
సాక్షి, చెన్నై: బతుకుదెరువు కోసం పోలీసు ఉద్యోగంలో చేరినా, తన చిన్న నాటి కలనుసాకారం చేసుకునేందుకు 12 ఏళ్ల పాటు ఓ కానిస్టేబుల్ అవిశ్రాంతంగా శ్రమించారు. ప్రొఫెసర్ కావాలన్న తన కలను సాకారం చేసుకున్నాడు. వివరాలు.. తిరునల్వేలి నగరం మలయాల మేడుకు చెందిన అరవిందపెరుమాల్(34) పోలీసు రాత పరీక్ష, ఎంపిక ద్వారా 2011లో కానిస్టేబుల్ అయ్యాడు.
ఆర్థికశాస్త్రం పట్టభద్రుడైన ఇతను స్థానిక స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచి ప్రొఫెసర్ కావాలన్న తన కలను సాకరం చేసుకునేందుకు సహకరించాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నాడు. అతడికి ఆ జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం అందించింది. దీంతో 2014 నుంచి తిరునల్వేలి మనోన్మనియం సుందరనార్ వర్సిటీలో పీహెచ్‌డీ చేశాడు.
అసంఘటితరంగంలోని కార్మికుల ఆర్థిక పరిస్థితులపై పీహెచ్‌డీ పూర్తి చేసి, ఈ ఏడాది పట్టా పుచ్చుకున్నాడు. ఆర్థిక శాస్త్రంపై అరవింద్‌కు ఉన్న పట్టుకు ప్రతిఫలం లభించింది. 12 సంవత్సరాల పాటు పోలీసుగా విధి నిర్వహణలో తనవంతుగా సేవల్ని అందిస్తూ వచ్చిన అరవింద్‌కు ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం లభించింది. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లోని హిందూ కళాశాలలో ఆయనకు ఈ పోస్టు లభించింది. దీంతో అరవింద్‌ఆనందానికి అవధులు లేవు. తన కల సాకారంలో పోలీసు అధికారుల సహకారం ఎంతో ఉందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment