అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రధాని, రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీ: సీపీఎం, సీపీఐ, ఎంఐఎం మినహా దాదాపు అన్ని పార్టీలు ఒకే దేశం- ఒకేసారి ఎన్నికల అంశానికి మద్ధతు తెలిపాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం రాజ్‌నాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంపై ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారని అన్నారు. నిర్ధిష్ట కాల పరిమితిలో కమిటీ నివేదిక ఇస్తుందని స్పష్టం చేశారు. కమిటీలో ఎవరెవరు ఉంటారో ప్రధాని నిర్ణయిస్తారని వివరించారు. సభ సజావుగా కొనసాగడానికి అందరూ అంగీకరించారని, చర్చల ద్వారానే అన్ని అంశాలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు.
నీటి సంరక్షణ, మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమాలపై చర్చ జరిగిందని వెల్లడించారు. స్వాతంత్ర్య సమరంలో మహాత్మాగాంధీ ఎంత ముఖ్యంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ప్రధానమైన వ్యక్తిగా బాపూజీని గౌరవిస్తున్నామని చెప్పారు. వివిధ పార్టీల అధ్యక్షులు వెనకబడిన జిల్లాలకు మరో 10 శాతం నిధులు పెంచాలని కోరినట్లు తెలిపారు. స్వచ్ఛత అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకునే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment