ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు అవార్డులు  | 76 DGP Disc Awards for 2022: andhra pradesh | Sakshi
Sakshi News home page

ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు అవార్డులు 

Published Sun, Dec 17 2023 6:34 AM | Last Updated on Sun, Dec 17 2023 2:51 PM

76 DGP Disc Awards for 2022: andhra pradesh - Sakshi

అవార్డులు పొందిన పోలీసులతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి   

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల విభాగంలో 2022 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 76 మంది పోలీసు కానిస్టేబుళ్లు, అధికారులకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీ డిస్క్‌ అవార్డులు అందజేశారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల విభాగం, దిశ, కర్నిక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్‌ నుంచి అదనపు డీజీ వరకు వీటిని ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది ఎస్పీలు గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. కానిస్టేబుల్‌ నుండి ఐపీఎస్‌ల వరకు 56 మంది సిల్వర్‌ మెడల్స్, 5 మంది డీఎస్పీలు, ఏఎస్‌ఐలకు బ్రాంజ్‌ మెడల్స్‌ను డీజీపీ అందజేశారు. 

సత్ఫలితాలు ఇస్తున్న కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌ : డీజీపీ 
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది జూన్‌ నుంచి చేపట్టిన కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌ విధానం సత్పలితాలు ఇస్తోందని డీజీపీ తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్‌ అధికారి (సీపీ, ఎస్పీ) వారి పరిధిలోని ముఖ్యమైన ఐదు, ఆరు  కేసులు ప్రతిరోజూ పర్యవేక్షించేలా చూస్తున్నామన్నారు. షెడ్యూల్‌ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు విచారణ పురోగతిపై సమీక్షించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ఈ సంవత్సరం తీవ్రమైన నేరాల నమోదు శాతం గణనీయంగా తగ్గిందని తెలిపారు. నేరాల తీవ్రత ఆధారంగా గత సంవత్సరంలో గుర్తించిన 165 కేసులు న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసుకొని నూటికి నూరు శాతం నిందితులకు శిక్షలు పడ్డాయని చెప్పారు.  

ఇతర విభాగాల్లోనూ ఉత్తమ సేవలను గుర్తిస్తాం 
పోలీస్‌ శాఖలోని ఇతర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), సీఐడీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్, ఏపీఎస్‌పీ బెటాలియన్స్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబి)లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది వివరాలు సేకరిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వారికి త్వరలోనే డీజీపీ డిస్క్‌ అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకరంగా ఉండేందుకే ఈ అవార్డులను అందిస్తున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement