ప్రిన్సిపల్ గదికి సీల్‌వేసిన వీఎంసీ కళాశాల ప్రాంగణంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు
పటమట(విజయవాడ తూర్పు) : దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తిపన్ను వసూళ్ల వ్యవహారంలో కార్పొరేషన్ వైఖరి సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 16 ఏళ్లుగా ఆస్తిపన్ను చెల్లించలేదంటూ విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సీజ్ చేసేందుకు గురువారం వీఎంసీ అధికారులు ప్రయత్నించారు. అయితే కళాశాల విద్యార్థులు వీఎంసీ సిబ్బందిని ప్రతిఘటించడంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు సంస్థల నుంచి కోట్ల రూపాయల బకాయిలున్నా పట్టించుకోని అధికారులు.. నిత్యం విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే కళాశాల జప్తునకు పూనుకోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
సిబ్బందిని బంధించిన విద్యార్థులు
మొండి బకాయిదారులుగా గుర్తించిన సంస్థల నుంచి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బందికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద చుక్కెదురైయ్యింది. విద్యార్థులు కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బందిని బందించారు. అనంతరం పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పడంతో వీఎంసీ సిబ్బంది బయటకు రాగలిగారు. నగరంలోని రోడ్లు, భవనాలశాఖ రాష్ట్ర కార్యాలయం, సబ్‌కలెక్టర్ కార్యాలయం, పలు విద్యుత్‌సబ్ స్టేషన్లు, పోలీస్‌స్టేషన్లు, సౌత్ సెంట్రల్ రైల్వే, పీబీ సిద్ధార్థ కళాశాలతోపాటు పలు విద్యా సంస్థలు బకాయిలున్నప్పటికీ వాటి నుంచి వసూళ్లు చేయకుండా విజ్ఞానానికి ప్రతీకగా ఉండే ప్రభుత్వ కళాశాలపై చర్యలకు వీఎంసీ అ«ధికారులు పూనుకోవటం వీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జె. నివాస్, అడిషినల్ కమిషనర్ డి. చంద్రశేఖర్ జర్మనీటూర్‌లో ఉండగా.. వీఎంసీ రెవెన్యూ అధికారులు చర్యలకు పూనుకోవడం గమనార్హం.
ఏళ్లుగా బాకీ..
ఇటీవల సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) కార్పొరేషన్ పన్నుల వసూళ్లకు చొరవ చూపటం, దీర్ఘకాలికంగా బకాయిదారులుగా ఉన్న సంస్థలను గుర్తించి.. వాటికి నోటీసులు జారీ చేస్తూ వస్తుంది. ఇప్పటికీ ఈ కళాశాలకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. స్పందించకపోవటంతో కార్పొరేషన్ పాలిటెక్నిక్ కళాశాలను జప్తు చేసేందుకు సిద్ధమయ్యిందని వీఎంసీ అధికారులు చెబుతున్నారు. నగరంలోని ఏలూరురోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 2002 నుంచి వీఎంసీకి చెల్లించాల్సిన ఆస్తిపన్ను చెల్లించటంలేదని తెలుస్తోంది. 2002 నుంచి 2018 వరకు కళాశాల 6.5 కోట్లు బకాయి ఉంది. వీటితోపాటు బందరురోడ్డులోని సబ్‌కలెక్టర్ కార్యలయం పదేళ్లకుగానూ రూ. 3 కోట్లు, సౌత్‌సెంట్రల్‌రైల్వే ఆరేళ్లకు రూ. 50 లక్షలు, నగరంలోని సిద్ధార్థ అకాడమీ 2011 –2018 వరకు సుమారు రూ. 80 లక్షలు వీఎంసీకి బకాయి కట్టాల్సి ఉంది. వీటన్నింటినీ వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని అధికారులు చెబుతున్నారు
లక్ష్యాన్ని సాధించేందుకే..
2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ. 125 కోట్లు వసూళ్లు నిర్ధేశిస్తే అందులో రూ. ఇప్పటి వరకు కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొండి బకాయిలపై దృష్టిసారించారని వీఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్పెషల్ డ్రైవ్‌లో భాగమే..
నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి సుమారు రూ. 30 కోట్ల వరకు ఆస్తిపన్నులు దీర్ఘకాలికంగా బకాయిలున్నాయి. వీటితోపాటు కొన్ని ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి పన్నులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఉండటంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈనేపథ్యంలోనే మొండి బకాయిలు వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం.
– జి. సుబ్బారావు,డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ)
Comments
Please login to add a commentAdd a comment