Government Polytechnic College
-
పాలిటెక్నిక్ అధ్యాపకుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం జీవో 133ని విడుదల చేశారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ వర్తిస్తుంది. రెండేళ్ల కనీస సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. స్పౌజ్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, దివ్యాంగులకు ప్రత్యేక పాయింట్లు కేటాయించి బదిలీల్లో వారికి ప్రాధాన్యత కల్పించారు. దీర్ఘకాలంగా పాలిటెక్నిక్ అధ్యాపకులు ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం అనుమతించడంపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అయితే, బదిలీలు చేపట్టే నాటికి ఆ స్థానంలో ఐదేళ్లు పూర్తయి, రిటైర్మెంట్కు సమీపంలో ఆరు నెలల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న వారిని కూడా బదిలీ చేసేలా నిబంధన పెట్టారని, ఇది కొంతమంది ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతోందన్నారు. -
బాబోయ్... ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు
సాక్షి, సిద్దిపేట(హుస్నాబాద్): తాగుబోతు ప్రిన్సిపాల్ మాకొద్దంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి మద్యం తాగివచ్చి సిబ్బంది, మహిళా అటెండర్, విద్యార్థులతో దురుసుగా ప్రవరిస్తున్నారని, కులాల పేరుతో దూషిస్తున్నారని విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌ను తొలగించాలంటూ మూకుమ్మడిగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నిత్యం కళాశాలకు మద్యం తాగి వస్తున్నారని తెలిపారు. మాట్లాడాలని వెళ్తే దూషిస్తారని, దురుసుగా ప్రవర్తిస్తారని ఆరోపించారు. కళాశాలకు బస్సు సౌకర్యం, ల్యాబ్, ఫర్నిచర్, బోధన బోధనేతర సిబ్బంది, లైబ్రేరియన్, పీడీ ఇలా ఎవరూ లేరని, కనీస సౌకర్యాలు కరువయ్యాయన్నారు. విద్యార్థులకు మద్దతుగా టీఎస్ఎఫ్ (టెక్నికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడు మేకల అక్షయ్ కుమార్, రాష్ట్ర కమిటీ ఇన్చార్జి వెంకన్న నాయక్, నాయకులు బస్వరాజ్ నాగరాజు, ఎగ్గిడి వేణు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
వారికి పాఠాల్లేవు...వీరికి ఉద్యోగాల్లేవు
సాక్షి, అమరావతి : ఓ పక్క సరిపడా లెక్చరర్లు లేక కాలేజీల్లో బోధన ముందుకు సాగడం లేదు.. మరోపక్క అక్కడే పనిచేస్తూ విధులకు దూరమైన కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగాల్లేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయా పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న 232 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను అప్పటి ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్ అధ్యాపకులను నియమించినందున వారిని తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఏపీలో 100 మంది, తెలంగాణలో 132 మంది ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉన్నారు. వాస్తవానికి ఏపీపీఎస్సీ ద్వారా కొన్ని పోస్టులు భర్తీచేసినా ఇంకా అనేక ఖాళీలున్నందున వాటిలో వీరిని తిరిగి నియమించవచ్చు. కానీ విభజన అనంతరం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వీరిని చేర్చుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు కోల్పోయిన పాలిటెక్నిక్ ఒప్పంద అధ్యాపకులను మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఖాళీ పోస్టులున్నా వీరిని తిరిగి తీసుకోకుండా కొనసాగుతున్న ఒప్పంద అధ్యాపకులకు మాత్రమే రెన్యువల్ చేస్తూ వెళ్లింది. కేంద్రం కొత్త కాలేజీలు ఇచ్చినా... కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్తగా 24 పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఆమేరకు కొన్నిటిని కొత్తగా ఏర్పాటు చేశారు. అయినా వీటిలో పోస్టులు మాత్రం భర్తీ కాలేదు. ఆ పోస్టులను ఐదేళ్లుగా ఖాళీగానే కొనసాగించారు తప్ప కాంట్రాక్ట్ పద్ధతిన కూడా నియామకాలు చేయలేదు. వీటిలో వేర్వేరు కాలేజీల్లో పనిచేస్తున్న వారినే సర్దుబాటు చేసి పాఠాలు చెప్పించారని నిరుద్యోగులు వాపోయారు. ఇప్పటికీ కొన్ని కాలేజీల్లో ఇదే పద్ధతి కొనసాగుతోందని, కొన్నిటిలో ఒక సబ్జెక్ట్ అధ్యాపకుడు వేర్వేరు సబ్జెక్టులు బోధిస్తున్నారని పేర్కొన్నారు. బయాలజీ అధ్యాపకుడితో కెమిస్ట్రీ లేదా ఇంగ్లిష్, మరో సబ్జెక్ట్ లెక్చరర్‌తో సంబంధం లేని సబ్జెక్ట్‌లు బోధింపజేస్తున్నారని తెలిపారు. గెస్ట్ లెక్చరర్లుగా కొంతమందిని నియమించి వారితో ఇలా చేయిస్తున్నారని తెలిపారు. అర్హులైన తాము కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా పనిచేయడానికి కార్యాలయాల చుట్టూ తిరిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని వారు వాపోయారు. గతంలో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేసి రోడ్డున పడిన తమను తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల పరిస్థితి ఇది.. కాలేజీ సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ 84 40,056 ఎయిడెడ్ 02 1,502 ప్రైవేట్ 201 1,00,470 ప్రభుత్వ కాలేజీల్లో పోస్టుల పరిస్థితి -
మా కళాశాలను సీజ్ చేస్తారా!
పటమట(విజయవాడ తూర్పు) : దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తిపన్ను వసూళ్ల వ్యవహారంలో కార్పొరేషన్ వైఖరి సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 16 ఏళ్లుగా ఆస్తిపన్ను చెల్లించలేదంటూ విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సీజ్ చేసేందుకు గురువారం వీఎంసీ అధికారులు ప్రయత్నించారు. అయితే కళాశాల విద్యార్థులు వీఎంసీ సిబ్బందిని ప్రతిఘటించడంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు సంస్థల నుంచి కోట్ల రూపాయల బకాయిలున్నా పట్టించుకోని అధికారులు.. నిత్యం విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే కళాశాల జప్తునకు పూనుకోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సిబ్బందిని బంధించిన విద్యార్థులు మొండి బకాయిదారులుగా గుర్తించిన సంస్థల నుంచి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బందికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద చుక్కెదురైయ్యింది. విద్యార్థులు కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బందిని బందించారు. అనంతరం పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పడంతో వీఎంసీ సిబ్బంది బయటకు రాగలిగారు. నగరంలోని రోడ్లు, భవనాలశాఖ రాష్ట్ర కార్యాలయం, సబ్‌కలెక్టర్ కార్యాలయం, పలు విద్యుత్‌సబ్ స్టేషన్లు, పోలీస్స్టేషన్లు, సౌత్ సెంట్రల్ రైల్వే, పీబీ సిద్ధార్థ కళాశాలతోపాటు పలు విద్యా సంస్థలు బకాయిలున్నప్పటికీ వాటి నుంచి వసూళ్లు చేయకుండా విజ్ఞానానికి ప్రతీకగా ఉండే ప్రభుత్వ కళాశాలపై చర్యలకు వీఎంసీ అ«ధికారులు పూనుకోవటం వీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జె. నివాస్, అడిషినల్ కమిషనర్ డి. చంద్రశేఖర్ జర్మనీటూర్లో ఉండగా.. వీఎంసీ రెవెన్యూ అధికారులు చర్యలకు పూనుకోవడం గమనార్హం. ఏళ్లుగా బాకీ.. ఇటీవల సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) కార్పొరేషన్ పన్నుల వసూళ్లకు చొరవ చూపటం, దీర్ఘకాలికంగా బకాయిదారులుగా ఉన్న సంస్థలను గుర్తించి.. వాటికి నోటీసులు జారీ చేస్తూ వస్తుంది. ఇప్పటికీ ఈ కళాశాలకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. స్పందించకపోవటంతో కార్పొరేషన్ పాలిటెక్నిక్ కళాశాలను జప్తు చేసేందుకు సిద్ధమయ్యిందని వీఎంసీ అధికారులు చెబుతున్నారు. నగరంలోని ఏలూరురోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 2002 నుంచి వీఎంసీకి చెల్లించాల్సిన ఆస్తిపన్ను చెల్లించటంలేదని తెలుస్తోంది. 2002 నుంచి 2018 వరకు కళాశాల 6.5 కోట్లు బకాయి ఉంది. వీటితోపాటు బందరురోడ్డులోని సబ్‌కలెక్టర్ కార్యలయం పదేళ్లకుగానూ రూ. 3 కోట్లు, సౌత్‌సెంట్రల్‌రైల్వే ఆరేళ్లకు రూ. 50 లక్షలు, నగరంలోని సిద్ధార్థ అకాడమీ 2011 –2018 వరకు సుమారు రూ. 80 లక్షలు వీఎంసీకి బకాయి కట్టాల్సి ఉంది. వీటన్నింటినీ వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని అధికారులు చెబుతున్నారు లక్ష్యాన్ని సాధించేందుకే.. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ. 125 కోట్లు వసూళ్లు నిర్ధేశిస్తే అందులో రూ. ఇప్పటి వరకు కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొండి బకాయిలపై దృష్టిసారించారని వీఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్పెషల్ డ్రైవ్‌లో భాగమే.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి సుమారు రూ. 30 కోట్ల వరకు ఆస్తిపన్నులు దీర్ఘకాలికంగా బకాయిలున్నాయి. వీటితోపాటు కొన్ని ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి పన్నులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఉండటంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈనేపథ్యంలోనే మొండి బకాయిలు వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. – జి. సుబ్బారావు,డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ) -
ప్రేమించలేదని బీరు సీసాతో దాడి..
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (16)పై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. కుమురంభీం జిల్లా ఈస్గావ్ మండలం అనుకొండకు చెందిన గోవర్ధన్ (18) ఇదే కళాశాలలో గతేడాది పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఉంటున్న అతడు శనివారం ఆదిలాబాద్‌కు వచ్చి తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ కళాశాల వెనుక మైదానంలో ఉన్న ఆ విద్యార్థినితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీర్ సీసాతో దాడి చేయగా ఆమె తల, మెడ, చేతిపై గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన మరో విద్యార్థినికి కూడా చేతిపై గాయమైంది. ఈ క్రమంలో గోవర్ధన్ వారిని తోసేసి పరారీ కాగా.. స్థానికులు విద్యార్థినులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను షీ టీం సభ్యులు గాయపడిన విద్యార్థినిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్
అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపా«ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎన్నికల పరిశీలకులు రాంగోపాల్, రాంశంకర్ నాయక్ సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించారు. ముందుగా ఎస్పీ రాజశేఖర్‌బాబు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూం తాళాలు తెరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశిధర్ మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ నియోజకవర్గానికి 14, పట్టభద్రుల నియోజకవర్గానికి 26 టేబుళ్ల చొప్పున వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు మూడు షిఫ్టులలో సిబ్బంది పాల్గొంటారన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషనర్ నేరుగా తిలకించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఢిల్లీ నుంచి ఇద్దరు సీనియర్ అధికారులు కౌంటింగ్ ప్రక్రియను గమనించేందుకు వచ్చారన్నారు. ఓట్ల లెక్కింపును ఏజెంట్లు ఎప్పటికప్పుడు తిలకించేందుకు అనువుగా కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు. -
నమ్మించి ముంచారు
► జీరో ల్యాండ్ పేరుతో పాగా వేయించారు ► రూ.లక్షలు పెట్టి ఇళ్లు కట్టించుకున్నాం ► తర్వాత దౌర్జన్యంగా ఖాళీ చేయించారు ► ‘చినబాబు కాలనీ’ బాధితుల ఆవేదన జీరో ల్యాండ్’ పేరిట నమ్మించారు. గుడిసెలు వేసుకుంటే త్వరగానే పట్టాలిప్పిస్తామన్నారు. తమకు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. వారి మాటలను పేదలు నమ్మారు. స్థలం వస్తుందన్న ఆశతో కట్టెలు, ఇతరత్రా సామగ్రి సమకూర్చుకుని గుడిసెలు వేసుకున్నారు. మరికొందరు అప్పోసప్పో చేసి.. లక్ష, లక్షన్నర రూపాయల ఖర్చుతో పక్కా నిర్మాణాలు కూడా చేపట్టారు. కొద్దిరోజుల్లోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. నమ్మబలికిన ‘పచ్చ నేతలే’ నట్టేట ముంచారు. స్థలం వదిలి వెళ్లిపోవాలని బెదిరించారు. వారు వదలకుంటే బలవంతంగా లాక్కొని తమ వారికి కట్టబెట్టారు. ఇదీ ‘చినబాబు కాలనీ’ కథ. జేఎన్టీయూ : అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల స్థలంలో ‘తమ్ముళ్లు’ సృష్టించిన చినబాబు కాలనీ కారణంగా అనేకమంది పేదలు బలయ్యారు. కాయాకష్టం చేసి సంపాదించుకున్న డబ్బంతా అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి పోగొట్టుకున్నారు. స్థలం వస్తుందని ఆశపడితే .. చివరకు అప్పుల పాలు కావాల్సి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారు. దౌర్జన్యంగా కట్టుబట్టలతో బయటకు గెంటేశారని, తమ స్థలాలు/ నిర్మాణాలు నాయకుల అనుయాయులకు కట్టబెట్టారని వాపోతున్నారు. ఈ స్థలం జీరోల్యాండ్ అని చెప్పడంతో పేదలు గుడిసెలు వేసుకోవడానికి ముందుకొచ్చారు. స్థలం ఆక్రమణలో ఉంటే రెవెన్యూ అధికారులు ఏదో ఒకరోజు పట్టాలివ్వకపోతారా అని ఆశించారు. కొందరు ధైర్యం చేసి నిర్మాణలు కూడా చేపట్టారు. ప్రస్తుతం కాలనీలో 128 ఇళ్లు వెలిశాయి. ఇందులో ప్రస్తుతం టీడీపీ నాయకులు 67 కుటుంబాలను వెళ్లగొట్టారు. వాటిలో కొన్ని తమ అనుయాయులకు ఇవ్వడంతో పాటు బేరం పెట్టి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఇద్దరు టీడీపీ నేతల పాత్ర ఉంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలతో చెలగాటమాడుతున్నా.. ప్రభుత్వస్థలాన్ని బహిరంగంగా అమ్ముతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అక్రమార్కుల చెర నుంచి ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థులు కోరుతున్నారు. రూ.22.80 కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతమైతే చూస్తూ ఊరుకోవడం తగదని అంటున్నారు. గుగ్గిళ్లు అమ్మి.. డబ్బు కట్టా జేఎన్టీయూ ఓల్డ్ క్యాంపస్, పంచాయతీ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతి రోజూ గుగ్గిళ్లు అమ్మి జీవనం సాగిస్తున్నా. తద్వారా కూడబెట్టిన రూ.40 వేలతో రేకుల కొట్టం వేసుకున్నా. అలాగే ప్రతి నెలా చందాల పేరుతో నాయకులు వసూలు చేశారు. ఆ డబ్బుతో జల్సాలు చేశారు. నన్ను దౌర్జన్యంగా బయటకు గెంటేసి.. కొట్టమున్న స్థలాన్ని రూ. రెండు లక్షలకు అమ్మేశారు. నేను ఇంటికి పెట్టిన సొమ్ము కోసం ప్రతి రోజూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. -రామలక్ష్మి, బాధితురాలు -
గత పాలకుల వల్లే కష్టాలు
శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల రౌండ్‌టేబుల్ సమావేశంలో హరగోపాల్ హైదరాబాద్ : శ్రీశైలం ముంపు బాధితులకు నేటికీ ఉద్యోగాలను ఇవ్వకపోవడం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలమూరు అధ్యయన వేదిక - హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడు తూ ప్రాజెక్టును నిర్మించినప్పుడు భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి సీఎం ఎన్టీరామారావు ఇచ్చిన 98,68 జీవోలను ఇప్పటికీ ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్‌కు వెళ్లిన కేసీఆర్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. బాధితులు 160 రోజుల పాటు తమకు ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రధాన డిమాం డ్తో ఉద్యమిస్తున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. అర్హత కలిగిన 2,500 మంది నిరుద్యోగులు నిర్వాసితుల్లో ఉన్నారని, వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారికి న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలు వారికి అండగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ... ప్రభుత్వాలు మారినా, ప్రత్యేక తెలంగాణ వచ్చినా శ్రీశైలం నిర్వాసితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ నినాదాలు చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఏడాది దాటినా నిర్వాసితులను పట్టించుకోకపోవ డం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డిలు మాట్లాడుతూ శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఈ నెల 20న మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి నుంచి వందలాది మంది నిర్వాసితులతో చేపట్టనున్న చలో అసెంబ్లీ పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రజాకవి రాజారాంప్రకాష్, విరసం సభ్యుడు రాంకి రామ్మోహన్‌లతోపాటు నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు కురుమన్న, ఉపాధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌కు అన్యాయం అత్యంత అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు. కృష్ణానది ఎక్కువగా పారేది ఈ జిల్లాలోనే అయినా తాగు నీరు, సాగునీరు లేక వలసలతో వెలవెలబోతుంది. ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు గడచినా శ్రీశైలం ముంపు నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరుగలేదు. - ఎం. మురళీధర గుప్తా,హైదరాబాద్ జిల్లా కన్వీనర్ , పాలమూరు అధ్యయన వేదిక . ఆందోళనకు ముగింపు రావాలి గత ప్రభుత్వాల దుర్మార్గానికి, మోసానికి బాధితులైన నిర్వాసితులకు ఎదురవుతున్న అ న్ని నియంత్రణలు, అడ్డంకులు తొలగించి ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి. అదే విధంగా 67 గ్రామాలలో సామాజిక నివేదికలు లేవు. దీనిపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసి నివేదిక తయారు చేయించి గడువులో అమలు జరపాలి. - ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ . వయసు మీరుతున్నా జాబ్ రాలేదు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో మాతాతల నాటి నుంచి వస్తున్న సాగుభూమి 9.5 ఎకరాలు కోల్పోయా. మూడు దశాబ్దాల నుంచి నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో జీవిస్తున్నా. వయసు మీరిపోతోంది కానీ ఉద్యోగం రాలేదు. పౌరహక్కుల, ప్రజా సంఘాల నేతలు మా విషయంలో స్పందించి న్యాయం చే యాలి. - పి.కురుమన్న, శ్రీశెలం ముంపు నిర్వాసితుల జిల్లా అధ్యక్షుడు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ సందడి
యూనివర్సిటీ : ఏపీఎంసెట్-2015 కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూనివర్సిటీలలోని హెల్ప్‌లైన్ కేంద్రాలలో సజావుగా ప్రారంభమైంది. ఉదయం నుంచే జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలు పనిచేశాయి. ఈసారి త్వరగా కౌన్సిలింగ్ నిర్వహించడంతో విద్యార్థులు కౌన్సెలింగ్‌కు భారీగా హాజరయ్యారు. ఎస్కేయూ ఇంఛార్జ్ వీసీ ఆచార్య కె.లాల్‌కిశోర్, రిజిస్ట్రార్ ఆచార్య కె.దశరథరామయ్య వర్సిటీలోని హెల్పలైన్ కేంద్రాన్ని పరిశీలించారు. గణనీయమైన ర్యాంకు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లను అందించారు. విద్యార్థి పేరెంట్ తప్పనిసరి: సర్టిఫికెట్ పరిశీలనకు విద్యార్థితో పాటు పేరెంట్ తప్పనిసరిగా ఉండాలి. కుల ద్రువీకరణ పత్రం, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యం కాదు కాబట్టి విద్యార్థి తండ్రి లేదా తల్లి, సంరక్షకుడు ఎవరో ఒకరు అంగీకారం తెలిపాలి. ఒక వేళ విద్యార్థి సర్టిఫికేట్స్ నకిలీవని తేలితే వచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ రుసుములను విద్యార్థి తండ్రి, సంరక్షకుడు (గార్డియన్) వెనక్కి కట్టాల్సి ఉంటుంది. ఫీజు మినహాయింపుల గురించి మార్పు, చేర్పులకు అంగీకారం తెలుపుతున్నామని సంతకం చేయాలి. 10 వేల లోపు ర్యాంకు వారికి గరిష్టమెత్తంలో ఫీజు రీఎంబర్స్మెంట్: ఏపీ ఎంసెట్-2015లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఆయా కళాశాలలో నిర్ణయించిన ఫీజు మెత్తాన్ని గరిష్టంగా ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది. అటానమస్ (స్వయం ప్రతిపత్తి )కళాశాలల్లో రూ.78 వేలు నుంచి లక్ష వరకు పీజు కట్టించుకుంటారు. ఈ మొత్తాలకు షరతులు లేకుండా ప్రభుత్వం చెల్లిస్తుంది. 10 వేల ర్యాంకు పైన వచ్చిన ఓసీ, బీసీ కేటగిరి విద్యార్థులకు కేవలం రూ.35 వేలు మాత్రమే కన్వీనర్ కోటాలో ప్రవేశించిన వారికి పీజు రీఎంబర్స్మెంట్ చేస్తుంది. ఎస్సీ,ఎస్టీ క్యాటగిరి విద్యార్థులకు మాత్రం ఏర్యాంకు వచ్చినా రీఎంబర్సమెంట్ వర్తిస్తుంది. వెబ్ఆప్షన్స్ ఇచ్చేటపుడు సెల్‌ఫోన్ నెంబర్ తప్పనిసరి: ఇంజనీరింగ్ సీట్లు 15 శాతం పూర్తిగా మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. ఇందులో నాన్‌లోకల్ వారు ఉన్నా సీట్లు కేటాయిస్తారు. తక్కిన 85 శాతం ఎస్వీయూ రీజియన్ వారికి ఇంజనీరింగ్ సీట్లు అలాట్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ వన్‌టైం పాస్వర్డ్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తప్పనిసరిగా కచ్చితమైన, సొంత సెల్‌ఫోన్ నెంబర్‌ను ఇవ్వాలి. ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం మార్క్స్ కార్డ్స్ వెనక్కి ఇచ్చేస్తారు. కారణం తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరు అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సెల్‌ఫోన్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వకూడదు. కళాశాల వారు సెల్‌ఫోన్ నెంబర్‌ను ఇవ్వాలని మభ్యపెడితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ నెంబర్ 9010221264 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. నేటి కౌన్సెలింగ్ ఇలా.. శనివారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 15001 నుంచి 22500 ర్యాంకు వరకు, ఎస్కేయూనివర్సిటీలో 22501 నుంచి 30 వేల ర్యాంకుల వరకు హాజరుకావాలి. ఎస్టీ కేటగిరికి చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆది, సోమవారాల్లో 1 నుంచి 30 వేల ర్యాంకుల విద్యార్థులు వెబ్ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. -
12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
ఈ నెల 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి {పాసెసింగ్ ఫీజును పెంచిన ప్రభుత్వం గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ ఆధారిత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఈనెల 12న ప్రారంభం కానుంది. ఎంసెట్‌లో ర్యాంకులు పొంది రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశానికి ఎదురుచూస్తున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసు కోవాలి. గుంటూరు నగరం గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీ వరకు ర్యాంకుల వారీగా విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. పరిశీలన పూర్తయిన విద్యార్థులకు కళాశాలల ఎంపిక కోసం ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం పెంపుదల చేసింది. గతంలో ఓసీ, బీసీ విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ. 600 మొత్తాన్ని రూ. 900కు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 300 నుంచి రూ. 450కు పెంచింది. ఎస్టీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాలి. ఇతర వివరాలకు జ్ట్టిఞట://్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ సందర్శించాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు వెంట తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు.. ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, 10వ తరగతి, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాల్సి ఉంది. ఆయా ధ్రువపత్రాల ఒరిజినల్స్‌తో పాటు రెండు జిరాాక్స్ కాపీ సెట్లను తీసు కెళ్లాలి. పరిశీలన అనంతరం జిరాక్స్ సర్టిఫికెట్లను సమర్పించాలి. అంగ వైకల్యం, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు విజయ వాడ బెంజి సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హాజరవ్వాలి. ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగే తేదీలు .... - గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో... ఈనెల 12న ఒకటో ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకు,13న 15,001 ర్యాంకు నుంచి 18,800 వరకు,14న 30,001 నుంచి 33,700 వరకు, 15న 45,001 ర్యాంకు నుంచి 48,800 వరకు,16న 60,001 ర్యాంకు నుంచి 63,700 వరకు,17న 75,001 ర్యాంకు నుంచి 78,800 వరకు,18న 90,001 ర్యాంకు నుంచి 93,700 వరకు, 19న 1,05,001 నుంచి 1,08,800 వరకు, 20న 1,20,001 ర్యాంకు నుంచి 1,22,500 వరకు హాజరుకావాలి. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో... ఈనెల 12న 3,701 ర్యాంకు నుంచి 7,500 ర్యాంకు వరకు,13న 18,801 ర్యాంకు నుంచి 22,500 వరకు,14న 33,701 నుంచి 37,500 వరకు, 15న 48,801 ర్యాంకు నుంచి 52,500 వరకు, 16న 63,701 ర్యాంకు నుంచి 67,500 వరకు, 17న 78,801 ర్యాంకు నుంచి 82,500 వరకు, 18న 93,701 ర్యాంకు నుంచి 97,500 వరకు,19న 1,08,801 నుంచి 1,12,500 వరకు, 20న 1,22,501 ర్యాంకు నుంచి 1,25,000 వరకు హాజరుకావాలి. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో... ఈనెల 12న 7,501 ర్యాంకు నుంచి 11,200 ర్యాంకు వరకు,13న 22,501 ర్యాంకు నుంచి 26,300 వరకు,14న 37,501 నుంచి 41,200 వరకు,15న 52,501 ర్యాంకు నుంచి 56,300 వరకు,16న 67,501 ర్యాంకు నుంచి 71,200 వరకు,17న 82,501 ర్యాంకు నుంచి 86,300 వరకు,18న 97,501 ర్యాంకు నుంచి 1,01,200 వరకు,19న 1,12,501 నుంచి 1,16,300 వరకు, 20న 1,25,001 ర్యాంకు నుంచి 1,27,500 వరకు హాజరుకావాలి. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో... ఈనెల 12న 11,201 ర్యాంకు నుంచి 15,000 ర్యాంకు వరకు,13న 26,301 ర్యాంకు నుంచి 30,000 వరకు,14న 41,201 నుంచి 45,000 వరకు,15న 56,301 ర్యాంకు నుంచి 60,000 వరకు,16న 71,201 ర్యాంకు నుంచి 75,000 వరకు,17న 86,301 ర్యాంకు నుంచి 90,000 వరకు,18న 1,01,201 ర్యాంకు నుంచి 1,05,000 వరకు,19న 1,16,301 నుంచి 1,20,000 వరకు, 20న 1,27,501 నుంచి ఆపై చివరి ర్యాంకు వరకు హాజరుకావాలి. -
ర్యాగింగ్‌ను సహించం
బెల్లంపల్లి : వారందరూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. సుదూర ప్రాంతాల నుంచి నిత్యం బస్సులు, ఆటోల్లో బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అలా వచ్చి వెళ్లే క్రమంలో బాలికలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థిని, విద్యార్థులు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ వంటి ఆకృత్యాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇలా విద్యార్థిని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసుశాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసే ప్రయత్నం చేసింది సాక్షి. శాంతిభద్రత పరిరక్షణలో ఎంతో బిజీగా ఉండే బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ భాస్కర్ భూషణ్ వీఐపీ రిపోర్టర్‌గా మారి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులతో అడిషనల్ ఎస్పీ సంభాషణ ఇలా సాగింది.. అడిషనల్ ఎస్పీ : హాయ్ గల్స్, హౌఆర్యూ.. విద్యార్థినులు : (బెంచీపై నుంచి లేచి నిలబడి) హాయ్ సార్.. అడిషనల్ ఎస్పీ : నేను భాస్కర్‌భూషణ్, అడిషనల్ ఎస్పీ విద్యార్థినులు : ఓకే సార్.. గుర్తు పట్టాం అడిషనల్ ఎస్పీ : ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. చెప్పండి(అంటూనే ఓ విద్యార్థినిని పలకరించారు.) అడిషనల్ ఎస్పీ : నీ పేరేంటమ్మా...? విద్యార్థిని : సార్.. నా పేరు అనుష అడిషనల్ ఎస్పీ : ఏం చదువుతున్నావు..? అనూష : ఏఈఐ ఫైనల్ ఇయర్ అడిషనల్ ఎస్పీ : ఓకే.. మీ కాలేజీలో ఈవ్‌టీజింగ్ ఏమైనా జరుగుతోందా? అనూష : అలాంటిదేమీ లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : భయపడకు, అలా జరిగితే నిర్భయంగా చెప్పు.(పక్కనే ఉన్న మరో విద్యార్థిని కల్పించుకొని మాట్లాడారు) విద్యార్థిని : లేదు సార్.. మేము బాగానే ఉంటున్నాం. అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటీ?వనజ : సార్ నా పేరు వనజ అడిషనల్ ఎస్పీ : ఏం చదువుతున్నావు. మీదెక్కడా? వనజ : నేను కూడా ఏఈఐ ఫైనల్ ఇయర్, మాది జైపూర్ సార్ అడిషనల్ ఎస్పీ : ఓకే.. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వనజ : ఫార్మర్స్(రైతులు) సార్ అడిషనల్ ఎస్పీ : ఓకే మిమ్మల్నీ ఎవరైనా ఈవ్‌టీజ్ చేస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు.. వనజ : అది.. సార్.. అడిషనల్ ఎస్పీ : ఏం పరవాలేదు ధైర్యంగా చెప్పమ్మా.. వనజ : సార్.. అమ్మాయిలను టీజ్ చేసే వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అడిషనల్ ఎస్పీ : ఓకే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వనజ : ఇకముందు మరే అమ్మాయిని టీజ్ చేయకుండా ఫనిష్మెంట్ ఇవ్వాలి. బట్ అతడి స్టడీ మాత్రం స్పాయిల్ కాకుండా చూడాలి సార్. అడిషనల్ ఎస్పీ : గుడ్... బాగా చెప్పావమ్మా.(మరో అమ్మాయితో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ) అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటమ్మా? విద్యార్థిని : సార్, నా పేరు సుప్రియ అడిషనల్ ఎస్పీ : ఎక్కడ నుంచి వస్తావు సుప్రియ : సార్, మాది రామకృష్ణాపూర్ అడిషనల్ ఎస్పీ : కాలేజీకి ఎలా వస్తావు.. సుప్రియ : బస్సులో వస్తాను సార్ అడిషనల్ ఎస్పీ : బస్సు ప్రయాణంలో ఏమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా.. సుప్రియ : పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు సార్. అడిషనల్ ఎస్పీ : బస్సులో గల్స్ కూర్చునేందుకు సీటు ఇస్తారా? సుప్రియ : ఒక్కోసారి కష్టంగానే ప్రయాణం చేస్తుంటాం సార్.. (మరో అమ్మాయితో మాట్లాడుతూ) అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటీ విద్యార్థిని : నా పేరు హారతి సార్ అడిషనల్ ఎస్పీ : నువ్వెక్కడి నుంచి కాలేజీకి వస్తావు హారతి : మందమర్రి నుంచి సార్ అడిషనల్ ఎస్పీ : నీవు కూడా బస్సులోనే వస్తావా హారతి : అవును సార్.. అడిషనల్ ఎస్పీ : ఓకే.. బస్సు ప్రయాణంలో ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?(మరో విద్యార్థిని కల్పించుకొని మాట్లాడారు.) విద్యార్థిని : సార్ హైదరాబాద్‌లో మాదిరిగా ఇక్కడ కూడా బస్సుల్లో ఉమెన్స్‌కు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలి. అడిషనల్ ఎస్పీ : ఓకే... మీ పేరు? విద్యార్థిని : సార్ నా పేరు సుష్మిత అడిషనల్ ఎస్పీ : ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి మీరెప్పుడైనా తీసుకెళ్లారా? సుష్మిత, సుప్రియ, హారతి : లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : కనీసం మీ కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్స్‌కు చెప్పారా? సుష్మిత, సుప్రియ, హారతి : చెప్పలేదు సార్.. అడిషనల్ ఎస్పీ : మీరు పడుతున్న ప్రాబ్లమ్స్ ఆర్టీసీ అధికారులకు చెప్పండి. పరిశీలించి సాల్వ్ చేస్తారు. ఓకేనా.. సుష్మిత, సుప్రియ, హారతి : అలాగే సార్ అడిషనల్ ఎస్పీ : ఉమెన్స్ రక్షణకు ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి తెలుసా? హారతి : కొన్ని తెలుసు సార్.. అడిషనల్ ఎస్పీ : ఉమెన్స్‌ను వేధిస్తే నిర్భయ చట్టం, రక్షణకు షీ, అత్యవసరంగా 181 వంటి సదుపాయాలను పోలీసు శాఖ కల్పిస్తోంది. సుప్రియ : అవును సార్. వీటి గూర్చి ఇంకా చాలామందికి తెలియదు.. అడిషనల్ ఎస్పీ : ఇలాంటి విషయాలను గల్స్ తోటి వారికి చెప్పాలి. వారికి అవగాహన కల్పించాలి. హారతి : అలాగే చెబుతాం సార్ అడిషనల్ ఎస్పీ : గల్స్ను వేధించినట్లు తెలిస్తే సహించేది లేదు. చట్టపరంగా దోషులపై చర్య లు తీసుకుంటాం. బాయ్స్ బుద్ధిగా మెలగాలి.(అంటూ అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ వరండాలో ఉన్న విద్యార్థుల వైపు వెళ్లారు.) అడిషనల్ ఎస్పీ : (ఓ విద్యార్థి వద్దకు వెళ్లి) నీ పేరేంటీ? విద్యార్థి : నా పేరు నితిన్ అడిషనల్ ఎస్పీ : ఫ్రెషర్స్‌ను ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా? నితిన్ : మా కాలేజీలో ర్యాగింగ్ జరగదు సార్.. అడిషనల్ ఎస్పీ : ఓకే.. ఇంత వరకు ఎవరిని ర్యాగింగ్ చేయలేదా? నితిన్ : లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : ఇంతకుముందు ర్యాగింగ్ జరిగినట్లు విన్నాను. నిజం కాదా? నితిన్ : సార్.. నాకైతే తెలియదు. అడిషనల్ ఎస్పీ : ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ నిషేధం కనుక అటువంటి చర్యలు కాలేజీలో జరిగితే సహించేది లేదు. ఆ దుశ్చర్యలకు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా కాలేజీ నుంచి తొలగించబడతారు. విద్యార్థులు (సామూహికంగా మాట్లాడుతూ) : అలాంటి చర్యలకు పాల్పడం సార్ అడిషనల్ ఎస్పీ : మీ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా? నితిన్ : ఉంది సార్ అడిషనల్ ఎస్పీ : వెరీగుడ్.. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటీ? నితిన్ : గౌట్జాబ్ సాధించాలనేది నా ఏయిమ్ సార్ అడిషనల్ ఎస్పీ : ఓకే... బెస్టాఫ్‌లక్.(మరో విద్యార్థిని పలకరించారు.) మీ పేరేంటీ? విద్యార్థి : శ్రీకాంత్ సార్ అడిషనల్ ఎస్పీ : మీ కాలేజీలో ప్లేస్మెంట్ ఉందా? శ్రీకాంత్ : లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : ఎందుకు జరగడం లేదు...? శ్రీకాంత్ : ఏమో సార్.. నాకు తెలియదు. అడిషనల్ ఎస్పీ : మైనింగ్ బ్రాంచి ఉంది కదా? సింగరేణిలో హండ్రెడ్ పర్సెంట్ మైనింగ్ ఉద్యోగాలు వస్తాయి కదా? శ్రీకాంత్ : అవును సార్... మైనింగ్‌కు మంచి డిమాండ్ ఉంది. (ఆతర్వాత అడిషనల్ ఎస్పీ పక్కనే ఉన్న అమ్మాయిల వద్దకు వెళ్లి పలకరించారు.) అడిషనల్ ఎస్పీ : మీరు బాగా చదువుకుంటున్నారా? విద్యార్థినులు : బాగా చదువుకుంటున్నాం సార్. అడిషనల్ ఎస్పీ : వెరీగుడ్.. మీతో బాయ్స్ ఎలా వ్యవహరిస్తున్నారు? సల్మాతబస్సుమ్ : (అనే విద్యార్థిని మాట్లాడుతూ) ఫ్రెండ్లీగా ఉంటారు సార్.. అడిషనల్ ఎస్పీ : ఏం ప్రాబ్లమ్స్ చేయట్లేదు కదా? సల్మాతబస్సుమ్ : అలాంటిదేమి లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : అన్ని సబ్జెక్టుల లెక్చరర్స్ ఉన్నారా? సల్మాతబస్సుమ్ : అందరు ఉన్నారు సార్. అడిషనల్ ఎస్పీ : క్లాస్ బాగా చెబుతారా? సల్మాతబస్సుమ్ : బాగా చెబుతారు సార్.(మరో విద్యార్థినితో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ) అడిషనల్ ఎస్పీ : నీ పేరేంటీ? విద్యార్థిని : నా పేరు స్వప్న సార్.. అడిషనల్ ఎస్పీ : రోజు కాలేజీకి ఎలా వస్తావు? స్వప్న : ఆటోలో వస్తాను సార్.. అడిషనల్ ఎస్పీ : ఆటో డ్రైవర్లు ఏమైన ప్రాబ్లమ్స్ చేస్తున్నారా? స్వప్న : లేదు సార్. అడిషనల్ ఎస్పీ : ఓకే.. గల్స్ ధైర్యంగా కాలేజీకి రావాలి. ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే మా దృష్టికి తీసుకురండి.. తగిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థినులు : ఓకే.... థ్యాంక్యూ సార్... (వెంటనే అడిషనల్ ఎస్పీ పక్కనే ఉన్న లెక్చరర్స్ వద్దకు వచ్చి మాట్లాడారు.) అడిషనల్ ఎస్పీ : గల్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత మీపైన(లెక్చరర్స్) ఉంది. రాకపోకలు చేసే క్రమంలో కలుగుతున్న ఇబ్బం దులు, కాలేజీలో గల్స్ పడే ప్రాబ్లమ్స్‌ను అడి గి తెలుసుకొని పరిష్కరించండి. మా దృష్టికి తీసుకువస్తే మేము కూడా సహకరిస్తాం. లెక్చరర్స్ : తప్పకుండా సార్. మీరు సూచించిన మాదిరిగానే గల్స్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. -
యువతే దేశానికి సంపద
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆత్మ విశ్వాసం కలిగిన యువతే దేశానికి సంపద అని, విద్యార్థి దశనుంచే మంచి గుణాలు అలవర్చుకోవాలని 8-ఏ బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ సునీత్ ఇస్సార్ అన్నారు. 8-ఏ బెటాలియన్ ఎస్సీసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న క్యాంపులో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత దేశభక్తిని పెంపొందించుకొని అల్లకల్లోలాలు లేని సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు. సత్యం, అహింస విధానాల్లో నడిచి సమాజానికి మార్గదర్శకులు కావాలన్నారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించారు. రైఫిల్ ఫైరింగ్‌పై మెళకువలు నేర్పించారు. ఫైరింగ్ వలన క్యాడెట్లలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదల, సమయపాలన, ధైర్యం అలవడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా 100 మంది క్యాడెట్లు 550 రౌండ్లు ఫైరింగ్ చేశారు. కార్యక్రమంలో క్యాంప్ అడ్జుడెంట్ బి.రఘు, ఎన్సీసీ అధికారులు ఎండీ ఇబ్రహీం, విజయభాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, క్యాంప్ సుబేదార్ మేజర్ రవిదత్శర్మ, క్యాంప్ సూపరింటెండెంట్లు రమణ, జనార్దన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల నియామకం
గతంలో ఉద్యోగం కోల్పోయిన వారికి మళ్లీ అవకాశం హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల నియామకానికి సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. గతంలో ఏపీపీఎస్సీ ద్వారా పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థుల నియామకం జరిగినప్పుడు, ఆ స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను తొలగించారు. సీనియారిటీతో సంబంధం లేకుండా తమను తొలగించడంపై ఉద్యోగాలు కోల్పోయిన వారు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో పోస్టింగ్‌ల వల్ల నష్టపోయిన వారికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా కాంట్రాక్టు లెక్చరర్లను నియమించాలని నిర్ణయించింది. ఏకలవ్య స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు తెలంగాణ రాష్ట్రంలోని ఆరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెలైట్ పద్ధతిలో క్లాస్-ఎం (కంప్యూటరైజ్డ్ లెర్నింగ్, స్కూల్ సిస్టమ్స్ మేనేజ్మెంట్) కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.1.5 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
గందరగోళం!
చీపురుపల్లి: చీపురుపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. స్థానిక ప్రజాప్రతినిధులు కళాశాలను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. అధికారుల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కళాశాల మంజూరై సుమారు ఏడాది కావస్తున్నా.. ఇప్పటివరకు అధికారులు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్థానికంగా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కళాశాలను తాత్కాలికంగా విజయనగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ సీట్లు పొందిన విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. చీపురుపల్లికి మంజూరైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను విజయనగరంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహా లు చేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది చీపురుపల్లికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది.2014- 15 విద్యా సంవత్సరానికి సంబంధించి అధికారులు ఈ కళాశాల పేరును కౌన్సెలింగ్ జాబి తాలో కూడా చేర్చారు. దీంతో చీపురుపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన గ్రా మీణ ప్రాంత విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. చీపురుపల్లి పేరుతో ప్రభుత్వ పాలి టెక్నికల్ కళాశాల మంజూరైనప్పటికీ ఇంతవరకు చీపురుపల్లిలో కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చీపురుపల్లి కళాశాలను కూడా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులు, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని కలెక్టర్, ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీలతో కొద్ది రోజుల క్రితం ఫోన్లో మాట్లాడి, పాలిటెక్నికల్ కళాశాలను చీపురుపల్లిలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోతోంది. వాస్తవానికి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ఏడాది పాలిటెక్నిక్ , ఇంజినీరింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వివాదాస్పదమైన విషయం తెలి సిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరికొద్ది రోజుల్లో తరగతులు ప్రారంభంకానున్న తరుణంలో చీపురుపల్లి పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కళాశాల తాత్కాలిక ఏర్పాటుకు అవసరమైన భవనాలు కూడా స్థానిక జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కేటాయిం చారు. సొంత భవనం ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణలో ప్రజాప్రతినిధులు ఉన్నారు.అయినప్పటికీ సాం కేతిక విద్యా అధికారులు కళాశాల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా రంగంలో ఎంతో వెనుకపడి ఉన్న చీపురుపల్లికి పాలిటెక్నికల్ కళాశాల మం జూరు కావడం వరమే అయినప్పటికీ కళాశాల ఏర్పాటులో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దగా దృష్టిసారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే మృణాళిని రాష్ట్ర స్థాయిలో మంత్రి గా ఉన్నప్పటికీ కళాశాల ఏర్పాటులో జాప్యం జరుగుతోం దంటే స్థానిక ప్రజాప్రతినిధులు అలసత్వం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చీపురుపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. -
బాలికను మోసం చేసిన యువకుడికి రిమాండు
నిందితుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ మోమిన్‌పేట: వివాహం చేసుకుంటానని నమ్మబలికి బాలికను మోసం చేసిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. సీఐ ఏవీ రంగా బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని టేకులపల్లి అనుబంధ సుద్దోడ్క తండాకు చెందిన బాలిక(17) ఇంటర్ చదువుతోంది. ఈమె వేసవి సెలవులకు మర్పల్లి మండలం నర్సాపూర్ అనుబంధ పెద్ద తండాలో ఉంటున్న తన సోదరి వద్దకు వెళ్లింది. అక్కడ అదే తండాకు చెందిన అంబోతు అంబర్‌సింగ్(28)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అంబర్‌సింగ్ మెదక్ జిల్లా సదాశివపేటలో ఉంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని అంబర్‌సింగ్ బాలికను నమ్మబలికి లొంగదీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈనెల 3న అంబర్‌సింగ్‌కు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి బాలికను దూరంగా ఉంచుతున్నాడు. పెళ్లి విషయమై బాలిక అంబర్సింగ్ను నిలదీయగా తనకేం సంబంధం లేదని స్పష్టం చేశాడు. దీంతో బాలిక ఈనెల 16న మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ రాజు తదితరులు ఉన్నారు. -
సజావుగా ‘పాలిసెట్’ కౌన్సెలింగ్
బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2014-పాలిసెట్ కౌన్సెలింగ్ సజావుగా జరుగుతోంది. మంగళవారం 20,001 నుంచి 40,000ల వరకు ర్యాంకు సాధించిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. రెండో రోజు విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన కోసం జిల్లాలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత విద్యార్థులను ర్యాంకు క్రమపద్ధతిలో హెల్ప్‌లైన్ సెంటర్లోకి ఆహ్వానించారు. ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు గంటల కొద్ది నిరీక్షించారు. కౌన్సెలింగ్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేశారు. బాలబాలికల కోసం వేర్వేరుగా షామియానాలు ఏర్పాటు చేసినా అవి సరిపోకపోవడంతో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో, కళాశాల క్యాంటీన్లో విద్యార్థులు ఉండిపోవల్సి వచ్చింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, సోదరులు వెంట రావడంతో కౌన్సెలింగ్ కేంద్రం వద్ద సందడి కనిపించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు అందుబాటులో భోజన సదుపాయం లేక ఇబ్బందులు పడ్డారు. అనేక మంది విద్యార్థులు టీ, టిఫిన్‌తోనే మధ్యాహ్నం సరిపెట్టుకున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు ఎన్నో వ్యయప్రయాసాలకు గురయ్యారు. విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడంలో పాలిటెక్నిక్ అధికారులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ఆరంభం
బెల్లంపల్లి : 2014-పాలిసెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం 9గంటలకు కౌన్సెలింగ్ ఆరంభం కాగా.. జిల్లాలోని ఆదిలాబాద్ నిర్మల్, కడెం, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్ తదితర సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థిని, విద్యార్థులు హాజరయ్యారు. తొలి రోజు ఒకటో ర్యాంకు నుంచి 20,000 ర్యాంకు సాధించిన విద్యార్థులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. విద్యార్థులను ర్యాంకు ఆధారంగా హెల్ప్‌లైన్ కేంద్రంలోకి వరుస క్రమంలో పిలిచారు. ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత పక్కనున్న గదిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు ఆప్షన్ల నమోదు, ఇంజినీరింగ్ కళాశాలలు, బ్రాంచ్‌ల వివరాలు వివరిస్తూ అవగాహన కల్పించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావడంతో హెల్ప్‌లైన్ కేంద్రం సందడిగా మారింది. విద్యార్థులకు ఎండ తగలకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అందుబాటులో భోజన సౌకర్యం లేక ఇక్కట్లు పడ్డారు. తొలి రోజు కౌన్సెలింగ్ సజావుగా సాగింది. -
ఖేర్వాడీ ఫ్లైఓవర్ రెడీ
సాక్షి, ముంబై: పశ్చిమ శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారికి ఓ శుభవార్త. ఖేర్వాడీ దక్షిణ భాగ ఫ్లైఓవర్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌హైవేపై రద్దీ వేళల్లో ట్రాఫిక్ సమస్య నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుందంటూ సంబంధిత అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫ్లై ఓవర్ ఉత్తర భాగ నిర్మాణ పనుల పూర్తికి మరో ఏడాది కాలం పట్టే అవకాశముందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) అధికారులు వెల్లడించారు. దీంతో మరో ఏడాదిపాటు సాయంత్రం రద్దీ సమయంలో ఈ మార్గంలో ప్రయాణించే నగర వాసులు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోక తప్పదని వారు పేర్కొన్నారు. ఈ పనులను ఎమ్మెమ్మార్డీఏ రెండు విడతలుగా చేపట్టింది. ఈ నెల 31వ తేదీని దీనికి తుది గడువుగా నిర్ణయించారు. ఈ విషయమై పనుల పూర్తికి మరో వారం అదనంగా పడుతుందన్నారు. ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూపీఎస్ మదన్ మాట్లాడుతూ.. ఈ పనుల పూర్తికి తమకు మరో వారం రోజులు సమయం అదనంగా పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ దక్షిణ దిశ భాగాన్ని జూన్ మొదటివారంలో ప్రారంభిస్తామన్నారు. ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్టు గత ఏడాది జె.కుమార్ సంస్థకు దక్కిందని, అయితే ట్రాఫిక్ పోలీసుల అనుమతి లభించే వరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ఆరు నెలల ముందే ఈ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో నవంబర్‌లో ఈ పనులు ప్రారంభించాలనుకున్నామన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తీవ్ర జాప్యమైందన్నారు. -
కొనసాగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ రెండో రోజు కూడా కొనసాగింది. జిల్లా కేంద్రంలోని రెండు హెల్ఫ్‌లైన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 15001 నుంచి 22500 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 159 మంది సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారని సెంటర్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ పి.నర్సింహ తెలిపారు. ఎన్జీ కాలేజీ హెల్ప్‌లైన్ సెంటర్లో 22501 నుంచి 30 వేల వరకు ర్యాంకు అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంగా 152 మంది పాల్గొన్నారని వెరిఫికేషన్ అధికారి కోటేశ్వర్రావు తెలిపారు. నేడు 45 వేల ర్యాంకు వరకు బుధవారం 30,001 నుంచి 37500 ర్యాంకు వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో, 37501 నుంచి 45 వేల ర్యాంకు వరకు ఎన్జీకాలేజీ హెల్ఫ్‌లైన్ సెంటర్‌కు హాజరుకావాల్సి ఉంది. -
ఆటంకాల మధ్య ఎంసెట్ కౌన్సెలింగ్
s నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో రెండు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు కేంద్రాలుగా ఎంసెట్(ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను పటిష్ట పోలీసు పహారా మధ్య జిల్లా ఉన్నతాధికారులు సోమవారం నిర్వహించారు. పాలిటెక్నిక్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కౌన్సెలింగ్ విధులను బహిష్కరించారు. కలెక్టర్ శ్రీకాంత్ ఆదేశాలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కౌన్సెలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కుల ధ్రువీకరణపత్రాలను పరిశీలించాల్సిన సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖలకు చెందిన ఎన్జీఓలు సైతం సమ్మెలో ఉండడంతో ఆయా శాఖల ప్రాజెక్ట్ డెరైక్టర్లు, అధికారులు రంగ ప్రవేశం చేసి కౌన్సెలింగ్ ప్రక్రియకు ఊతమిచ్చారు. దర్గామిట్టలోని ప్రభుత్వ మహిళా కళాశాల కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది సహకరించక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న తరుణంలో కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ రామకృష్ణ నేరుగా కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చి ప్రిన్సిపల్ నారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. సమ్మెలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల సిబ్బందిని పిలిపించి మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కౌన్సెలింగ్ సజావుగా నిర్వహించాలని డీఆర్డీఏ పీడీ వి.వెంకటసుబ్బయ్యను ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ సమాచారంతో సోషల్ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఈడీ కోటేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ పీఓ వై.వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సోమయ్య రెండు కేంద్రాలలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇంతలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు ప్రసన్న, శ్రావణ్, తిరుమలనాయుడు, ముజీర్, రోజ్దూర్, ఆదిత్యసాయి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల గేటు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో కళాశాలలోనికి ప్రవేశించి కౌన్సెలింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీ సులు అరెస్ట్‌చేసి నాల్గవ నగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యాపకులు కళాశాల ఎదుట జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అధికసంఖ్యలో హాజరయ్యారు. దర్గామిట్టలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 59 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. అదే విధంగా వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలు ర పాలిటెక్నిక్ కళాశాలలో 153 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో.. దర్గామిట్టలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన ప్రక్రియను ఆపే ప్రసక్తేలేదన్నారు. కొంత మంది సహకరించకపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కౌన్సెలింగ్‌ను నిర్వహించాల్సిందేనని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు:ఎస్పీ కౌన్సెలింగ్‌ను అడ్డుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవు. కౌన్సెలింగ్ నిర్వహణకు పోలీసుల సహకారం ఉంటుంది. ఆందోళనకారులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలి. -
కౌన్సెలింగ్‌పై ఉత్కంఠ!
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ తగులుతోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు దూరమని ఉద్యోగులు ప్రకటించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై ఎట్టకేలకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అనువైన పరిస్థితులు కానరావడం లేదు. ఈ ఏడాది మే 10న నిర్వహించిన ఇంజినీరింగ్ అర్హత పరీక్షకు జిల్లాలో 17, 582 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను మే నెలాఖరులో ప్రకటించారు. పరీక్షకు హాజై రెన విద్యార్థులంతా దాదాపుగా ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి అర్హత సాధించారు. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాట్లు చేశారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం నుంచి విశాఖలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ (పాలా) ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు దీక్షలో పాల్గొంటున్నారు. వీరితో పాటు జిల్లాని అనకాపల్లి, భీమిలి, నర్సీపట్నం, పాడేరు ప్రభుత్వ కళాశాలల సిబ్బంది మద్దతు తెలుపుతున్నారు. పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్‌లోని ఉద్యోగులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా విధులను బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మాకుమ్మడి సెలవులు పెట్టారు. ఈ నెల 19 నుంచి హెల్ప్ సెంటర్లలో విధులకు హాజరు కాబోమని తేల్చిచెప్పారు. దీనికితోడు విధులను బహిష్కరిస్తున్నట్టు పాలా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంధ్రశేఖర్ మరోమారు ప్రకటించారు. కన్వీనర్ నుంచి ఎటువంటి ఉత్తర్వులు తమకు అందలేదని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి.దేముడు చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో... ప్రధానంగా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వీటి ఆధారంగానే విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తారు. ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగులంతా సమ్మెలో ఉండటం వల్ల వీటిని పొందే అవకాశం లేదు. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు బస్సుల ఇబ్బంది తలెత్తనుంది. సమైక్యాంధ్ర సమ్మె వల్ల రోడ్లపై ఆందోళనలతో వాహనాలు తిరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తే అధికశాతం మంది విద్యార్థులు హాజరు కాకపోవడమే కాకుండా, ధ్రువపత్రాలు లేక మరికొంతమంది అనర్హులుగా పరిగణించబడతారు. దీంతో కౌన్సెలింగ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది.