సహజాహారంపై ఆసక్తి ఉంటే చాలు..! | Learned a lot of through intipanta | Sakshi
Sakshi News home page

సహజాహారంపై ఆసక్తి ఉంటే చాలు..!

Published Wed, Nov 5 2014 11:54 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

సహజాహారంపై ఆసక్తి ఉంటే చాలు..! - Sakshi

సహజాహారంపై ఆసక్తి ఉంటే చాలు..!

ఫేస్‌బుక్‌లో ‘ఇంటిపంట’ను ఫాలో అవుతూ వారానికి 4 రోజులు ఇంటికి సరిపడా ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నది డాక్టర్ వసంత శ్రీనివాసరావు కుటుంబం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. శ్రీనివాసరావు తన క్వార్టర్ మేడ మీద గత ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్నారు. భార్య పుష్ప, తల్లి మంగమ్మ సహకరిస్తుండగా.. పిల్లలు శ్రీరాజ్, దీవెనశ్రీ ఇంటిపంటల సాగులో మెలకువలను శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
 
* మేడపై నిశ్చింతగా ఇంటిపంటలు సాగు చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్
* సొంతంగానే జీవామృతం, ఘనజీవామృతం, కషాయాల తయారీ
* పిడకల బూడిదకు పసుపు కలిపి చల్లితే పూత రాలదు... జీవామృతంతో పెరిగిన దిగుబడి

హెచ్‌సీయూ ఆవరణలోని డా. శ్రీనివాసరావు టై కిచెన్ గార్డెన్ పంటల జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మేడ మీద అడుగున్నర ఎత్తున ఏర్పాటు చేసిన రెండు మడుల్లో అల్లం, పసుపు,  ఉల్లి, చేమదుంప, బంగాళాదుంప, క్యారట్, ముల్లంగి వంటి దుంప జాతి మొక్కలు.. బకెట్లలో దోస, బీర, పొట్ల, కాకర తదితర తీగజాతి పాదులు.. గ్రోబాగ్స్, చెక్క కంటెయినర్లలో పాలకూర, తోటకూర, బచ్చలి, మెంతికూర, కొత్తిమీరతోపాటు స్వీట్‌కార్న్, మిరప, టమాటా, చెట్టుచిక్కుడు, కరివేపాకు, మునగ, గోరుచిక్కుడు, చెరకు, జొన్న పెంచుతున్నారు. పెద్ద కంటెయినర్లలో జామ, దానిమ్మ, నిమ్మ తదితర పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు.  
 
గత ఏడాది జూన్‌లో పిల్లలకు మొక్కలపై అవగాహన కలిగించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఇంటిపంటల సాగు చీడపీడల బారిన పడి కళ్లముందే పాడవడం తనను బాధించిందని, ఈ ఏడాది అన్నపురెడ్డి శివరామిరెడ్డి వంటి ‘ఇంటిపంట’ ఫేస్‌బుక్ బృంద సభ్యుల సలహాలతో చీడపీడలను అధిగమించగలిగానన్నారు శ్రీనివాసరావు. ప్రతి రోజూ మొక్కలను పరిశీలిస్తూ.. వాటికి ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నానన్నారు. పోషక లోపం రాకుండా నాటు ఆవు పేడ, మూత్రం తదితరాలతో జీవామృతం, ఘనజీవామృతం.. నాటు గుడ్లు, నిమ్మ రసంతో ఎగ్ అమైనో యాసిడ్, చీడపీడల నుంచి రక్షణకు ఏడు రకాల ఆకులతో కషాయం, వేపకషాయాలను స్వయంగా తయారు చేసుకొని వాడుతున్నారు.

జీవామృతం వాడుతున్నప్పటి నుంచి పంటల దిగుబడి పెరగడం గమనించానన్నారు. ఆవు పేడతో చేసిన పిడకల బూడిదకు కొంచెం పసుపు కలిపి మొక్కలపై చల్లుతుంటే.. పూత బాగా వస్తోందని, పూత రాలకుండా దిగుబడి బాగా వస్తోందన్నారు. మేడల మీద ఇంటిపంటల సాగు సహజాహారం లభ్యతను పెంచడంతోపాటు సామాజిక సంబంధాలపై చూపుతున్న సానుకూల ప్రభావం గురించి అధ్యయనం చేయదలచానని సామాజిక శాస్త్రవేత్త అయిన డా. శ్రీనివాసరావు వెల్లడించారు.
 
‘ఇంటిపంట’ ద్వారా ఎంతో నేర్చుకున్నా!
మేడ మీద కుండీలు, మడుల్లో ప్రకృతి వ్యవసాయం మేము ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలనిస్తోంది. సహజాహారంపై ఆసక్తితో రోజూ ఒక గంట సమయం కేటాయించగలిగితే మేడ పైన ఉన్న పరిమిత స్థలంలోనే ఇంటికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలను చీడపీడల భయం లేకుండా పండించుకోవచ్చు. చీడపీడల భయం, పోషక లోపం సమస్యల్లేకుండా ఏ మొక్కయినా మేడ మీద పెంచడం ఎలాగో నేర్చుకున్నాను. జీవామృతం, కషాయాలు నేనే తయారు చేసి, ఇతరులకూ ఇవ్వగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది. అనేక మందికి మా టై గార్డెన్ స్ఫూర్తినిస్తుండడం తృప్తినిస్తోంది. ప్రస్తుతం వారానికి 4 రోజులు మా కూరగాయలే తింటున్నాం. వచ్చే ఏడాది పూర్తిగా మావే తినేందుకు వీలుగా ఇంటిపంటల సాగును విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
 - డా. వసంత శ్రీనివాసరావు(94922 93299), అసిస్టెంట్ ప్రొఫెసర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement