వారికి పాఠాల్లేవు...వీరికి ఉద్యోగాల్లేవు  | Lectures Shortage In AP Government polytechnic | Sakshi
Sakshi News home page

వారికి పాఠాల్లేవు...వీరికి ఉద్యోగాల్లేవు 

Published Mon, Jul 8 2019 8:52 AM | Last Updated on Mon, Jul 8 2019 8:52 AM

Lectures Shortage In AP Government polytechnic - Sakshi

సాక్షి, అమరావతి : ఓ పక్క సరిపడా లెక్చరర్లు లేక కాలేజీల్లో బోధన ముందుకు సాగడం లేదు.. మరోపక్క అక్కడే పనిచేస్తూ విధులకు దూరమైన కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగాల్లేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయా పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పనిచేస్తున్న 232 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లను అప్పటి ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్‌ అధ్యాపకులను నియమించినందున వారిని తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఏపీలో 100 మంది, తెలంగాణలో 132 మంది ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉన్నారు. వాస్తవానికి ఏపీపీఎస్సీ ద్వారా కొన్ని పోస్టులు భర్తీచేసినా ఇంకా అనేక ఖాళీలున్నందున వాటిలో వీరిని తిరిగి నియమించవచ్చు. కానీ విభజన అనంతరం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వీరిని చేర్చుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు కోల్పోయిన పాలిటెక్నిక్‌ ఒప్పంద అధ్యాపకులను మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఖాళీ పోస్టులున్నా వీరిని తిరిగి తీసుకోకుండా కొనసాగుతున్న ఒప్పంద అధ్యాపకులకు మాత్రమే రెన్యువల్‌ చేస్తూ వెళ్లింది.

కేంద్రం కొత్త కాలేజీలు ఇచ్చినా...
కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్తగా 24 పాలిటెక్నిక్‌ కాలేజీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఆమేరకు కొన్నిటిని కొత్తగా ఏర్పాటు చేశారు. అయినా వీటిలో పోస్టులు మాత్రం భర్తీ కాలేదు. ఆ పోస్టులను ఐదేళ్లుగా ఖాళీగానే కొనసాగించారు తప్ప కాంట్రాక్ట్‌ పద్ధతిన కూడా నియామకాలు చేయలేదు. వీటిలో వేర్వేరు కాలేజీల్లో పనిచేస్తున్న వారినే సర్దుబాటు చేసి పాఠాలు చెప్పించారని నిరుద్యోగులు వాపోయారు. ఇప్పటికీ కొన్ని కాలేజీల్లో ఇదే పద్ధతి కొనసాగుతోందని, కొన్నిటిలో ఒక సబ్జెక్ట్‌ అధ్యాపకుడు వేర్వేరు సబ్జెక్టులు బోధిస్తున్నారని పేర్కొన్నారు. బయాలజీ అధ్యాపకుడితో కెమిస్ట్రీ లేదా ఇంగ్లిష్, మరో సబ్జెక్ట్‌ లెక్చరర్‌తో సంబంధం లేని సబ్జెక్ట్‌లు బోధింపజేస్తున్నారని తెలిపారు. గెస్ట్‌ లెక్చరర్లుగా కొంతమందిని నియమించి వారితో ఇలా చేయిస్తున్నారని తెలిపారు. అర్హులైన తాము కాంట్రాక్ట్‌ పద్ధతిలోనైనా పనిచేయడానికి కార్యాలయాల చుట్టూ తిరిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని వారు వాపోయారు. గతంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్లుగా పనిచేసి రోడ్డున పడిన తమను తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కాలేజీల పరిస్థితి ఇది.. 
కాలేజీ     సంఖ్య      విద్యార్థులు 
ప్రభుత్వ     84           40,056 
ఎయిడెడ్‌    02          1,502 
ప్రైవేట్‌       201          1,00,470 

ప్రభుత్వ కాలేజీల్లో పోస్టుల పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement