నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ తగులుతోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు దూరమని ఉద్యోగులు ప్రకటించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై ఎట్టకేలకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అనువైన పరిస్థితులు కానరావడం లేదు. ఈ ఏడాది మే 10న నిర్వహించిన ఇంజినీరింగ్ అర్హత పరీక్షకు జిల్లాలో 17, 582 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను మే నెలాఖరులో ప్రకటించారు. పరీక్షకు హాజై రెన విద్యార్థులంతా దాదాపుగా ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి అర్హత సాధించారు.
సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాట్లు చేశారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం నుంచి విశాఖలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ (పాలా) ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు దీక్షలో పాల్గొంటున్నారు. వీరితో పాటు జిల్లాని అనకాపల్లి, భీమిలి, నర్సీపట్నం, పాడేరు ప్రభుత్వ కళాశాలల సిబ్బంది మద్దతు తెలుపుతున్నారు.
పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్‌లోని ఉద్యోగులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా విధులను బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మాకుమ్మడి సెలవులు పెట్టారు. ఈ నెల 19 నుంచి హెల్ప్ సెంటర్‌లలో విధులకు హాజరు కాబోమని తేల్చిచెప్పారు. దీనికితోడు విధులను బహిష్కరిస్తున్నట్టు పాలా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంధ్రశేఖర్ మరోమారు ప్రకటించారు. కన్వీనర్ నుంచి ఎటువంటి ఉత్తర్వులు తమకు అందలేదని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి.దేముడు చెప్పారు.
సమైక్యాంధ్ర ఉద్యమంతో...
ప్రధానంగా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వీటి ఆధారంగానే విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తారు. ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగులంతా సమ్మెలో ఉండటం వల్ల వీటిని పొందే అవకాశం లేదు. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు బస్సుల ఇబ్బంది తలెత్తనుంది. సమైక్యాంధ్ర సమ్మె వల్ల రోడ్లపై ఆందోళనలతో వాహనాలు తిరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తే అధికశాతం మంది విద్యార్థులు హాజరు కాకపోవడమే కాకుండా, ధ్రువపత్రాలు లేక మరికొంతమంది అనర్హులుగా పరిగణించబడతారు. దీంతో కౌన్సెలింగ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది.
కౌన్సెలింగ్‌పై ఉత్కంఠ!
Published Sun, Aug 18 2013 1:04 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
Advertisement
Advertisement