పరిశోధనా? ఉపరితల శోధనా? | Sakshi Editorial on UGC to Invite Industry Experts to Teach at Varsities | Sakshi
Sakshi News home page

పరిశోధనా? ఉపరితల శోధనా?

Published Tue, Mar 15 2022 12:16 AM | Last Updated on Tue, Mar 15 2022 8:05 AM

Sakshi Editorial on UGC to Invite Industry Experts to Teach at Varsities

కార్యకారణాలేమైనా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇన్నాళ్ళకు కళ్ళు తెరిచినట్టుంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేందుకు ఆయా రంగాల నిపుణులను వినియోగించుకోవాలని నిర్ణయించడం మంచిదే. ఎంత అనుభవం, నైపుణ్యం ఉన్నా – పీహెచ్‌డీ పట్టా కానీ, జాతీయ అర్హతా పరీక్ష (నెట్‌)లో కృతార్థులై కానీ ఉంటే తప్ప అధ్యాపకులుగా పనిచేయడానికి వీలు లేదన్న షరతుకు వెసులుబాటు లభించింది. సివిల్‌ సర్వీసులలో లాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్‌ ఆచార్య పదవుల్లోకి లేటరల్‌ ఎంట్రీ వచ్చినట్టయింది. ఈ కొత్త విధానంతో పాటు, కొంతకాలంగా ఉద్యోగానికీ – పీహెచ్‌డీకీ ముడిపెట్టిన ప్రహసనంపై ఇప్పుడు చర్చ రేగింది. 

నిజానికి డాక్టోరల్‌ థీసిస్‌ (పీహెచ్‌డీ) అనేది నిర్ణీత అంశాన్ని లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తితో, మనసు పెట్టి చేయాల్సిన పని. ఉద్యోగార్హత కోసం చేసే మొక్కుబడి వ్యవహారం కాదు. అలాగే, నాణ్యమైన బోధన చేయాలంటే పీహెచ్‌డీ చేసి తీరాలని అనుకోవడం బోడిగుండుకూ, మోకాలికీ ముడిపెట్టడమే! అద్భుతంగా పాఠం చెప్పగలిగినవాళ్ళందరూ పరిశోధకులై ఉంటారనుకున్నా, ఉత్తమ పరిశోధకులైనంత మాత్రాన అర్థమయ్యేలా పాఠం చెప్పే నేర్పు ఉంటుందనుకున్నా పొరపాటు. విధాన నిర్ణేతలు ఈ చిన్న తర్కం మర్చిపోయారు. పీహెచ్‌డీ చేయకున్నా, దాదాపు 40 గౌరవ డాక్టరేట్లొచ్చిన అబ్దుల్‌ కలామ్‌ ఎంత అద్భుత బోధకులో గుర్తు చేసుకోవాలి. అధ్యాపకులుగా ఎంపిక కావాలన్నా, ఇప్పటికే అధ్యాపక వృత్తిలో ఉన్నవారు ఆ పనిలోనే కొనసాగాలన్నా పీహెచ్‌డీ చేసి తీరాల్సిందే అని కొన్నేళ్ళ క్రితం పెట్టిన నిబంధన నిర్హేతుకమనేది అందుకే! 

ఒకప్పుడు ఉద్యోగానికి పీహెచ్‌డీ తప్పనిసరి కాదు. 2021 జూలై నుంచి యూనివర్సిటీ బోధనకు పీహెచ్‌డీ తప్పనిసరి చేసింది యూజీసీ. కరోనాతో తేదీని 2023 వరకు పొడిగించారు. కానీ, ఉన్నత విద్యాబోధనలో ఉండాలంటే పీహెచ్‌డీ సాధించాల్సిందేనని మెడ మీద కత్తి పెడితే ప్రయోజనం ఉంటుందా? ఒకప్పుడు డాక్టరేట్‌ అంటే అదో విశిష్ట సాధన. గౌరవ డాక్టరేట్లు, కష్టపడి పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టాతో పేరు ముందు వచ్చే డాక్టర్‌ అనే మూడక్షరాలు  సమాజంలో విశేష గౌరవం. ఆ మోజు పెరిగేసరికి పేరు లేని విదేశీ సంస్థల మొదలు ప్రైవేట్‌ విద్యా లయాల దాకా అనేకుల గౌరవ డాక్టరేట్లు ఇవాళ అంగడి సరుకయ్యాయి. గౌరవ డాక్టరేట్లను పేరు ముందు ఇంటి పేరులా వాడరాదన్నది విస్మరించిన వేళ అసలు డాక్టరేట్‌కే గౌరవం లేకుండా పోయే ప్రమాదం వచ్చింది. 

1920లలో మన దగ్గర కొన్ని డజన్ల మందే పీహెచ్‌డీ స్కాలర్లుండేవారు. ఇవాళ అమెరికాలో ఏటా 64 వేలకు పైగా డాక్టరేట్లు వస్తుంటే, 24 వేల మంది పీహెచ్‌డీ స్కాలర్లతో మనం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం. 2010తో పోలిస్తే 2017లో పీహెచ్‌డీలో చేరేవారి సంఖ్య రెట్టింపు దాటింది. 2000 నాటికి దేశంలో డాక్టరేట్‌ ప్రదానం చేసే సంస్థలు 326. కానీ, 2017 కల్లా వాటి సంఖ్య 912 అయిందంటే పీహెచ్‌డీ ఎంత వేలంవెర్రిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, నిరంతర అధ్యయనం, క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రొఫెసర్ల మార్గదర్శనం, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పత్రాల సమర్పణ – అంతా ఒక సీరియస్‌ జ్ఞానార్జన. కానీ, ఇవాళ పరిశోధకులకే కాదు... వారికి దిశా నిర్దేశ విధుల్లో ఉన్న చాలామందిలోనూ విషయ పరిజ్ఞానం హుళక్కి. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయ శాఖలు పీహెచ్‌డీ స్కాలర్లను టోకున బయటకు పంపే కర్మాగారాలయ్యాయి. అనేకచోట్ల అజ్ఞాత రచయితల సహకారం, గ్రంథ చౌర్యం, నాసిరకం పరిశోధనాంశాలు, పత్రాలతో ప్రమాణాలు నానాటికీ తీసికట్టు అయ్యాయి. నాలుగు వాక్యాలు రాయలేనివాళ్ళు, నాలుగు మాటలు సదస్సులో మాట్లాడలేనివాళ్ళూ నేడు పీహెచ్‌డీ పట్టాదారుల్లో ఉంటున్నారన్నది నిష్ఠురమైన నిజం.  

ఉద్యోగానికీ, ఉద్యమంగా చేయాల్సిన పరిశోధనకూ లింకు పెట్టడం మన విధాన నిర్ణేతల ఘోర తప్పిదం. దానివల్లే పీహెచ్‌డీ ప్రవేశాలు 50 శాతం పెరిగాయి. ప్రమాణాలు పాతాళానికి చేరాయి. కనీసం మూడు నుంచి అయిదేళ్ళ కఠోర శ్రమతో తపించి చేయాల్సిన పరిశోధనపై తపన లేనివాళ్ళు కూడా ఉద్యోగం కోసం వట్టి ఉపరితల శోధకులవుతున్న దౌర్భాగ్యం. ఆర్ట్స్‌ మొదలు సైన్స్‌ దాకా అనేకచోట్ల ఇదే పరిస్థితి. ఏటా 60 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, 15 లక్షల మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు వస్తున్న దేశంలో నిఖార్సయిన పరిశోధక విద్యార్థుల శాతం ప్రశ్నార్థకమే. విశ్లేషణాత్మక శోధన, వర్తమాన ప్రాసంగికత లోపించి, పునరుక్తులతో, సర్వే ఆధారిత సిద్ధాంతాలుగా తూతూ మంత్రపు ఉపరిశోధనలు పెరిగిపోయాయని తాజా నివేదికల మాట. వెరసి, జ్ఞానార్జనలో సరికొత్త అంశాలు వెలికి తీయాల్సిన పరిశోధన మౌలిక లక్ష్యం, లక్షణం నిర్వీర్యమైపోతున్నాయి. 

మౌలిక పరిశోధన మృగ్యమై, ఎంతసేపటికీ చూచిరాతలు, ఎత్తిపోతలతోనే వివిధ శాఖల్లో పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథాలు సిద్ధమవుతున్నట్టు ఆరోపణ. గ్రంథ చౌర్యాన్ని కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను కొన్నేళ్ళ క్రితం ప్రవేశపెట్టారు. కానీ, ఆ ఒక్క పనితో పీహెచ్‌డీల నాణ్యత పెరుగుతుందా? చిత్తశుద్ధి లేని పీహెచ్‌డీతో నిర్ణీత విద్యాశాఖకు కలిగే ప్రయోజనం ఏమిటి? అలాంటి వారు బోధకులైతే విద్యా ర్థులకు వచ్చిపడే విజ్ఞానం ఏముంటుంది? ఇప్పటికైనా నిష్ప్రయోజనమైన ఈ డిగ్రీల తంతును వదిలించుకొని, నిఖార్సయిన పరిశోధనలను యూజీసీ, మానవ వనరుల అభివృద్ధిశాఖ ప్రోత్సహిస్తే మేలు. ప్రహసనప్రాయంగా మారిన ‘నెట్‌’ లాంటి వాటి పైనా పునఃసమీక్ష అవసరం. పీహెచ్‌డీ లేకున్నా, అనుభవజ్ఞులైన వారి సేవలు తీసుకోవాలన్న తాజా నిర్ణయం అందుకే స్వాగతనీయం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement