సజావుగా ‘పాలిసెట్’ కౌన్సెలింగ్
బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2014-పాలిసెట్ కౌన్సెలింగ్ సజావుగా జరుగుతోంది. మంగళవారం 20,001 నుంచి 40,000ల వరకు ర్యాంకు సాధించిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. రెండో రోజు విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన కోసం జిల్లాలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత విద్యార్థులను ర్యాంకు క్రమపద్ధతిలో హెల్ప్‌లైన్ సెంటర్‌లోకి ఆహ్వానించారు.
ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు గంటల కొద్ది నిరీక్షించారు. కౌన్సెలింగ్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేశారు. బాలబాలికల కోసం వేర్వేరుగా షామియానాలు ఏర్పాటు చేసినా అవి సరిపోకపోవడంతో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో, కళాశాల క్యాంటీన్‌లో విద్యార్థులు ఉండిపోవల్సి వచ్చింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, సోదరులు వెంట రావడంతో కౌన్సెలింగ్ కేంద్రం వద్ద సందడి కనిపించింది.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు అందుబాటులో భోజన సదుపాయం లేక ఇబ్బందులు పడ్డారు. అనేక మంది విద్యార్థులు టీ, టిఫిన్‌తోనే మధ్యాహ్నం సరిపెట్టుకున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు ఎన్నో వ్యయప్రయాసాలకు గురయ్యారు. విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడంలో పాలిటెక్నిక్ అధికారులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.