
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం జీవో 133ని విడుదల చేశారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ వర్తిస్తుంది. రెండేళ్ల కనీస సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.
స్పౌజ్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, దివ్యాంగులకు ప్రత్యేక పాయింట్లు కేటాయించి బదిలీల్లో వారికి ప్రాధాన్యత కల్పించారు. దీర్ఘకాలంగా పాలిటెక్నిక్ అధ్యాపకులు ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం అనుమతించడంపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అయితే, బదిలీలు చేపట్టే నాటికి ఆ స్థానంలో ఐదేళ్లు పూర్తయి, రిటైర్మెంట్‌కు సమీపంలో ఆరు నెలల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న వారిని కూడా బదిలీ చేసేలా నిబంధన పెట్టారని, ఇది కొంతమంది ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతోందన్నారు.