మమతా బెనర్జీ
న్యూఢిల్లీ/కోల్‌కతా: జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై జరిగే 19వ తేదీన జరిగే సమావేశానికి పంపిన ఆహ్వానాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరస్కరించగా కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఏక కాలంలో ఎన్నికలతోపాటు కీలకమైన అంశాలపై చర్చించేందుకు జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక సభ్యుడున్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
మహాత్మాగాంధీ 150వ వర్థంతి, 2022లో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.హడావుడిగా ఇలా సమావేశం జరపడం కంటే ఏకకాలంలో ఎన్నికలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేసి, పార్టీలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం మమత లేఖ రాశారు. అలా చేసినప్పుడే చాలా కీలకమైన ఈ అంశంపై తాము నిర్దిష్టమైన సలహాలు ఇవ్వగలుగుతామన్నారు. సాధారణ ఎన్నికల అనంతరం అధికార టీఎంసీని వీడి బీజేపీలో చేరిన నేతలపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
పార్టీ మారిన వారంతా అత్యాశపరులు, అవినీతిపరులని, ఆ చెత్తను బీజేపీ ఏరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇంకా ఎవరైనా వెళ్లాలనే ఆలోచనలో ఉంటే అలాంటి వారు తొందరగా వెళ్లిపోవాలని కోరారు.. కాగా, ఈ సమావేశంలో పాల్గొనే అంశంపై చర్చించేందుకు బుధవారం ఉదయం సమావేశం కావాలని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రజాధనం ఆదా చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి జరపడం మేలంటూ గత ఆగస్టులో లా కమిషన్ సిఫారసు చేసింది. కాగా, ఎన్నికల్లో బీజేపీ 303 ఎంపీలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా వరుసగా కాంగ్రెస్ (52), డీఎంకే (23), వైఎస్‌ఆర్ కాంగ్రెస్(22), టీఎంసీ(22) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment