న్యూఢిల్లీ: బుద్ధిస్ట్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను మళ్లీ చేపట్టాలని ఢిల్లీ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఈ పోస్టుల భర్తీకి చేపట్టిన ప్రక్రియను రద్దుచేసి కొత్తగా నియామకపు ఉత్తర్వులు జారీచేయాలని పేర్కొంది. రెండు నెలల కాల పరిమితిలో పోస్టులను భర్తీచేయాలని ఆదేశించింది. దీనిపై కొందరు వేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. వివరాలిలా ఉన్నాయి. యూనివర్సిటీలోని పలు విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 2012, జనవరి 11వ తేదీన యాజమాన్యం ప్రకటన ఇచ్చింది. అన్ని విభాగాలకు కలిపి 50 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు అందులో పేర్కొంది. వీటిలో తొమ్మిది పోస్టులను బుద్ధిస్ట్ విభాగానికి కేటాయించింది.
అయితే ఆ విభాగంలో ఎన్నో ఏళ్ల నుంచి అడ్‌హక్ పద్ధతిపై నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వారు ఈ ఏడాది చేపట్టిన పరీక్షలో అర్హతకు కావాల్సిన 50 శాతం మార్కులు సాధించలేదని స్క్రీనింగ్ కమిటీ వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. అయితే స్క్రీనింగ్ కమిటీ ఎంపిక విధానంలోనే తప్పులు దొర్లినట్లు కోర్టు గుర్తించింది. కార్యనిర్వాహక మండలి (ఈసీ) ఆమోదించిన ఎంపిక ప్రక్రియను మార్చే అధికారం స్క్రీనింగ్ కమిటీ (ఎస్‌సీ)కి లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అభ్యర్థి 50 శాతం మార్కులు సాధించనంత మాత్రాన అతడిని ఇంటర్వ్యూకు పిలవకుండా ఆపే హక్కు ఎస్‌సీకి లేదంది. ఈసీ నియమావళి ప్రకారం అతడు ఉద్యోగానికి కావాల్సిన అన్ని స్థాయిలను ప్రదర్శించే అవకాశం ఇచ్చేందుకైనా ఇంటర్వ్యూకు పిలవాల్సి ఉందని పేర్కొంది.
ఈ విభాగంలో భర్తీ ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని పేర్కొన్న పిటిషనర్ల వాదనతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని కోర్టు తెలిపింది. ఇంతకుముందు బుద్ధిస్ట్ విభాగంలో చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను రద్దు చేసి, తిరిగి ఎంపిక ప్రక్రియనుప్రారంభించాలని ఆదేశించింది. అయితే విద్యార్థుల సంక్షేమార్థం ఇప్పటికే ఉద్యోగాల్లో చేరినవారిని కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంతవరకు తొలగించవద్దని సూచించింది. అలాగే భర్తీ విషయంలో ఎటువంటి వివాదాలు లేని పాతవారిని అలాగే కొనసాగించవచ్చని పేర్కొంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు మళ్లీ చేపట్టాలి
Published Sun, Jul 13 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM
Advertisement
Advertisement