కవనం: జూబ్లీహిల్స్ ‘చెక్ చెక్’ చెక్‌పోస్ట్ | Jubliee hills Check check `check post` | Sakshi
Sakshi News home page

కవనం: జూబ్లీహిల్స్ ‘చెక్ చెక్’ చెక్‌పోస్ట్

Published Sun, Sep 29 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

కవనం: జూబ్లీహిల్స్ ‘చెక్ చెక్’ చెక్‌పోస్ట్

కవనం: జూబ్లీహిల్స్ ‘చెక్ చెక్’ చెక్‌పోస్ట్

కోట్ల కోట్ల రూపాయలు  పారుతున్నట్టు రంగురంగుల కార్లు, బైకులు
 ప్రవహిస్తుంటాయక్కడ...  ఆ పక్కనే... పచ్చని చెట్ల కింద
 పచ్చదనం నోచుకోని బతుకులు  పచ్చలైటంటే వాళ్లకి కోపం
 రోజూ ఛస్తున్నవాళ్లకి చచ్చేంత కోపం  ఎర్ర లైటంటే ప్రాణం-
 ఎర్ర లైటంటే బతుకు -  ‘సిగ్నల్’ పడితే చాలు
 ఆస్తి పంజరాలకి విసుగు  అస్థి పంజరాలకి జీవితం
 పసిపిల్లలు - ముసలివాళ్లు  గర్భిణీలు - తల్లీపిల్లలు
 బిచ్చగాళ్లు - పిచ్చివాళ్లు  నిండుకున్న బతుకులు
 మండుతున్న జీవితాలు  హారన్ల మోతల్లో ఆర్తనాదాలు...
 పెట్రో డీజిల్ పొగల్లో ఆకలి మంటలు...   ‘సిగ్నల్’ ఎర్రబడింది.
 కంప్యూటర్ అంకెలు అక్కడి బతుకులకి  ‘ప్రతీక’గా వెనక్కి పరుగెడుతున్నాయి.
 ‘వంద’ నుండి ‘సున్న’ వరకు కౌంట్‌డౌన్ అందరికి  ‘వంద’ నుండి ‘సున్న’ వరకు కౌంట్‌అప్ కొందరికి
 ఆ కాసేపు... బలిసిన జీవితాలు  అసహనంగా సేద తీర్తాయి...  అలిసిన బతుకులు ఆశగా
 అడుక్కుంటాయి.
 
 అవిటితనం  గుడ్డితనం  చెవిటితనం
 లేమితనం  చావుతనం  అసంపూర్ణ దేహం - సంపూర్ణ దుఃఖం...
 లోహాల చుట్టూ... దేహాల పరుగులు
 2 నిమిషాల్లో జీవితానికి సరిపడినంత యుద్ధం చేయాలి.
 వంద నుండి సున్న అయ్యేలోపు బతుకు ‘సున్న’ అవకుండా
 కాపాడుకోవాలి.
 కాళ్లు లేని పరుగుతో
 కళ్లు లేని చూపుతో
 దేహమంతా చేతులై అడుక్కుంటారు...
 కళ్లూ, కాళ్లూ, చేతులంటూ మిగిలుంటే
 అడుక్కోవడానికే పుట్టుంటాయి.
 ‘దేహం’ అంతా ఆకలి దాహంతో
 ‘దహనం’ అవుతుందక్కడ!
 
 100- - 99 - 98...
 ఏ ధర్మాత్ముడి చేయి కదుల్తుందో
 ఏ పుణ్యాత్ముడి గుండె కరుగుతుందో
 
 
 ఏ మహాత్ముడి ఆత్మ కరుణిస్తుందో
 ఏ దయాత్ముడి కారు డోరు తెరుచుకుంటుందో
 ఆశ... పేరాశ... దురాశ...
 ఆట... వెంపర్లాట... వెదుకులాట... ‘బతుకులాట’
 
 90 - 89 - 88...
 కారు అద్దం తుడిస్తే, బైకు నంబర్ తుడిస్తే
 అమ్మా, అయ్యా, అన్నా, అక్కా, బాబూ ధర్మమంటూ ఏడిస్తే...
 పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ
 ఏదో ఒకటి చేయ్... లేదంటే
 అడ్డం పడ్డావని విసుక్కుంటాడు.
 కుంటుతూనో, దేకుతూనో, తచ్చాడుతూనో పరుగెత్తు...
 ఈ కార్ కాకపోతే ఆ బైకు
 ఆ ఆటో కాకపోతే ఈ వ్యాను
 
 80 - 79 - 78...
 పట్టించుకోని వాడొకడు
 ఇటే చూస్తూ ఎటో మాట్లాడేవాడొకడు
 ఇకిలించేవాడొకడు
 విసుక్కునేవాడొకడు
 వాగేవాడొకడు
 తాగిన మైకంలో ఒకడు
 మరేదో మైకంలో ఒకడు...
 మానసిక వికలాంగులు...
 ‘సిగ్నల్’ పడుద్దేమో!!
 దేవుడా! దయాగుణం తొందరగా ఇవ్వు.
 అడుక్కోడానికి మా దగ్గర చచ్చేంత టైముంది
 ఇవ్వడానికే వాళ్ల దగ్గర అస్సలు టైము లేదు.
 లెక్కల మెదళ్లకు - రెక్కల కార్లకు
 ఉన్నంత స్పీడు, మనస్సుకి కూడా పెట్టు దేముడా...
 
 70 - 69 - 68...
 అక్కడే ఎక్కడో
 మంచోళ్లూ, మనసున్నోళ్లూ ఉండే ఉంటారు.
 వెదకండి... వెదకండి... ‘మంచితనం’ అట్టే కనపడదు, ఇట్టే వినపడదు.
 దొరికేవరకూ పరుగెత్తండి...
 వెళ్లండెళ్లండి...
 
 60 - 59 - 58...
 - చిల్లర లేదు ఫ్పో...
 - ఏదైనా చేసుకు బతకొచ్చుగా
 - అడుక్కోవడం ఫ్యాషనైంది
 - పనీ పాటా లేదు ఎదవలకి
 - బానే ఉన్నావుగా ఎంటి
 దొబ్బుడాయి...
 - చౌరస్తాల్లో నాన్సెన్స్ అయిపోయిందండి... ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేయొద్దు.
 
 50 - 49 - 48...
 రేబాన్ నల్లద్దాల బైకులోళ్లూ...
 చేతులలా విదిలించకండి...
 ఈగల మోతా, దోమల గుంపూ కాదు...
 పొగకి, సెగకి - దుమ్ముకీ, ధూళికీ
 నల్లబడ్డ మల్లెపూలు
 నాలుగైదేళ్ల పసోళ్లు...
 నల్ల కల్లోళ్లకి అంతా నల్లగానే కనపడుద్ది
 విచిత్రం... నల్లగా వినపడుద్ది కూడా!
 
 40 - 39 - 38...
 ఎ ఫర్ యాపిల్
 
 బి ఫర్ బిల్డింగ్... కార్‌లో బేబీలు
 ఎ ఫర్ ఆకలి
 బి ఫర్ బిచ్చం... కాలే రోడ్డుపై
 పసిబిడ్డలు
 
 బాబూ... సార్... అమ్మా...
 విమానం బొమ్మలు, కార్ బొమ్మలు
 టెడ్డీ బేర్‌లు, మస్కిటో బ్యాట్‌లు
 
 టిష్యూలు, ఇయర్ బడ్సూ...
 గొడుగులూ, రబ్బరు బంతులూ
 ఛార్జర్లూ, బ్యాటరీ లైట్లూ...
 దేవుళ్లూ, జాతీయ జెండాలు
 ఒక్కటేమిటి...
 క్షణాల్లో కదిలొచ్చే మినీ అంగడి...
 వందే సార్, డెబ్భై ఐదు సార్
 పోనీ యాభై, ముప్ఫై సార్... సార్...
 సిగ్నల్ పడుతోంది... అమ్మా
 తీసుకోండయ్యా...
 అటేపు వచ్చి డబ్బు తీసుకుంటాం... తీస్కోండన్న...
 మర మనుషులకి
 మర బొమ్మలమ్మే ప్రయత్నం...
 
 30 - 29 - 28...
 బొమ్మలు, గాలి బొమ్మలు
 గాలి బుడగలు
 గాలి నింపిన బొమ్మలతో
 గాలి బతుకులు...
 నరాల నుండి, కండరాల నుండి
 కడుపు కోత నుండి, గుండె మంట నుండి
 ఊపిరితిత్తుల సంచుల నుండీ
 గొంతునొప్పి నుండి
 దేహమంతా ఊపిరితిత్తులై
 గాలి నింపీ నింపి
 ఊదీ ఊది... కళ్లు తేలేసిన
 ‘మానవాకారాలు’
 తిండి మాట దేముడెరుగు
 గాలి మాత్రం తింటారు
 బతుకు నింపటం కోసం...
 గాలి కరువై గుండె బరువైన
 గాలి బతుకులు
 గాలి బొమ్మలమ్మే గాలి బుడగల
 జీవితాలు...
 
 20 - 19 - 18...
 ఏసీ గాలి, ఇంగ్లీషోడి పాట
 
 చెవిలో బ్లూ టూత్, మెదడులో
 బ్లూ ఫిల్మ్
 ఆకలి కేకలు విన్పించవ్
 కదిలే శవాలు కన్పించవ్
 సమూహంలో ఏ‘కాంత’ ప్రయాణం
 అన్నా... తిరుగన్నా... అన్నా...
 హమ్మయ్య తిరిగాడు... ధర్మం చేయన్న...
 తన ‘ప్రాయం’ తనకే బరువై, భారమై
 ఆచ్ఛాదనకి నోచుకోని ‘ఆమె’
 ‘లేడి’లా కన్పిస్తుంది ఆ తిరిగిన ‘పులి’కి
 నల్ల కళ్లద్దాల్లోంచి...
 కారు అద్దాల్లోంచి...
 ఆమె చిరుగుల అంగీలోంచి
 మాంసం ముద్దలవేపు ‘రుచి’గా చూస్తుందా ‘పులి’
 ‘ఆకలి’తో ఈమె ఇటేపు
 ‘ఆకలి’గా వాడు అటేపు
 ఛీ! ఛీ!! వచ్చేయమ్మా
 నువ్వు అబలవీ, సబలవీ
 వనితవీ, వీరనారివీ కావు...
 పాపం ఆడదానివి...
 నిన్ను నువ్వు కాపాడుకోలేవు. వచ్చేయ్. వచ్చేయ్...
 ఇదీ ‘జనారణ్యం’ తల్లీ
 జంతువులుంటాయి... ఇక్కడ...
 
 10 - 9 - 8 - 7...
 ఆవిరవుతున్న రక్తాన్ని
 ఎముకలవుతున్న దేహాన్ని
 అస్పష్టమవుతున్న చూపుని
 కొడగంటుతున్న ప్రాణాన్ని
 కూడదీసుకుని, ఊపిరి బిగపట్టుకుని
 ఓ ‘ముద్ద కోసం’
 ‘మట్టి ముద్దల్ని’ ప్రార్థించండి
 అడుక్కోవడమో, అమ్ముకోవడమో
 త్వరగా... త్వరగా... చేయండి.
 
 6 - 5 - 4...
 త్వరగా అడుక్కోండి...
 మళ్లీ రేప్పొద్దున్న ‘అమెరికా ప్రెసిడెంట్’ వస్తున్నాడంటూ
 మిమ్మల్ని ఊరి చివర పారే (తే)స్తారు.
 ‘బిచ్చగాళ్లే’ లేని ‘దేశం’ మాదంటూ
 ‘మిలియన్ల బిచ్చం’ అడుక్కుంటాం.
 ‘గరీబీ’ హఠావో నా?!
 ‘గరీబ్’ కో హఠావో నా??!!
 సెల్యూట్ టూ మై కంట్రీ...
 
 3 - 2...
 కవర్ పేజీ... చివరి పేజీ...
 తెలియని ‘బతుకు పుస్తకాలు’ మీవి
 ఎవడు రాసి ‘పడేశాడో’
 చదివితే చదువుతాం
 లేదంటే
 చిత్తు కాగితాలోడికి మేమే అమ్మేస్తాం...
 చెత్త కుండీల్లోకి గిరాటేస్తాం...
 1... 0 (సున్న)... శూన్యం’
 
 (‘రచయిత’గా స్పందన సరే!
 ‘మనిషి’గా ఎంతవరకు స్పందిస్తున్నా...
 నాకు నేనే ప్రశ్న? ప్రశ్న% ప్రశ్నఁ ప్రశ్న+ ప్రశ్న-)
 - ఉత్తేజ్
 సినీ నటుడు, కవి, రచయిత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement