
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్‌ను మే 3వరకూ పొడిగించడంతో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 20 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన అనంతరం కార్మిక శాఖ ఈ వివరాలు వెల్లడించింది. మహమ్మారి కేసుల తీవ్రత తగ్గితే ఏప్రిల్ 20 నుంచి కొన్ని ప్రాంతాల్లో షరతులతో కూడిన సడలింపును ప్రకటించవచ్చని ప్రధాని ప్రకటన ఆధారంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత మూడువారాలుగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌లో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో స్వస్ధలాలకు చేరుకోలేక వేలాది వలస కూలీలు ఇబ్బందులు పడగా, మరికొందరు వేతనాలు అందక..ఉద్యోగాలు కోల్పోయి మరికొందరు అసంఘటిత రంగ కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వలస కూలీల ఇబ్బందుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన కార్మిక శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ 20 కంటోల్ రూంలను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్‌లు కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశాలతో పాటు వీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి పరిష్కరిస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫోన్ నెంబర్లు, వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా ఈ కాల్‌సెంటర్స్‌ను కార్మికులు సంప్రదించవచ్చని పేర్కొంది. కార్మికులు ఎవరైనా కాల్ సెంటర్స్‌లో ఆయా నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment