‘పీహెచ్‌డీ ఎక్సలెన్స్ సైటేషన్’ అవార్డులకు యూజీసీ ప్రణాళిక
ఏటా 10 ఉత్తమ పరిశోధనలకు గుర్తింపు.. విశ్వవిద్యాలయాల స్థాయిలో స్క్రీనింగ్
ప్రతి వర్సిటీ నుంచి ఐదు ఉత్తమ థీసిస్‌ల ఎంపిక
వాటన్నింటి పరిశీలనకు యూజీసీలో ప్రత్యేక కమిటీలు
10 థీసిస్‌ల ఎంపిక.. సెప్టెంబర్ 5న అవార్డులు
అభిప్రాయ సేకరణకు మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించి, నాణ్యతను పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత స్థాయి అవార్డులను ప్రవేశపెడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పీహెచ్‌డీ పరిశోధనలు అందించిన వారిని ‘పీహెచ్‌డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో సత్కరించనుంది. నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాల్లో భాగంగా ఏటా వివిధ విభాగాల్లో అత్యుత్తమమైన పది పీహెచ్‌డీ థీసిస్‌లకు ఈ అవార్డు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రాల దగ్గర నుంచి వైద్య శాస్త్రాలతో సహా ఐదు విభాగాల్లో రెండు చొప్పున ఉత్తమ థీసిస్‌లకు సైటేషన్ అవార్డులు ప్రదానం చేస్తారు. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం యూజీసీ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏటా సెప్టెంబర్ 5న ప్రదానం
ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కాన్వకేషన్ ద్వారా పీహెచ్‌డీలు పొందిన రీసెర్చ్ స్కాలర్లు తదుపరి ఏడాదిలో ‘సైటేషన్’ అవార్డుకు అర్హులుగా పేర్కొంది. రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల నుంచి పీహెచ్‌డీలు పొందిన వారు వర్సిటీల ద్వారా నామినేట్ అవ్వొచ్చు. ఇందుకోసం ప్రతి విశ్వవిద్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఏటా ఐదు థీసిస్‌లను నామినేట్ చేస్తుంది. ఏటా జనవరి నుంచి మార్చి 31 వరకు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వర్సిటీల నుంచి నామినేషన్లు యూజీసీ స్వీకరిస్తుంది. ఆగస్టు 1న విజేతలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ‘పీహెచ్‌డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో విజేతలను యూజీసీ సత్కరిస్తుంది.
యూజీసీ అధ్యయనం ప్రకారం దేశంలో పీహెచ్‌డీలో ప్రవేశాలు భారీగా పెరుగుతున్నాయి. 2010–11లో దేశవ్యాప్తంగా 77,798 పీహెచ్‌డీ ప్రవేశాలు నమోదవగా, 2017–18లో ఈ సంఖ్య 1,61,412కు పెరిగింది. ఏటా సగటున 10 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది.
కొత్త ఆవిష్కరణలు అవసరం
కొత్త ఆవిష్కరణలు దేశ అభివృద్ధికి చాలా అవసరం. ఉన్నత విద్యా సంస్థలు కొత్త విజ్ఞానాన్ని సమాజానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది డాక్టోరల్ డిగ్రీల నాణ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. భారతీయ విశ్వవిద్యాలయాలలో మంచి నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించే ప్రయత్నంలో యూజీసీ ఏటా ‘పీహెచ్‌డీ ఎక్సలెన్స్ సైటేషన్’ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ప్రజాభిప్రాయం కోసం మార్గదర్శకాలను విడుదల చేశాం. – మామిడాల జగదీశ్ కుమార్, యూజీసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment