కూలీ టు ప్రొఫెసర్‌ | Inspirational Story About Assistant Professor In Karimnagar | Sakshi
Sakshi News home page

కూలీ టు ప్రొఫెసర్‌

Published Sat, Aug 17 2019 8:34 AM | Last Updated on Sat, Aug 17 2019 8:34 AM

Inspirational Story About Assistant Professor In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఆర్థిక స్థోమత లేక చిన్నతనం నుంచి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ సర్కారు విద్యనభ్యసించాడు. స్థానికంగా రెసిడెన్షియల్‌ కళాశాలలు లేవని డబ్బులు కట్టే స్థోమత లేక ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ వెళ్లి డిగ్రీ చదివాడు. మొదట ఫెయిలయినా పట్టుపట్టి పాసయ్యాడు. ఇక జీవితంలో విఫలమవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక అతను సాధించిన విజయాలకు బ్రేక్‌ లేకుండా పోయింది.వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం ఎస్సారార్‌ ప్రభుత్వ ఆర్ట్స్,సైన్స్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదట ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారిగా పనిచేసి రాష్ట్రస్థాయిలో ప్రశంసలు పొందాడు సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌ గ్రామానికి చెందిన రాజు.

ఆర్థిక ఇబ్బందుల మధ్యే చదువులు
కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌ గ్రామానికి చెందిన రాజు అమ్మనాన్నలు దేవయ్య, వెంకటమ్మ. నలుగురు అన్నదమ్ముల్లో రాజు చిన్నవాడు. చిన్నతనంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కొంచెం పెద్దయ్యాక తల్లిదండ్రులతో కలిసి భవననిర్మాన కూలీ పనికి వెళ్లేవాడు. పదోతరగతి పెంబట్లలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో 1996లో పూర్తిచేశాడు. ఇంటర్‌ మేడిపల్లిలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో 1998లో, కర్నూల్‌లోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ (బయోకెమిస్ట్రీ–జువాలజీ–కెమిస్ట్రీ)గ్రూపులో చేరాడు. మొదట ఫేయిలయ్యాడు. తర్వాత కష్టపడి చదివి 2001లో ఉత్తీర్ణుడయ్యాడు. 2003–04లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశాడు. 2005–07లో కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేశాడు.

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు 
డిగ్రీలో ఫెయిల్‌ అయిన రాజుకు చిన్నతనం నుంచి తను అనుభవిస్తున్న అర్థిక పరిస్థితులు పాఠాలు నేర్పాయి. జీవితంలో ఫెయిల్‌కావద్దని నిర్ణయించుకున్నాడు. వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2007లో హాస్టల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌గా, 2009లో నెట్‌లోఅర్హత సాధించాడు. 2011లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాలలో చేరాడు. ఆ తర్వాత 2012 జూనియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది కానీ వెళ్లలేదు.

సేవల్లోనూ రా‘రాజు’ 
రాజు 2013లో ఎస్సారార్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారిగా «ఎంపికయ్యాడు. 2015లో మానవవిలువల పరిరక్షణ సమితి ద్వారా విశిష్టసేవా పురస్కారం సాధించాడు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్, రక్తదానాల కార్యాక్రమాలు నిర్వహించి 2016లో జిల్లా ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం అధికారి అవార్డును మంత్రి ఈటల రాజేందర్‌చేతుల మీదుగా అందుకున్నాడు. కళాశాల విద్యాశాఖ యువతరంగం ద్వారా 2017–18 సంవత్సరానికి ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ చేతుల మీదుగా ‘బెస్ట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌’ అవార్డు పొందాడు. ప్రస్తుతం ఎస్సారార్‌ కళాశాలలో ఎన్‌సీసీ అధికారిగా సేవలందిస్తున్నాడు.

కష్టపడితేనే విజయం 
జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. డబ్బులు లేక అమ్మనాన్నలతో కలిసి కూలీకి వెళ్లా. చిన్ననాటి నుంచి రెసిడెన్షియల్‌లోనే చవివా. డిగ్రీ ఫెయిల్‌ కావడంతో బాధపడ్డాను. అప్పటి నుండి ఇక ఎప్పుడూ ఫేయిల్‌ కాలేదు. మూడు ఉద్యోగాలు వచ్చాయి. డిగ్రీ లెక్చరర్‌గా ఎస్సారార్‌లో జాయిన్‌ అయ్యాను. విద్యార్థులు కోర్సుల్లో ఫెయిలై చాలా మంది ఆత్యహత్యలు చేసుకోకూడదు. ఓపికతో కష్టపడి ముందుకు సాగితే విజయం వరిస్తుంది.
– పర్లపల్లి రాజు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement