న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎంతోపేరుగాంచిన ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లలో విద్యార్థి రాజకీయాలు ఈ పర్యాయం అనేకమందిని తీవ్ర సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశాయి. విద్యార్థి సంఘాల రాజకీయాల్లో పెను నాటకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జేఎన్‌యూలో తన పట్టును పెంచుకోగా మరోవైపు వామపక్షాల మద్దతుతో ముందుకు సాగుతున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (ఏఐఎస్‌ఏ)... ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన ఓటు వాటాను పెంచుకుంది.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (ఏఐఎస్‌ఏ)...1990లో ఆవిర్భవించింది. సీపీఎంకు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ అప్పటినుంచి జేఎన్‌యూలో బలంగా ఉంది. అయితే క్రమేణా దీని ఓటువాటా తగ్గుతోంది. ఇక ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విషయానికొస్తే ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఏబీవీపీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) విజయం కోసం ఆఖరి నిమిషందాకా హోరాహోరీగా పోరాడాయి. విజయం ఎవరిని వరించిందనే విషయాన్ని పక్కనబెడితే ఈ ఎన్నికల్లో ఏఐఎస్‌ఏ మంచి ఫలితాలను సాధించింది. తనకు కంచుకోటగా భావించే ఢిల్లీ విశ్వవిద్యాలయం డీయూ విద్యార్థి సంఘం (డూసూ)కు తాజాగా జరిగిన ఎన్నికల్లో 18 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఏబీవీపీ... నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది.
అయితే జవహర్‌లాల్ నెహ్రూ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్)కి జరిగిన ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శ పదవులకు ఈ సంస్థ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు తృతీయ స్థానంలో నిలిచారు. ఈ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల చరిత్రలో ఈ తరహా ఫలితాలు గతంలో ఏనాడూ రాలేదు. అంతేకాకుండా ఏబీవీపీ కౌన్సిలర్ల వాటా కూడా బాగా పెరిగింది. గత ఏడాది వీరి సంఖ్య 12 కాగా అది ఈసారి 26కు చేరుకుంది. 1970లో ఆవిర్భవించిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో వామపక్షాలకు ఆదినుంచి పట్టు ఉంది. ఈ విశ్వవిద్యాలయం నుంచే అనేకమంది కమ్యూనిస్టు నాయకులు పుట్టారు. జాతీయ రాజకీయాల వరకూ ఎదిగారు. అయితే ఆ స్థాయి ప్రభావం కాలక్రమేణా తగ్గుతున్న సూచనలే కనిపిస్తున్నాయి.
విసిగిపోయి ఉండొచ్చు: రోహిత్
ఈ విషయమై ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చాహల్ మాట్లాడుతూ వామపక్ష పార్టీల రాజకీయాలపట్ల విద్యార్థులు విసిగిపోయి ఉండొచ్చన్నారు. వామపక్ష గ్రూపులు విద్యార్థుల సమస్యలపై అంత ఆసక్తి చూపకపోవచ్చని అనుకుంటున్నాను. కేరళ, పశ్చిమబెంగాల్ వామపక్ష పార్టీలకు గతంలో ఎంతో పట్టు ఉంది. అయితే అది కాలక్రమేణా తగ్గిపోతోంది. అదే పరిస్థితి ఇక్కడ కూడా పునరావృతమవుతోందని నాకు అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా 1948లో ఆవిర్భవించిన ఏబీవీపీకి ఢిల్లీతోపాటు హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ విశ్వవిద్యాలయాల్లోనూ గట్టి పట్టు ఉంది.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న కారణంగానే ఏబీవీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించగలిగిందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆరోపించింది. ఈ విషయమై ఆ సంస్థ తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన పిండిగ అంబేద్కర్ మీడియాతో మాట్లాడుతూ సైన్సు విభాగాల్లో ఏబీవీపీకి గట్టి పట్టు ఉందన్నారు. దీనికితోడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇదివారికి కలిసొచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కంటే ఈ పర్యాయం జరిగిన ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించామన్నారు. తమ ఓటుశాతం పెరిగిందన్నారు. గత ఏడాదికంటే 600 ఓట్లు ఎక్కువగా వచ్చాయన్నారు. తమకు కూడా ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారన్నారు. 2012లో తమ సంస్థలో చీలికలు వచ్చాయని, దాని వల్ల కొంతమేర దెబ్బతిన్నామని అన్నారు. త్వరలోనే తాము కూడా కోలుకుంటామన్నారు. కాగా సీపీఎంకి అనుబంధంగా ఎస్‌ఎఫ్‌ఐ పనిచేస్తోంది.
విద్యార్థి సంఘాల రాజకీయాల్లో పెను నాటకీయ మార్పులు
Published Sun, Sep 21 2014 10:56 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement