సాక్షి, లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘ఒక దేశం..ఒక ఎన్నిక’ నినాదాన్ని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమర్థించారు. 2019 లోక్‌సభ ఎన్నికలతోనే జమిలి ఎన్నికలకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల కోసం క్షేత్రస్ధాయిలో ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని అఖిలేష్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మరోవైపు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదనను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సైతం ఇటీవల సమర్ధించారు.
లోక్‌సభకు యూపీ నుంచే అత్యధిక సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో యోగి మద్దతు ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమేనంటూ యూపీ రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నివేదికను సైతం రూపొందించినట్టు సమాచారం. యోగి సర్కార్ మరో నాలుగేళ్లు అధికారంలో కొనసాగనున్న క్రమంలో 2019లో అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రం సంసిద్ధంగా ఉందని ఈ నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.
2019లోనే జమిలి ఎన్నికలకు శ్రీకారం చుట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందనే ఆందోళన విపక్షాల్లో వ్యక్తమవుతోంది. మోదీ సర్కార్‌పై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఎత్తుగడకు బీజేపీ పదును పెడుతున్నట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు, విపక్షాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నిమగ్నమైతే వాటి మధ్య ఐక్యతకు గండికొట్టవచ్చన్నది బీజేపీ వ్యూహంగా ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పట్ల వివిధ వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తితో బీజేపీ ఈ దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment