s నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో రెండు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు కేంద్రాలుగా ఎంసెట్(ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను పటిష్ట పోలీసు పహారా మధ్య జిల్లా ఉన్నతాధికారులు సోమవారం నిర్వహించారు. పాలిటెక్నిక్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కౌన్సెలింగ్ విధులను బహిష్కరించారు. కలెక్టర్ శ్రీకాంత్ ఆదేశాలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కౌన్సెలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కుల ధ్రువీకరణపత్రాలను పరిశీలించాల్సిన
సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖలకు చెందిన ఎన్‌జీఓలు సైతం సమ్మెలో ఉండడంతో ఆయా శాఖల ప్రాజెక్ట్ డెరైక్టర్లు, అధికారులు రంగ ప్రవేశం చేసి కౌన్సెలింగ్ ప్రక్రియకు ఊతమిచ్చారు. దర్గామిట్టలోని ప్రభుత్వ మహిళా కళాశాల కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది సహకరించక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న తరుణంలో కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ రామకృష్ణ నేరుగా కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చి ప్రిన్సిపల్ నారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా ఇచ్చారు.
సమ్మెలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల సిబ్బందిని పిలిపించి మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కౌన్సెలింగ్ సజావుగా నిర్వహించాలని డీఆర్‌డీఏ పీడీ వి.వెంకటసుబ్బయ్యను ఆదేశించారు. డీఆర్‌డీఏ పీడీ సమాచారంతో సోషల్ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఈడీ కోటేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ పీఓ వై.వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సోమయ్య రెండు కేంద్రాలలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇంతలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు ప్రసన్న, శ్రావణ్, తిరుమలనాయుడు, ముజీర్, రోజ్దూర్, ఆదిత్యసాయి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల గేటు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఒక దశలో కళాశాలలోనికి ప్రవేశించి కౌన్సెలింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీ సులు అరెస్ట్‌చేసి నాల్గవ నగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యాపకులు కళాశాల ఎదుట జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అధికసంఖ్యలో హాజరయ్యారు. దర్గామిట్టలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 59 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. అదే విధంగా వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలు ర పాలిటెక్నిక్ కళాశాలలో 153 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో..
దర్గామిట్టలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన ప్రక్రియను ఆపే ప్రసక్తేలేదన్నారు. కొంత మంది సహకరించకపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కౌన్సెలింగ్‌ను నిర్వహించాల్సిందేనని తెలిపారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు:ఎస్పీ
కౌన్సెలింగ్‌ను అడ్డుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవు. కౌన్సెలింగ్ నిర్వహణకు పోలీసుల సహకారం ఉంటుంది. ఆందోళనకారులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలి.
ఆటంకాల మధ్య ఎంసెట్ కౌన్సెలింగ్
Published Tue, Aug 20 2013 6:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement