార్కెట్స్‌గా నిలిచాయి. ఈ ఏడాదిలో యాప్ ఇన్‌స్టాల్స్‌లో భారత్ నుంచి 22 శాతం, రష్యా 10 శాతంతో, ఇండోనేషియా 8 శాతంతో టెలిగ్రామ్ నిలిచింది. 2021 ప్రథమార్ధంలో 214.7 మిలియన్ యూజర్లు టెలిగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు. 2020తో పోలిస్తే 61 శాతం మేర అత్యధికంగా డౌన్‌లోడ్స్ పెరిగాయి.
చదవండి: కంప్యూటర్ క్లీన్ చేసే ఈ క్లాత్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment