బెల్లంపల్లి : 2014-పాలిసెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం 9గంటలకు కౌన్సెలింగ్ ఆరంభం కాగా.. జిల్లాలోని ఆదిలాబాద్ నిర్మల్, కడెం, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్ తదితర సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థిని, విద్యార్థులు హాజరయ్యారు. తొలి రోజు ఒకటో ర్యాంకు నుంచి 20,000 ర్యాంకు సాధించిన విద్యార్థులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు.
విద్యార్థులను ర్యాంకు ఆధారంగా హెల్ప్‌లైన్ కేంద్రంలోకి వరుస క్రమంలో పిలిచారు. ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత పక్కనున్న గదిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు ఆప్షన్ల నమోదు, ఇంజినీరింగ్ కళాశాలలు, బ్రాంచ్‌ల వివరాలు వివరిస్తూ అవగాహన కల్పించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావడంతో హెల్ప్‌లైన్ కేంద్రం సందడిగా మారింది. విద్యార్థులకు ఎండ తగలకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అందుబాటులో భోజన సౌకర్యం లేక ఇక్కట్లు పడ్డారు. తొలి రోజు కౌన్సెలింగ్ సజావుగా సాగింది.
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ఆరంభం
Published Tue, Jun 10 2014 4:14 AM | Last Updated on Thu, Jul 25 2019 5:24 PM
Advertisement