న్యూఢిల్లీ: స్వాంతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ 107వ జయంతిని పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ యువ, విద్యార్థి విభాగాలను ప్రారంభించింది. ఆప్ యువ విభాగం(ఏవైడబ్ల్యూ), ఛాత్రా యువ సంఘర్ష్ సమితి(సీవైఎస్‌ఎస్)గా రెండు విభాగాలకు నామకరణం చేశారు. పార్టీని అట్టడుగుస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఈ రెండు విభాగాలు పనిచేస్తాయని ఆప్ నేత ఒకరు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేకపోవడంతో ముందుగా పార్టీని బలోపేతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావించింది. అందుకోసం మిషన్ విస్తార్‌ను ప్రారంభించింది. మిషన్ విస్తార్‌లో భాగంగానే ఈ రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. యువ వలంటీర్లను సమీకరించేందుకు, వారిద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ రెండు విభాగాలు ఎంతగానో ఉపకరిస్తాయని పార్టీ భావిస్తోంది.
ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రచారం కోసం యువత అవసరం ఎంతైనా ఉందని, అందుకోసం ఇటువంటి విభాగాలు ఉండడం అవసరమని, అయితే మిగతా పార్టీల్లాగా యువశక్తిని తాము దుర్వినియోగం చేయబోమని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన రెండు విభాగాలు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువకుల ముందు ఉన్న మంచి వేదికలని, దేశం కోసం పనిచేసే యువకులకు స్వాగతం పలికేందుకు ఈ వేదికలు రెండూ సిద్ధంగా ఉంటాయని కేజ్రీవాల్ చెప్పారు. ప్రతిఒక్కరూ భగత్‌సింగ్‌లాంటివాళ్లు పుట్టాలని చెబుతారని, అయితే పుట్టే బిడ్డ తమ ఇంట్లో కాకుండా పక్కింట్లో పుట్టాలని కోరుకుంటారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఇటువంటి వ్యవస్థను, ప్రజల ఆలోచన తీరును మార్చేందుకే తాము ఈ రెండు విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘నేను ఐఐటీ ఉత్తీర్ణుడినైనప్పుడు దేశానికి ఎలా సేవ చేయాలా? అని ఆలోచించేవాడిని. కానీ ఇవాళ నేనో స్థితిలో ఉన్నాను. యువకులకు కూడా దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాను. ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ వల్లే సాధ్యమైంది. అందుకే యువతకు చెబుతున్నా... మీరు దేశానికి సేవ చేయాలని భావిస్తే అందుకు ఏవైడబ్ల్యూ, సీవైఎస్‌ఎస్‌లను ఎంచుకోండి. మీలాంటి వారికి ఇవి మంచి వేదికలవుతాయన్నారు. వచ్చే ఏడాది ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిల్లియా యూనివ ర్సిటీల్లో జరిగే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆప్ విద్యార్థి విభాగం కూడా పోటీ చేస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
యువ, విద్యార్థి విభాగాలను ప్రారంభించిన ఆప్
Published Sun, Sep 28 2014 9:45 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement