UP Assembly Election 2022: Who Will Win The Uttar Pradesh Assembly Elections - Sakshi
Sakshi News home page

పై చేయి ఎవరిది.. ప్రధాని మోదీ కోటలో అఖిలేష్‌ పాగా వేస్తారా..?

Published Sun, Mar 6 2022 8:04 AM | Last Updated on Sun, Mar 6 2022 3:26 PM

Who Will Win The Uttar Pradesh Assembly Elections.. - Sakshi

యూపీ పీఠమెవరిదో తేల్చనున్న ఆఖరిదశ (7వ దశ) పోలింగ్‌ సోమవారం జరగనుంది. పూర్వాంచల్‌లో తొమ్మిది జిల్లాలోని 54 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి కూడా పూర్వాంచల్‌లో భాగమే. దాంతో ఆయన మూడు రోజులు వారణాసిలోనే ఉండి శనివారం ప్రచారం ముగించారు. ప్రధాన పోటీదారులైన సమాజ్‌వాదీ, బీజేపీలు ఎవరికి వారే.. తామిప్పటికే యూపీ అసెంబ్లీ రేసులో గెలిచేశామని చెప్పుకుంటున్నారు. అయితే ప్రధాని మోదీ, అఖిలేశ్‌–మమతా బెనర్జీలు, రాహుల్‌– ప్రియాంక గాంధీల్లాంటి అగ్రనేతలు సీరియస్‌గా ప్రచారంలో మునిగిపోవడాన్ని బట్టి.. ఎవరికైనా విజయం అంత తేలిక కాదనే సంకేతాలను ఇస్తోంది. 

యాదవేతర బీసీల ఓట్లలో చీలిక! 
ప్రతీ ఓటూ ముఖ్యమేనని ముందే లెక్కలేసుకున్న ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కులా ఆధారిత చిన్నపార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. సుహల్‌దేవ్‌ రాజ్‌భర్‌కు చెందిన ఎస్‌బీఎస్‌బీ, మహాన్‌దళ్, జేపీ (ఎస్‌) లాంటి చిన్నాచితక పార్టీలతో మాల అల్లిన అఖిలేశ్‌.. బీజేపీకి అండగా నిలబడ్డ యాదవేతర కులాల ఐక్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదిపారు. అల్పసంఖ్యాల కులాల్లో 2017లో బీజేపీ 61 శాతం ఓట్లను సాధించింది.అయితే ఈ యాదవేతర ఓబీసీలు బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు కాదు. ఈ ఓబీసీల్లో 76 ఉపకులాలున్నాయి. ప్రతి కూలానికి వేర్వేరు అవసరాలు– ఆంకాక్షలు, డిమాండ్లు ఉన్నాయి.

అందువల్ల యాదవేతర బీసీలను ఏకం చేయడం కష్టం.అప్నాదళ్‌ (ఎస్‌) ఇంటిపోరు, స్వామి ప్రసాద్‌ మౌర్య నిష్క్రమణలు పూర్వాంచల్‌లో బీజేపీకి మరిన్ని తలనొప్పులు తెస్తున్నాయి. పైన చెప్పిన ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు బీజేపీ కొత్తగా నిషాద్‌ పార్టీతో జతకట్టింది. మల్లాల్లో ఈ పార్టీకి మంచి మద్దతుంది. ఏడోదశలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎస్‌సీలతో పాటు కుర్మీలు, పటేళ్లు, బనియాలు, రాజ్‌భర్‌లు, నిషాద్‌లు, మౌర్యాల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ జిల్లాల్లో మైనార్టీ జనాభా 12 శాతముండగా, ఎస్‌సీ జనాభా 24 శాతం, బ్రాహ్మణ మరియు ఠాకూర్ల జనాభా 20 శాతం మేర ఉంది. 
జాతీయవాదం + హిందుత్వ..
2017లో పూర్వాంచల్‌లో బీజేపీ ప్రదర్శన మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. ఈ ప్రాంతంలోని 50 సీట్లలో బీజేపీ 2017లో 33 సీట్లు మాత్రమే గెలుచుకుంది. తర్వాత స్థానాల్లో ఎస్‌పీ(11), బీఎస్‌పీ(6) నిలిచాయి. ఇతరప్రాంతాలతో పోలిస్తే బీఎస్‌పీ అత్యధిక ఓట్ల శాతం సాధించిన ప్రాంతం ఇదే కావడం గమనార్హం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈదఫా ఒక సమ్మిళిత సూత్రాన్ని అవలంబిస్తోంది. జాతీయవాదం (ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థుల తరలింపు), హిందుత్వ (కాశీ విశ్వనాధ కారిడార్‌ పనులు), మోడీ, యోగి కాంబినేషన్‌ విజయాలు.. అనే మూడు అంశాలను సమ్మిళితం చేసి చూపడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది.

ఓబీసీకి చెందిన మోదీని చూపి వెనుకబడ్డవర్గాలకు తాము ఎంతో ప్రాధాన్యమిస్తామని చెబుతోంది. మరోవైపు బీజేపీ ఓబీసీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ వారిని ఆకట్టుకోవాలని అఖిలేశ్‌ ప్రయత్నిస్తున్నారు. కులాలవారీ జనగణనను బీజేపీ పక్కనపెట్టిందని, తద్వారా రిజర్వేషన్లకు ముగింపు పలికే కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. బీఎస్‌పీ మాత్రం గతంలో మాదిరే తమకు ఈ ప్రాంతంలో మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తోంది. కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంపై ఎలాంటి ఆశలు కనిపించడంలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానికి కీలకంగా మారిన ఈ ప్రాంతంపై పట్టు తమకే దక్కుతుందని ఎస్‌పీ, బీజేపీ ఆశిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement