srr college
-
Sakshi Premier League 2023: ఫైనల్లో ఎస్ఆర్ఆర్, గౌతమ్ కాలేజీ జట్లు
ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర స్థాయి సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ జూనియర్ విభాగంలో ఎస్ఆర్ఆర్ కాలేజి (మంచిర్యాల), గౌతమ్ జూనియర్ కాలేజి (ఈసీఐఎల్) జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. సీనియర్ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల), భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్‌పురి) జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫైనల్స్ నేడు జరుగుతాయి. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారంలోని బాబురావు సాగర్ మైదానంలో ఈ టోర్నీ జరుగుతోంది. సోమవారం జరిగిన జూనియర్ విభాగం తొలి మ్యాచ్‌లో ఎస్ఆర్ఆర్ కాలేజి తొమ్మిది వికెట్లతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి (వరంగల్)పై గెలిచింది. ముందుగా పాలిటెక్నిక్ కాలేజి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అనంతరం ఎస్ఆర్ఆర్ కాలేజి 7.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసి గెలుపొందింది. ఎస్ఆర్ఆర్ ప్లేయర్ కృష్ణతేజ 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గౌతమ్ జూనియర్ కాలేజి 67 పరుగుల తేడాతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి (వరంగల్)ను ఓడించింది. ముందుగా గౌతమ్ కాలేజి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అన్విత్ రెడ్డి 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 52 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. సీనియర్ విభాగం తొలి మ్యాచ్‌లో వాగ్దేవి డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్లతో ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజి (ఖమ్మం)పై నెగ్గింది. ముందుగా ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులు చేయగా... వాగ్దేవి కాలేజి 6 ఓవర్లలో 2 వికెట్లకు 75 పరుగులు చేసి గెలిచింది. సాయి 16 బంతుల్లో 38 పరుగులు చేశాడు. సీనియర్ విభాగం రెండో మ్యాచ్‌లో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి ఐదు వికెట్లతో ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజిని ఓడించింది. మొదట ఎస్ఆర్బీజీఎన్ఆర్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అనంతరం భవాన్స్ వివేకానంద కాలేజి 6.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి గెలుపొందింది. భవాన్స్ ప్లేయర్ కృతిక్ 17 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. -
ఎస్ఆర్ఆర్లో సందడే సందడి!
సాక్షి, విజయవాడ : నగరంలోని ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ (1975-1978) బి.కాం (ఇంగ్లీష్ మీడియం) బ్యాచ్ మేట్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం (డిసెంబరు 21) ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సుమారు 40 మంది రోజంతా కాలేజీ నాటి సంగతులతో సరదా సరదాగా గడిపారు. కాలేజీ నేర్పిన జీవిత సత్యాలు తమ ఎదుగుదలకు ఎలా సోపానంగా మారాయో అంతా అనుభవాలను పంచుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో "నాటి స్నేహితుల నేటి కలయిక" విజయవంతంగా జరిగింది. కళాశాల ఆవరణ అంతా కలియతిరిగి.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వాట్సాప్ సంధాన సందేశాల సాయంతో ఒక్కో బ్యాచ్ మేట్ వివరాలను ఒకచోట చేర్చిన మిత్ర బృందం కెజిఎన్ గుప్తా, యనమండ్ర రమేష్, వైవి కృష్ణయ్య అభినందనలు అందుకున్నారు. గెట్ టుగెదర్ నిర్వహించుకోవడానికి కళాశాల ఏసి కాన్ఫరెన్స్ హాలు ఇచ్చి, పూర్తి సహాయ సహకారాలు అందించి, కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంటు కాలేజీ ప్రిన్సిపాల్ జోషి కి పూర్వ విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేసేరు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ పరిమి శ్రీధర్ మోడరేటర్ గా వ్యవహరించారు. -
కూలీ టు ప్రొఫెసర్
సాక్షి, కరీంనగర్ : ఆర్థిక స్థోమత లేక చిన్నతనం నుంచి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ సర్కారు విద్యనభ్యసించాడు. స్థానికంగా రెసిడెన్షియల్ కళాశాలలు లేవని డబ్బులు కట్టే స్థోమత లేక ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ వెళ్లి డిగ్రీ చదివాడు. మొదట ఫెయిలయినా పట్టుపట్టి పాసయ్యాడు. ఇక జీవితంలో విఫలమవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక అతను సాధించిన విజయాలకు బ్రేక్ లేకుండా పోయింది.వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్,సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదట ఎన్ఎస్ఎస్ అధికారిగా పనిచేసి రాష్ట్రస్థాయిలో ప్రశంసలు పొందాడు సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన రాజు. ఆర్థిక ఇబ్బందుల మధ్యే చదువులు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన రాజు అమ్మనాన్నలు దేవయ్య, వెంకటమ్మ. నలుగురు అన్నదమ్ముల్లో రాజు చిన్నవాడు. చిన్నతనంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కొంచెం పెద్దయ్యాక తల్లిదండ్రులతో కలిసి భవననిర్మాన కూలీ పనికి వెళ్లేవాడు. పదోతరగతి పెంబట్లలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 1996లో పూర్తిచేశాడు. ఇంటర్ మేడిపల్లిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో 1998లో, కర్నూల్లోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ (బయోకెమిస్ట్రీ–జువాలజీ–కెమిస్ట్రీ)గ్రూపులో చేరాడు. మొదట ఫేయిలయ్యాడు. తర్వాత కష్టపడి చదివి 2001లో ఉత్తీర్ణుడయ్యాడు. 2003–04లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశాడు. 2005–07లో కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేశాడు. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు డిగ్రీలో ఫెయిల్ అయిన రాజుకు చిన్నతనం నుంచి తను అనుభవిస్తున్న అర్థిక పరిస్థితులు పాఠాలు నేర్పాయి. జీవితంలో ఫెయిల్‌కావద్దని నిర్ణయించుకున్నాడు. వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2007లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా, 2009లో నెట్‌లోఅర్హత సాధించాడు. 2011లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో చేరాడు. ఆ తర్వాత 2012 జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది కానీ వెళ్లలేదు. సేవల్లోనూ రా‘రాజు’ రాజు 2013లో ఎస్సారార్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా «ఎంపికయ్యాడు. 2015లో మానవవిలువల పరిరక్షణ సమితి ద్వారా విశిష్టసేవా పురస్కారం సాధించాడు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్, రక్తదానాల కార్యాక్రమాలు నిర్వహించి 2016లో జిల్లా ఉత్తమ ఎన్ఎస్ఎస్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం అధికారి అవార్డును మంత్రి ఈటల రాజేందర్‌చేతుల మీదుగా అందుకున్నాడు. కళాశాల విద్యాశాఖ యువతరంగం ద్వారా 2017–18 సంవత్సరానికి ఉన్నత విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్’ అవార్డు పొందాడు. ప్రస్తుతం ఎస్సారార్ కళాశాలలో ఎన్సీసీ అధికారిగా సేవలందిస్తున్నాడు. కష్టపడితేనే విజయం జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. డబ్బులు లేక అమ్మనాన్నలతో కలిసి కూలీకి వెళ్లా. చిన్ననాటి నుంచి రెసిడెన్షియల్‌లోనే చవివా. డిగ్రీ ఫెయిల్ కావడంతో బాధపడ్డాను. అప్పటి నుండి ఇక ఎప్పుడూ ఫేయిల్ కాలేదు. మూడు ఉద్యోగాలు వచ్చాయి. డిగ్రీ లెక్చరర్‌గా ఎస్సారార్‌లో జాయిన్ అయ్యాను. విద్యార్థులు కోర్సుల్లో ఫెయిలై చాలా మంది ఆత్యహత్యలు చేసుకోకూడదు. ఓపికతో కష్టపడి ముందుకు సాగితే విజయం వరిస్తుంది. – పర్లపల్లి రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
కబడ్డీ చాంప్ ఎస్ఆర్ఆర్
విజయవాడ స్పోర్ట్స్/విజయవాడ రూరల్ : కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్‌ను విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల జట్టు కైవసం చేసుకుంది. విజయవాడ రూరల్ మండలం నున్నలోని వికాస్ బీపీఈడీ కళాశాలలలో కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో జగ్గయ్యపేట ఎస్జీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై 28-32 తేడాతో ఎస్ఆర్ఆర్ కళాశాల జట్టు ఘన విజయం సాధించింది. ఎస్ఆర్ఆర్ కళాశాల క్రీడాకారులు శ్రావణ్, సందీప్, కుమార్, సర్దార్, నరసింహ ఆల్‌రౌండ్ ప్రతిభ కనపరిచి జట్టుకు విజయాన్ని అందించారు. నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. ఎస్జీఎస్ జట్టు ద్వితీయ స్థానం పొందింది. మూడు నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల జట్టుపై 28-34 తేడాతో విజయా బీపీఈడీ కళాశాల జట్టు వియజం సాధించింది. ఈ పోటీల్లో టి.శ్రావణ్‌కుమార్ (ఎస్ఆర్ఆర్) బెస్ట్ రైడర్‌గా, కె.నవీన్ (జగ్గయ్యపేట ఎస్జీఎస్) బెస్ట్ డిఫెన్స్ ప్లేయర్ అవార్డుల కింద రూ.2వేల నగదు బహుమతిని అందుకున్నారు. అంతర్ కళాశాలల పోటీల్లో ప్రోత్సాహాక నగదు బహుమతులు ఇవ్వడం ఇదే ప్రథమం. పోటీల అనంతరం జరిగిన కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నున్న సర్పంచ్ కర్రె విజయకుమార్, కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, వికాస్ విద్యా సంస్థల చైర్మన్ నరెడ్ల నర్సిరెడ్డి, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి, న్యాయవాది రాజేశ్వరరావు, వికాస్ బీపీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యకు అధిక ప్రాధాన్యం
కరీంనగర్ సిటీ : ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. వరంగల్ తరువాత విద్యలో అంతటి ప్రాముఖ్యత కలిగిన జిల్లా కరీంనగర్ అన్నారు. సోమవారం నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో రూ.1కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.70 లక్షల వ్యయంతో నాలుగు అదనపు తరగతి గదులు, రూ. 35 లక్షలతో సోలార్‌సిస్టం రూ. 35 లక్షలతో మరమ్మతు పనులు చేయనున్నటు చెప్పారు. ఎస్ఆర్ఆర్ కళాశాల ఎంతో మంది మేధావులను అందించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కళాశాల ప్రాశస్త్యాన్ని కాపాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, డెప్యూటి మేయర్ గుగ్గిళ్లపు రమేష్, స్థానిక కార్పోరేటర్ బత్తుల భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్వై జిల్లా అధ్యక్షుడు కట్ల సతీష్, కొండపల్లి సతీష్, అనంతుల రమేష్, అనిల్ పాల్గొన్నారు. -
విద్యకే ఉన్నత ప్రాధాన్యత
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎస్సారార్‌లో ప్రతిభా పురస్కారాలు ప్రదానం కరీంనగర్‌కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఉన్నత ప్రాధాన్యత ఇస్తుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లోనే ఉత్తమ విద్యనందిస్తున్నా.. ప్రై వేట్‌కు వచ్చినంత ప్రచారం రావడం లేదన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారెందరో ఉన్నతస్థాయిలో ఉన్నారన్నారు. ఎస్సారార్ కళాశాల గొప్పతనాన్ని, వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది వివిధ సబ్జెక్టుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఎంపీపీ వాసాల రమేశ్, కళాశాల ప్రిన్సిపాల్ పి.నితిన్, అధ్యాపకులు వై.సత్యనారాయణ, వంగల శ్రీనివాస్, స్టాఫ్ క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వై.మహేశ్, ఎలిజబెత్ రాణి, సంజీవ్, వడ్లూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
భాషను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
మధురానగర్: మన భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భాషను నిర్లక్ష్యం చేస్తే సంస్కృతికి ప్రమాదమని ఏఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంకర్ పేర్కొన్నారు. మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో సోమవారం తెలుగు, ఇంగ్లిషు, సంస్కృతం, హిందీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ వల్లూరుపల్లి రవి అధ్యక్షతన భాషాబోధనలో సవాళ్ళు అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ ఎస్. శంకర్ పాల్గొని కీలకోపన్యాసం చేశారు. భాషాబోధనలో ఉండే సవాళ్ళు, పరిష్కార మార్గాలను అందరికీ అర్థమయ్యేరీతిలో వివరించారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ భాష అనే చెట్టు ఫలాలను భక్షించటం కాదు దాని తల్లివేరును పరిరక్షించాలని అన్నారు. హిందీ భాషా నిపుణులు డాక్టర్ డి. నాగేశ్వరరావు, డాక్టర్ పి. శ్రీనివాసరావు హిందీభాషలోని తమ అనుభవాలను వివరించారు. అనంతరం తెలుగు, ఇంగ్లిషు, హిందీ , సంస్కృతం విభాగాలు వేర్వేరుగా నిర్వహించిన సాంకేతిక సదస్సులు ఆలోచింపచేసే విధంగా సాగాయి. సదస్సులో రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆచార్యులు, అధ్యాపకులు పత్రాలను సమర్పించారు. అలాగే విద్యార్థులు భార్గవ్, మనీషా, ఇందిరాదేవి సమర్పించిన పత్రాలను పలువురు పెద్దలు ప్రశంసించారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీ వీ పూర్ణచంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన భాషా చరిత్రలోని విశేషాలను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ వి. శంకరరావు (చెన్నై), డాక్టర్ పి. శ్రీనివాసరావు , డాక్టర్ పలపర్తి శ్యామలానంద ప్రసాద్, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, తదితరులు పాల్గొని మాట్లాడారు. -
'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ... విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం స్థానిక ఎస్.ఆర్.ఆర్ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. అనంతరం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ విద్యార్థుల నినాదాలతో నగర రహదారులు మార్మోగాయి. అనంతరం రహదారిపై మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రాణ త్యాగం చేసిన మునికోటి ఆశయాలను సాధించుకోవడం కోసం విద్యార్థులంతా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు అవిశ్రాంతంగా పోరాడాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేతలు పిలుపు నిచ్చారు. -
బందూక్‌లో మనోళ్లు
కరీంనగర్ అర్బన్ : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బంగారు రాష్ట్రాన్ని ఎలా నిర్మించుకోవాలనే ఇతివృత్తంతో.. పూర్తిగా తెలంగాణ కళాకారులతో తెరకెక్కుతున్న చిత్రం బందూక్. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మూడు రోజులపాటు కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో జరిగింది. ప్రముఖ కవి గోరటి వెంకన్న రాసిన పాటను దాదాపు ఇరవై వేల మందితో పతాక సన్నివేశంగా చిత్రీకరించగా, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు సహా పలువురు ఉద్యమ, విద్యార్థి సంఘాల నాయకులు నటించారు. అంతేకాదు.. ఈ చిత్రానికి మరో విశేషమూ ఉంది. చిత్ర హీరో చైతన్యది కరీంనగర్ జ్యోతినగర్ కాగా, సిరిసిల్లకు చెందిన రాహుల్ కెమెరామన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అందరూ తెలంగాణవారే.. బందూక్ చిత్రంలో కళాకారులు, సాంకేతికవర్గం అందరూ తెలంగాణకు చెందిన వారేనని దర్శకుడు లక్ష్మణ్మురారి తెలిపారు. సోమవారం కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన తాను పద్నాలుగేళ్లుగా సినీపరిశ్రమలో ఉన్నానని చెప్పారు. అసిస్టెంట్ డెరైక్టర్ నుంచి డెరైక్టర్‌గా మారి పలు చిత్రాలు చూపొందించినట్టు చెప్పారు. ఇందులో విశాల్, ఏకవీర, కుర్రాల్లోయ్.. కుర్రాళ్లు.. ఇందు, ఆది పినిశెట్టి వంటి సినిమాలున్నాయని తెలిపారు. ఉద్యమాలకు పురిగడ్డ కరీంనగర్లో షూటింగ్‌కు అందరూ సహకరించారన్నారు. పరీక్షలు పూర్తి అయిన తరువాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. దీనికి నిర్మాతగా గుజ్జ యగంధర్రావు వ్యవహరిస్తున్నారు. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గాయత్రి హీరోరుున్ నటిస్తున్నారు. ఆమె గతంలో ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నారు. ఐస్‌క్రీం-2, జంధ్యాల ప్రేమకథ, కొబ్బరిమట్ట, బొమ్మలరామారం చిత్రాల్లో నటించారు. రెండో హీరోరుున్ హైదరాబాద్‌కు చెందిన షెహరాభాను ఐబీఎం ఉద్యోగిని. ఆమెకు ఇదే తొలిసినిమా. అమ్మ ప్రోత్సహంతోనే... మాది సిరిసిల్ల. తల్లిదండ్రులు మాచినేని మృదుల, మోహన్. నాకు చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ. కరీంనగర్‌లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాను. తర్వాత హైదరాబాద్‌లో 2011లో బీఎఫ్ఏ (బ్యాచలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేశాను. మూడు చిన్న సినిమాలైన ప్రయాణికుడు, గీతాలాపన, తిరగబడ్డ తెలంగాణకు కెమెరామన్‌గా పనిచేశాను. తెలంగాణ వచ్చిన తరువాత మన జిల్లా నుంచి నన్ను కెమెరామన్‌గా తీసుకొని బందూక్ సినిమా షూటింగ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ కళాకారులతో మరిన్ని సినిమాలకు కెమెరామన్‌గా వ్యవహరించాలనే కోరిక ఉంది. మా అమ్మ మృదుల ప్రోత్సంతోనే ఈస్థాయికి ఎదిగాను. - కెమెరామెన్ రాహుల్ అదృష్టంగా భావిస్తున్నా.. మాది కరీంనగర్ జ్యోతినగర్. తల్లిదండ్రులు మాదాడి కరుణాకర్, వకుళాదేవి. ఎంబీఏ పూర్తిచేసిన తర్వాత కొంతకాలం యూఎస్ వెళ్లాను. నాకు చిన్నప్పటినుంచి సినిమాలంటే ఇష్టం. సినిమాలో నటించేందుకు హైదరాబాద్ వచ్చి రామనంద్ వద్ద శిక్షణ పొందాను. రాంచరణ్, నితిన్, నాగచైతన్య వంటి హీరోలు రామనంద్ వద్ద శిక్షణ పొందినవారే. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడిన ఎస్సారార్ గ్రౌండ్‌లోనే హీరోగా యూక్ట్ చేయడం సంతోషంగా ఉంది. బందూక్‌లో హీరో పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. - హీరో చైతన్య