
సాక్షి, న్యూఢిల్లీ: సాంకేతిక సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్‌డీ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్‌చేస్తూ ప్రియదర్శిని తదితరులు దాఖలు చేసిన పలు స్పెషల్ లీవ్ పిటిషన్లను బుధవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషీకేష్‌రాయ్‌ల ధర్మాసనం విచారించింది. ‘‘పే స్కేల్స్, సర్వీస్ కండీషన్స్, క్వాలిఫికేషన్ ఫర్ ద టీచర్స్, అదర్ అడకమిక్ స్టాఫ్ ఇన్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్ డిగ్రీ రెగ్యులేషన్స్, 2010’’ని ఏఐసీటీఈ 2010 మార్చిలో జారీ చేసిందని కేరళ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వి.చిదంబరేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ నిబంధనల ప్రకారం 2010 మార్చి 5 నుంచి సాంకేతిక సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్‌డీ చేసిన వారే అర్హులని కోర్టుకు తెలిపారు. చిదంబరేష్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ‘‘2003 ఫిబ్రవరి 18 నోటిఫికేషన్ ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్ (తదనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మార్చారు) పోస్టు వచ్చిన ఏడేళ్లలో పీహెచ్‌డీ పొందాలి. అయితే ఇది 2010 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత నుంచి పీహెచ్‌డీ పొందిన తర్వాత తేదీ నుంచి పోస్టు పరిగణనకు అర్హులు’’ అని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment