జమిలి ఎన్నికలకు సై : వైఎస్సార్‌ సీపీ | YSRCP To Support One Nation One Election | Sakshi
Sakshi News home page

జమిలి ఎన్నికలకు సై : వైఎస్సార్‌ సీపీ

Published Tue, Jul 10 2018 3:46 PM | Last Updated on Thu, Aug 9 2018 2:44 PM

YSRCP To Support One Nation One Election - Sakshi

వైఎస్సార్‌ సీపీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

సాక్షి, న్యూఢిల్లీ : ఒకే దేశం-ఒకే ఎన్నికలను(జమిలి ఎన్నికలు) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్ధిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి దృష్ట్యానే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మంగళవారం లా కమిషన్‌తో పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. జమిలి ఎన్నికలను ఉద్దేశించి పార్టీ తరఫున తొమ్మిది పేజీల సూచనలను సమర్పించారు. సమావేశ అనంతరం విజయసాయి రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఉమ్మడి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తేమి కాదని అన్నారు. 2004 నుంచి 2014 వరకూ ఏపీలో ఎన్నికలు అలానే జరుగుతూ వస్తున్నాయని చెప్పారు. జమిలి ఎన్నికలను వైఎస్సార్‌ సీపీ సమర్ధిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు, అవినీతి బాగా తగ్గుతుందని, అప్పుడే ఓటుకు కోట్లు లాంటి కేసులు పునరావృతం కావని అభిప్రాయపడ్డారు.

ఫిరాయింపుల నిరోధక చట్టం..
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాలని లా కమిషన్‌కు సూచించినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఫిరాయింపుల చట్టాన్ని వినియోగించి స్పీకర్‌ తన విధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపుల విషయంలో అనర్హత వేసే అధికారం నుంచి స్పీకర్‌ను తప్పించి, ఆ స్థానంలో ఎన్నికల కమిషన్‌కు పవర్‌ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలని కోరినట్లు వివరించారు.
 
జమిలి ఎన్నికలతో జాతీయ పార్టీలకే అధిక లాభం చేకూరుతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీల మనుగడ దెబ్బతినకుండా వాటికి స్పష్టమైన భరోసా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ముందుగా లోక్‌సభ లేదా అసెంబ్లీ రద్దయితే ఏం చేస్తారని లా కమిషన్‌ను ప్రశ్నించగా.. రద్దు అయిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్‌ సభ్యులు చెప్పారని వివరించారు. జమిలి ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి ఏకాభిప్రాయ సాధన చేయాలని కోరినట్లు తెలిపారు.

బీజేపీకి మద్దతు ఇవ్వం..
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి మద్దుతు ఇచ్చే ప్రసక్తే లేదని విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ, దాని తరఫు మిత్ర పక్షాలకూ మద్దతు ఇవ్వబోమని వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ మోసం చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ప్రత్యేక హోదా ఇస్తారనే ఆశతోనే ఆనాడు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తరఫు అభ్యర్థికి మద్దుతు ఇచ్చామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ఏనాడు రాజీపడలేదని గుర్తు చేశారు. 2014 నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీనే అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement