నమ్మించి ముంచారు
► జీరో ల్యాండ్ పేరుతో పాగా వేయించారు
► రూ.లక్షలు పెట్టి ఇళ్లు కట్టించుకున్నాం
► తర్వాత దౌర్జన్యంగా ఖాళీ చేయించారు
► ‘చినబాబు కాలనీ’ బాధితుల ఆవేదన
జీరో ల్యాండ్’ పేరిట నమ్మించారు. గుడిసెలు వేసుకుంటే త్వరగానే పట్టాలిప్పిస్తామన్నారు. తమకు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. వారి మాటలను పేదలు నమ్మారు. స్థలం వస్తుందన్న ఆశతో కట్టెలు, ఇతరత్రా సామగ్రి సమకూర్చుకుని గుడిసెలు వేసుకున్నారు. మరికొందరు అప్పోసప్పో చేసి.. లక్ష, లక్షన్నర రూపాయల ఖర్చుతో పక్కా నిర్మాణాలు కూడా చేపట్టారు. కొద్దిరోజుల్లోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. నమ్మబలికిన ‘పచ్చ నేతలే’ నట్టేట ముంచారు. స్థలం వదిలి వెళ్లిపోవాలని బెదిరించారు. వారు వదలకుంటే బలవంతంగా లాక్కొని తమ వారికి కట్టబెట్టారు. ఇదీ ‘చినబాబు కాలనీ’ కథ.
జేఎన్‌టీయూ : అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల స్థలంలో ‘తమ్ముళ్లు’ సృష్టించిన చినబాబు కాలనీ కారణంగా అనేకమంది పేదలు బలయ్యారు. కాయాకష్టం చేసి సంపాదించుకున్న డబ్బంతా అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి పోగొట్టుకున్నారు. స్థలం వస్తుందని ఆశపడితే .. చివరకు అప్పుల పాలు కావాల్సి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారు. దౌర్జన్యంగా కట్టుబట్టలతో బయటకు గెంటేశారని, తమ స్థలాలు/ నిర్మాణాలు నాయకుల అనుయాయులకు కట్టబెట్టారని వాపోతున్నారు. ఈ స్థలం జీరోల్యాండ్ అని చెప్పడంతో పేదలు గుడిసెలు వేసుకోవడానికి ముందుకొచ్చారు.
స్థలం ఆక్రమణలో ఉంటే రెవెన్యూ అధికారులు ఏదో ఒకరోజు పట్టాలివ్వకపోతారా అని ఆశించారు. కొందరు ధైర్యం చేసి నిర్మాణలు కూడా చేపట్టారు. ప్రస్తుతం కాలనీలో 128 ఇళ్లు వెలిశాయి. ఇందులో ప్రస్తుతం టీడీపీ నాయకులు 67 కుటుంబాలను వెళ్లగొట్టారు. వాటిలో కొన్ని తమ అనుయాయులకు ఇవ్వడంతో పాటు బేరం పెట్టి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఇద్దరు టీడీపీ నేతల పాత్ర ఉంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలతో చెలగాటమాడుతున్నా.. ప్రభుత్వస్థలాన్ని బహిరంగంగా అమ్ముతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అక్రమార్కుల చెర నుంచి ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థులు కోరుతున్నారు. రూ.22.80 కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతమైతే చూస్తూ ఊరుకోవడం తగదని అంటున్నారు.
గుగ్గిళ్లు అమ్మి.. డబ్బు కట్టా
జేఎన్‌టీయూ ఓల్డ్ క్యాంపస్, పంచాయతీ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతి రోజూ గుగ్గిళ్లు అమ్మి జీవనం సాగిస్తున్నా. తద్వారా కూడబెట్టిన రూ.40 వేలతో రేకుల కొట్టం వేసుకున్నా. అలాగే ప్రతి నెలా చందాల పేరుతో నాయకులు వసూలు చేశారు. ఆ డబ్బుతో జల్సాలు చేశారు. నన్ను దౌర్జన్యంగా బయటకు గెంటేసి.. కొట్టమున్న స్థలాన్ని రూ. రెండు లక్షలకు అమ్మేశారు. నేను ఇంటికి పెట్టిన సొమ్ము కోసం ప్రతి రోజూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. -రామలక్ష్మి, బాధితురాలు