![One Nation, One Poll: Law Commission Meets Ram Nath Kovind-Led Panel - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/26/kovid-pann%27.jpg.webp?itok=lte_tjQk)
న్యూఢిల్లీ: ‘ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు’ అంశంపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీతో కేంద్ర లా కమిషన్ బుధవారం భేటీ అయింది. లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగానికి చేయాల్సిన సవరణలు తదితరాలతో కూడిన రోడ్ మ్యాప్‌ను కమిటీ ముందు ఉంచింది. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా లా కమిషన్‌ను కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే పురమాయింది.
వాటితో పాటు మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతను కోవింద్ కమిటీకి అప్పగించింది. ఈ అంశంపై లా కమిషన్ రూపొందిస్తున్న నివేదిక ఇంకా తుది రూపు సంతరించుకోవాల్సి ఉందని సమాచారం. ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు అంశంపై అభిప్రాయాలు, సూచనలు 3 నెలల్లో చెప్పాలంటూ రాజకీయ పార్టీలకు కోవింద్ కమిటీ తాజాగా లేఖలు రాసింది. ఆరు జాతీయ పార్టీలు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు నమోదైన గుర్తింపు లేని పార్టీలకు లేఖలు వెళ్లాయి. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల పదవీకాలాలను పొడిగించడం, తగ్గించడం వంటి చర్యల ద్వారా 2029లో వాటికి సైతం లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన విధాన రూపకల్పనలో లా కమిషన్ ప్రస్తుతం తలమునకలైంది.
Comments
Please login to add a commentAdd a comment