సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్‌డీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తప్పనిసరి చేసింది. 2021 జూలై 1 తరువాత చేపట్టే నియామకాలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో పదోన్నతికీ పీహెచ్‌డీ ఉండాలని స్పష్టం చేసింది. కాంట్రా క్టు, ఔట్ సోర్సింగ్, తాత్కాలికం.. పేరేదైనా ఉన్నత విద్యా సంస్థలకు మంజూరైన పోస్టుల్లో తాత్కాలిక సిబ్బంది 10 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది.
ఈ మేరకు వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది నియామకాలకు సరికొత్త నిబంధనలు రూపొందించింది. ‘యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఆన్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్‌మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ అదర్ అకడమిక్ స్టాఫ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అండ్ మెజర్స్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2018’పేరుతో డ్రాఫ్ట్ మార్గదర్శకాలను అందుబాటులోకి తెచ్చింది.
సీనియర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెం ట్ ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్ తదితర పోస్టుల భర్తీ, పదోన్నతుల్లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అర్హతలు, పనిదినాలు, అకడమిక్ అంశాలను అందులో పొందుపరిచింది. మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో ఉంచిన యూజీసీ.. ఆ అంశాలపై ఈ నెల 28లోగా అభిప్రాయాలు తెలపాలని వర్సిటీలు, కాలేజీలను కోరింది. అభిప్రాయ సేకరణ తరువాత తుది మార్గదర్శకాలను జారీ చేసి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో త్వరలో భర్తీ చేయనున్న 1,061 పోస్టులకూ ఈ నిబంధనలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
మార్గదర్శకాల్లోని ప్రధానాంశాలు
♦ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసే వారికి పీహెచ్‌డీ ఉండాలి.
♦ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులుండాలి. అలాగే నెట్, స్లెట్, సెట్, పీహెచ్‌డీలలో ఒక అర్హత ఉండాలి.
♦ 1991 సెప్టెంబర్ 19కి ముందు పీహెచ్‌డీ చేసిన వారికి పీజీలో 50% మార్కులున్నా సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం మార్కులున్నా చాలు.
♦ 2021 జూలై 21 తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్‌డీ ఉండాల్సిందే.
♦ విద్యా సంస్థలో మంజూరైన మొత్తం పోస్టుల్లో తాత్కాలిక అధ్యాపకులు 10 శాతానికి మించకూడదు.
♦ పేరేదైనా తాత్కాలిక పద్ధతిలో పని చేసే అధ్యాపకులకు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వేతనమివ్వాలి.
♦ కనీసం 180 పని దినాలు అమలు చేయాలి. వారంలో 6 రోజుల పనిదినాలు ఉంటే.. విద్యా సంవత్సరంలో 30 వారాలు ప్రధాన బోధన కొనసాగించాలి.
♦ మిగిలిన సమయంలో 12 వారాలు ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, పాఠ్య కార్యక్రమాలు, స్పోర్ట్స్, కాలేజ్‌డే కార్యకలాపాలకు కేటాయించాలి.
♦ 8 వారాలు సెలవులు, 2 వారాలు ప్రజా సెలవులకు కేటాయించాలి.
♦ వారంలో 40 గంటలకు తక్కువ కాకుండా పనిదినాలు ఉండాలి. రోజుకు 7 గంటలు అధ్యాపకులు కాలేజీలో ఉండాలి.
♦ విద్యార్థులకు వివిధ అంశాలపై మార్గదర్శనం కోసం 2 గంటలు కేటాయించాలి. కమ్యూనిటీ డెవలప్‌మెంట్, సాంస్కృతిక, గ్రంథాలయ కార్యక్రమాలకు సమయమివ్వాలి. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్‌ను కోఆర్డినేటర్‌గా నియమించాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీలో..
అకడమిక్ స్కోర్‌కు 80 మార్కులు
రీసెర్చ్ పబ్లికేషన్స్‌కు 10 మార్కులు
బోధన అనుభవానికి 10 మార్కులు
మొత్తంగా 100 మార్కులు
అకడమిక్ స్కోర్‌లో గరిష్టంగా ఇచ్చే మార్కులు
♦డిగ్రీలో 80 శాతానికి పైగా మార్కులొస్తే.. 15 మార్కులు
♦ 60 నుంచి 80 శాతం లోపు ఉంటే.. 13 మార్కులు
♦55 నుంచి 60 శాతం లోపు ఉంటే.. 10 మార్కులు
♦ పీజీలో 80 శాతానికి పైగా మార్కులొస్తే.. 28 మార్కులు
♦ 60 నుంచి 80 శాతం లోపు ఉంటే.. 25 మార్కులు
♦ 55 నుంచి 60 శాతం లోపు ఉంటే.. 20 మార్కులు
♦ ఎంఫిల్‌లో 60 శాతానికి పైగా మార్కులొస్తే.. 7 మార్కులు
♦ 55 నుంచి 60 శాతం లోపు మార్కులుంటే 5 మార్కులు
♦ పీహెచ్‌డీకి 30 మార్కులు
♦ నెట్, జేఆర్‌ఎఫ్ ఉంటే 7 మార్కులు
♦ నెట్/సెట్/స్లెట్ ఉంటే 5 మార్కులు
Comments
Please login to add a commentAdd a comment