poly cet counseling
-
సజావుగా ‘పాలిసెట్’ కౌన్సెలింగ్
బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2014-పాలిసెట్ కౌన్సెలింగ్ సజావుగా జరుగుతోంది. మంగళవారం 20,001 నుంచి 40,000ల వరకు ర్యాంకు సాధించిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. రెండో రోజు విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన కోసం జిల్లాలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత విద్యార్థులను ర్యాంకు క్రమపద్ధతిలో హెల్ప్‌లైన్ సెంటర్లోకి ఆహ్వానించారు. ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు గంటల కొద్ది నిరీక్షించారు. కౌన్సెలింగ్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేశారు. బాలబాలికల కోసం వేర్వేరుగా షామియానాలు ఏర్పాటు చేసినా అవి సరిపోకపోవడంతో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో, కళాశాల క్యాంటీన్లో విద్యార్థులు ఉండిపోవల్సి వచ్చింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, సోదరులు వెంట రావడంతో కౌన్సెలింగ్ కేంద్రం వద్ద సందడి కనిపించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు అందుబాటులో భోజన సదుపాయం లేక ఇబ్బందులు పడ్డారు. అనేక మంది విద్యార్థులు టీ, టిఫిన్‌తోనే మధ్యాహ్నం సరిపెట్టుకున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు ఎన్నో వ్యయప్రయాసాలకు గురయ్యారు. విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడంలో పాలిటెక్నిక్ అధికారులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ఆరంభం
బెల్లంపల్లి : 2014-పాలిసెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం 9గంటలకు కౌన్సెలింగ్ ఆరంభం కాగా.. జిల్లాలోని ఆదిలాబాద్ నిర్మల్, కడెం, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్ తదితర సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థిని, విద్యార్థులు హాజరయ్యారు. తొలి రోజు ఒకటో ర్యాంకు నుంచి 20,000 ర్యాంకు సాధించిన విద్యార్థులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. విద్యార్థులను ర్యాంకు ఆధారంగా హెల్ప్‌లైన్ కేంద్రంలోకి వరుస క్రమంలో పిలిచారు. ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత పక్కనున్న గదిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు ఆప్షన్ల నమోదు, ఇంజినీరింగ్ కళాశాలలు, బ్రాంచ్‌ల వివరాలు వివరిస్తూ అవగాహన కల్పించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావడంతో హెల్ప్‌లైన్ కేంద్రం సందడిగా మారింది. విద్యార్థులకు ఎండ తగలకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అందుబాటులో భోజన సౌకర్యం లేక ఇక్కట్లు పడ్డారు. తొలి రోజు కౌన్సెలింగ్ సజావుగా సాగింది.