సేవలపై పన్నును సిఫార్సు చేసిన కమిటీ?
COMPETITIVE GUIDANCE - GS
General Studies
Group 1, Group 2, Group 4,
DSC+TET & Other Competitive Exams..
కేంద్ర - రాష్ట్రాల కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు
కేంద్ర-రాష్ర్ట సంబంధాల్లో ఆర్థిక సంబంధాలు అతి ముఖ్యమైనవి. రాజ్యాంగ పరిధికి లోబడి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమ విధులను నిర్వర్తించడానికి తగిన వనరులు అవసరం. దీనికి అనుగుణంగా ఇరు ప్రభుత్వాల మధ్య పన్ను, పన్నేతర రాబడి పంపిణీ, రుణాలను సమీకరించుకునే అధికారాలు, రాష్ర్ట ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లకు సంబంధించి భారత రాజ్యాంగం విస్తృతమైన ప్రొవిజన్సను అందించింది. పన్ను విధింపునకు అవసరమైన శాసనపర అధికారాలు, పన్ను రాబడి పంపిణీ అధికారాల మధ్య తేడాను రాజ్యాంగంలో పొందుపర్చారు.
వ్యవసాయ భూములకు సంబంధించి ఎస్టేట్ సుంకాన్ని విధించే అధికారం స్టేట్ లెజిస్లేటివ్కు ఉంది. వ్యవసాయేతర భూములకు సంబంధించి ఎస్టేట్ సుంకాన్ని విధించే అధికారాన్ని మాత్రం పార్లమెంట్‌కు అప్పగించారు. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే అధికారం రాష్ట్రానికి, వ్యవసాయేతర ఆదాయాలపై ఆదాయపు పన్ను విధించే అధికారం పార్లమెంట్‌కు ఉంది.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య పన్నుల రాబడి పంపిణీ
- కస్టమ్స్ డ్యూటీ, కార్పొరేషన్ పన్ను, కంపెనీలు, వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల మూలధన విలువపై పన్ను, ఆదాయపు పన్నుపై సర్‌ఛార్జీ మొదలైనవి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన పన్నులు.
- భూమిశిస్తు, కేంద్ర జాబితాలో చేర్చని మిగిలిన డాక్యుమెంట్లపై విధించే స్టాంప్ డ్యూటీ, సక్సెషన్ డ్యూటీ, ఎస్టేట్ డ్యూటీ; వ్యవసాయ ఆదాయం, భూములు, భవనాలు, వాహనాలు, ప్రకటనలు, ప్రచారాలపై పన్నులు; విద్యుచ్ఛక్తి వినియోగం, విలాసాలు, అమ్యూజ్మెంట్స్పై విధించే పన్నులు రాష్ర్ట ప్రభుత్వాలకు మాత్రమే సంబంధించినవి.
- బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్పై స్టాంప్ డ్యూటీ, ఆర్టికల్ 268 ప్రకారం ఆల్కహాల్ వినియోగంతో కూడిన మెడికల్, టాయ్‌లెట్ ప్రిపరేషన్సపై ఎక్సైజ్ డ్యూటీలను కేంద్రం విధించగా ఆయా రాష్ట్రాలు వసూలు చేసుకుంటాయి.
- వ్యవసాయేతర భూముల సంపదపై ఎస్టేట్ డ్యూటీ, వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయేతర భూముల సంపదపై డ్యూటీ, రైల్వే, నౌకలు, విమానాల్లో సరకు రవాణా, ప్ర యాణికులపై టెర్మినల్ ట్యాక్స్, రైల్వే చార్జీలు, సరకు రవాణాపై పన్నులను కేంద్రమే విధించి, వసూలు చేసి, రాబడిని రాష్ట్రాలకు ఇస్తుంది.
- ఆర్టికల్ 270 ప్రకారం వ్యవసాయేతర ఆ దాయంపై పన్ను, ఆర్టికల్ 272 ప్రకారం కేంద్ర జాబితాలో చేర్చిన ఎక్సైజ్ డ్యూటీలను కేంద్ర ప్ర భుత్వమే విధించి, వసూలు చేస్తుంది. ఈ రాబ డిని కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు.
కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదిలీ
అధిక పన్ను రాబడి కారణంగా కేంద్ర ప్రభుత్వానికి మిగులు ఏర్పడగా రాష్ర్ట ప్రభుత్వాలకు లోటు అధికమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. అవసరాల దృష్ట్యా రాష్ట్రాలకు కేంద్రం మంజూరు చేసే గ్రాంట్ - ఇన్-ఎయిడ్ గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 తెలియజేస్తోంది. ఆర్థిక సంఘం సలహా మేరకు గ్రాంట్-ఇన్-ఎయిడ్‌ను నిర్ణయించాలని ఆర్టికల్ 275, కేంద్ర ప్రభుత్వం తన విచక్షణాధికారంతో గ్రాంట్లను నిర్ణయించవచ్చని ఆర్టికల్ 282 వివరిస్తున్నాయి. అనేక అవసరాల నిమిత్తం రాష్ర్ట ప్రభుత్వాలు కేంద్రం నుంచి రుణాలను పొందుతాయి.
పన్నులు, డ్యూటీల్లో వాటా, గ్రాంట్లు, రుణాల రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదిలీ జరుగుతుంది. వీటితోపాటు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రణాళికా సంఘం నుంచి ప్రణాళికల అమల్లో భాగంగా ఆర్థిక సహాయం, కేంద్ర ప్రభుత్వ విచక్షణాధికారంతో కూడిన గ్రాంట్లు కేంద్రం నుంచి రాష్ర్ట ప్రభుత్వాలకు బదిలీ అవుతాయి.
గాడ్గిల్ ఫార్ములా: రాష్ట్రాలకు ప్రణాళికా సహాయానికి సంబంధించి నాలుగో ప్రణాళిక రూపకల్పన సమయంలో గాడ్గిల్ ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములా ప్రకారం....
- ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలైన అసోం, జమ్మూకాశ్మీర్, నాగాలాండ్‌కు ప్రణాళికా సహాయంలో ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం కేంద్ర ప్రణాళికా సహాయం మొదటగా ఆయా రాష్ట్రాల అవసరాలను తీర్చాలి.
- కేంద్ర సహాయంలో మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే విషయంలో కింద పేర్కొన్న ప్రాధాన్యాలను అనుసరిస్తారు.
- జనాభా ఆధారంగా 60%
- పన్నుల వసూలు ఆధారంగా 10%
- తలసరి ఆదాయం ఆధారంగా 10%
- నీటిపారుదల, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల ఆధారంగా 10%
- రాష్ట్రాల ప్రత్యేక సమస్యల ఆధారంగా 10%
సర్కారియా కమిషన్
సిక్కులకు ప్రత్యేక రాష్ర్టం ఖలిస్థాన్, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ కౌన్సిల్ ఏర్పాటు లాంటి డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర - రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సర్కారియా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర - రాష్ట్రాల సంబంధాల విషయంలో రాజ్యాంగపరమైన, శాసనపరమైన, విత్త, పరిపాలనా సంబంధిత అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిందిగా ఈ కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. జనవరి 1988న సర్కారియా కమిషన్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది.
దేశ సమైక్యత, సమగ్రతలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ విధులను తగ్గించడం లేదా సవరించడం అనే రాష్ట్రాల డిమాండ్‌ను కేంద్రం తిరస్కరించింది. ప్రివెంటివ్ డిటెన్షన్(పీడీ) చట్టం, విద్య, విద్యుత్ లాంటి అంశాలను రాష్ర్ట జాబితా, ఉమ్మడి జాబితాలకు బదిలీ చేయాలనే సూచనను కమిషన్ తిరస్కరించింది. అంతర్ రాష్ర్ట కౌన్సిల్ల ఏర్పాటుతోపాటు జాతీయ అభివృద్ధి కౌన్సిల్‌ను కొనసాగించడం ద్వారా జోనల్ కౌన్సిల్లు చురుకైన పాత్ర పోషించాల్సిన ఆవశ్యకతను కమిషన్ వెల్లడించింది.
రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా కార్పొరేషన్ పన్ను రాబడిని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య పంచాలనే సూచనను కమిషన్ అంగీకరించింది. కానీ, డివిజబుల్ పూల్‌ను పెంచడానికి సంబంధించిన అన్ని విధాలైన సూచనలను తిరస్కరించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీ ఆటోమేటిక్‌గా ఉండాలనే సూచనను కూడా తిరస్కరించింది. పన్నుల సంస్కరణలు, వనరుల సమీకరణను సమీక్షించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, వ్యవసాయ ఆదాయపు పన్నుకు సంబంధించి లోతైన అధ్యయనం జరగాలని, రుణ మంజూరు ప్రక్రియను సమీక్షించాలని స్పష్టం చేసింది.
ఆర్థిక సంఘం, ప్రణాళికా సంఘాల మధ్య విధుల పంపిణీ ఆమోదయోగ్యంగా ఉందని, ఇదే స్థితిని కొనసాగించాలని అభిప్రాయపడింది. రాష్ర్ట ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత మాత్రమే ఆర్థిక సంఘం పరిశీలించాల్సిన అంశాలను నిర్ణయించాలని, కన్సైన్ మెంట్ ట్యాక్స్ విధింపునకు శాసనాన్ని తీసుకురావడంతోపాటు బ్రాడ్ కాస్టింగ్‌లో ప్రచార ప్రకటనలపై పన్ను విధింపునకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని కోరింది.
సర్కారియా కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. కేంద్ర-రాష్ట్రాల ఆర్థిక సంబంధాలకు సంబంధించి కార్పొరేషన్ పన్నును డివిజబుల్ పూల్‌లో కలపాలనే కమి షన్ సిఫార్సును రాష్ట్రాలు స్వాగతించాయి. కేంద్రం కొంతకాలంగా అధిక రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సిఫార్సును ఆమోదించలేదు.
జాతీయ అభివృద్ధి మండలి 1990 అక్టోబరు 11న కొత్తగా సవరించిన ఫార్ములాను చర్చించి, ఆమోదించింది. కింది ప్రాధాన్యాల ఆధారంగా ప్రణాళికా సహాయంలో భాగంగా రాష్ట్రాల మధ్య వనరులను పంపిణీ చేస్తారు.
- జనాభాకు 55% వెయిటేజీ
- తలసరి ఆదాయానికి 25%
- ద్రవ్య యాజమాన్యానికి 5%
- ప్రత్యేక సమస్యలకు 15% వెయిటేజీ
సవరించిన ఫార్ములాలో జనాభాకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పాత గాడ్గిల్ ఫార్ములాతో పోల్చినప్పుడు జనాభాకు ఇచ్చిన వెయిటేజీ 5% తక్కువ. తలసరి ఆదాయం వాటా 20 నుంచి 25 శాతానికి పెరిగింది. పాత గాడ్గిల్ ఫార్ములాలో ఉన్న ట్యాక్స్ ఎఫర్‌ట స్థానంలో ద్రవ్య యాజమాన్యం అనే ప్రక్రియను కొత్తగా చేర్చారు. ప్రత్యేక సమస్యలకు సంబంధించిన వెయిటేజీని 10 నుంచి 15 శాతానికి పెంచారు. జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక సమస్యలను ఏడు అంశాలుగా పేర్కొంది. అవి...
- సముద్ర తీర ప్రాంతాలు
- వరద, కరవు ప్రాంతాలు
- ఎడారి ప్రాంత సమస్యలు
- ప్రత్యేక పర్యావరణ సంబంధిత అంశాలు
- జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలు
- పట్టణ ప్రాంతాల్లో మురికివాడల సమస్యలు
- ప్రత్యేక విత్త సంబంధిత సమస్యలు
గాడ్గిల్ ఫార్ములా 2000
గాడ్గిల్ - ముఖర్జీ ఫార్ములాను సమీక్షించి సంబంధిత రాష్ట్రాల ప్రగతిని ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ అంశానికి 7.5% వెయిటేజీ ఇచ్చారు. ఇందులో ట్యాక్స్ ఎఫర్‌ట(2.5%), రాష్ర్ట స్థాయిలో ద్రవ్య యాజమాన్యం(2%), జనాభా నియంత్రణ చర్యలు(1%), మహిళా అక్షరాస్యతలో ప్రగతి (1%) ఆధారంగా రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ జరుగుతుంది. మిగిలిన ఒక శాతాన్ని నిర్ణీత వ్యవధిలోగా విదేశీ సహాయంతో పూర్తి చేసిన ప్రాజెక్టులు, భూ సంస్కరణల అమలు ఆధారంగా పంపిణీ చేస్తారు.
ఆర్థిక సంఘం- రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య వనరుల పంపిణీకి సంబంధించి వివిధ ఆర్థిక సంఘాల సిఫార్సుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటి ఆర్థిక సంఘం నుంచి తొమ్మిదో ఆర్థిక సంఘం వరకు సిఫార్సులను పరిశీలించినప్పుడు ఆదాయపు పన్నులో రాష్ట్రాల వాటా 55 నుంచి 80 శాతానికి పెరిగింది. 10వ ఆర్థిక సంఘం ఈ మొత్తాన్ని 77.5 శాతానికి తగ్గించింది. ఏడో ఆర్థిక సంఘం 40 శాతాన్ని రాష్ట్రాల వాటాగా సిఫార్సు చేసింది.
పదో ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 2000 సంవత్సరంలో 80వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర అమ్మకం పన్ను, కన్సైన్మెంట్ ట్యాక్సెస్, కేంద్ర పన్నులపై సర్‌చార్జీలు, సెస్‌లను మినహాయించి మిగిలిన పన్నుల రాబడి మొత్తాన్ని రాష్ట్రాలతో పంచుకునేవిధంగా నిర్ణయించారు. 11వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటాను 29.5%గా, 12వ ఆర్థిక సంఘం 30.5%గా, 13వ ఆర్థిక సంఘం 32 శాతంగా సిఫార్సు చేశాయి. 13వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు మొత్తం బదిలీలు గరిష్టంగా 39.5% వరకు ఉంటాయి.
మాదిరి ప్రశ్నలు
1. అంతర్జాతీయ లావాదేవీలన్నింటిపైనా పన్ను విధిస్తే ఆ దేశానికి ఆదాయం పెరుగుతుందని భావించింది?
టోబిన్
2. సేవలపై పన్నును సిఫార్సు చేసిన కమిటీ?
రాజా చెల్లయ్య
3. ప్రభుత్వమిచ్చిన ప్రోత్సాహకాలు, మినహాయింపుల కారణంగా ఏ పన్ను పరిధిలోకి రాని సంస్థలు చెల్లించాల్సిన కనీస పన్ను?
కనీస ప్రత్యామ్నాయ పన్ను (కఅఖీ)
4. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులు, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ చేసే బాధ్యత ఎవరిది?
ఆర్థిక సంఘం
5. 13వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం కేంద్ర ప్రభుత్వ మొత్తం పన్నుల రాబడిలో రాష్ట్రాలకు బదిలీ చేసే మొత్తం గరిష్టంగా?
39.5%
6. 13వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీకి సంబంధించి జనాభా అంశానికి ఎంత వెయిటేజీ ఉంటుంది?
25%
7. విపత్తు సహాయ నిధిని సంబంధిత రాష్ట్రాల స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స ఫండ్‌తో కలపాలని సూచించింది?
13వ ఆర్థిక సంఘం
8. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నెలసరి ఆదాయ ఖాతా, పోస్టాఫీస్ సేవింగ్స అకౌంట్ లాంటి డిపాజిట్ స్కీమ్‌లపై పొదుపు పరిమితిని పెంచాలని సిఫార్సు చేసింది?
గుప్తా కమిటీ
9. జీరోబేస్ బడ్జెటింగ్‌ను 1999 మార్చి 1న దేనిలో ప్రవేశపెట్టారు?
చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల డిపార్టమెంట్లో
10. సవరించిన గాడ్గిల్ - ముఖర్జీ ఫార్ములాను జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఆమోదించింది?
అక్టోబరు 11, 1990
11. గాడ్గిల్- ముఖర్జీ ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు ప్రణాళికా సహాయానికిగాను ప్రత్యేక సమస్యలకు సంబంధించి ఎంత వెయిటేజీ ఇచ్చారు?
15%
12. పదమూడో ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటా?
32%