న్యూఢిల్లీ: టాప్–500 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ పూర్తిచేసిన వారు కూడా భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి అర్హులేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. క్వాకరెలి సైమండ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్, షాంఘై జియావో టోంగ్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న వర్సిటీల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్, లా, సోషల్ సైన్సెస్, లాంగ్వెజేస్, లైబ్రరీ సైన్స్, జర్నలిజం–మాస్ కమ్యూనికేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో నియామకాలకు తాజా నిబంధనలు వర్తిస్తాయని యూజీసీ తెలిపింది. ప్రస్తుతం, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత సాధించాలంటే అభ్యర్థులు భారతీయ విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత కోర్సులో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి. నెట్, సెట్, స్లెట్ లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు అర్హత సాధించడం ద్వారా రాత పరీక్ష నుంచి మినహాయింపు పొందినా, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని యూజీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment