సాక్షి, సిద్దిపేట(హుస్నాబాద్): తాగుబోతు ప్రిన్సిపాల్ మాకొద్దంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి మద్యం తాగివచ్చి సిబ్బంది, మహిళా అటెండర్, విద్యార్థులతో దురుసుగా ప్రవరిస్తున్నారని, కులాల పేరుతో దూషిస్తున్నారని విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌ను తొలగించాలంటూ మూకుమ్మడిగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నిత్యం కళాశాలకు మద్యం తాగి వస్తున్నారని తెలిపారు. మాట్లాడాలని వెళ్తే దూషిస్తారని, దురుసుగా ప్రవర్తిస్తారని ఆరోపించారు. కళాశాలకు బస్సు సౌకర్యం, ల్యాబ్, ఫర్నిచర్, బోధన బోధనేతర సిబ్బంది, లైబ్రేరియన్, పీడీ ఇలా ఎవరూ లేరని, కనీస సౌకర్యాలు కరువయ్యాయన్నారు. విద్యార్థులకు మద్దతుగా టీఎస్‌ఎఫ్ (టెక్నికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడు మేకల అక్షయ్ కుమార్, రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జి వెంకన్న నాయక్, నాయకులు బస్వరాజ్ నాగరాజు, ఎగ్గిడి వేణు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment