నిందితుడు అసిస్టెంట్ ప్రొఫెసర్
మోమిన్‌పేట: వివాహం చేసుకుంటానని నమ్మబలికి బాలికను మోసం చేసిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. సీఐ ఏవీ రంగా బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని టేకులపల్లి అనుబంధ సుద్దోడ్క తండాకు చెందిన బాలిక(17) ఇంటర్ చదువుతోంది. ఈమె వేసవి సెలవులకు మర్పల్లి మండలం నర్సాపూర్ అనుబంధ పెద్ద తండాలో ఉంటున్న తన సోదరి వద్దకు వెళ్లింది. అక్కడ అదే తండాకు చెందిన అంబోతు అంబర్‌సింగ్(28)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
అంబర్‌సింగ్ మెదక్ జిల్లా సదాశివపేటలో ఉంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని అంబర్‌సింగ్ బాలికను నమ్మబలికి లొంగదీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈనెల 3న అంబర్‌సింగ్‌కు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి బాలికను దూరంగా ఉంచుతున్నాడు. పెళ్లి విషయమై బాలిక అంబర్‌సింగ్‌ను నిలదీయగా తనకేం సంబంధం లేదని స్పష్టం చేశాడు. దీంతో బాలిక ఈనెల 16న మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ రాజు తదితరులు ఉన్నారు.
బాలికను మోసం చేసిన యువకుడికి రిమాండు
Published Wed, Jun 18 2014 11:37 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement