జమిలిపై భిన్నాభిప్రాయాలు
జమిలి. ప్రస్తుతం దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న పదం. అయితే లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఏ మేరకు ఆచరణ సాధ్యమన్న దానిపై భిన్నాప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వంటి నాలుగైదు అసెంబ్లీలకు మాత్రమే లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా అసెంబ్లీలకు విడిగా, వేర్వేరుగానే ఎన్నికలొస్తున్నాయి. వీటన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
అందుకు పలు అసెంబ్లీలను గడువుకు ముందే రద్దు చేయడం, కొన్నింటిని పొడిగించడమో, లేదంటే గడువు తీరాక సుప్త చేతనావస్థలో ఉంచడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనన్న అభిప్రాయముంది. లేదంటే లోక్‌సభ కొత్తగా తొలిసారి కొలువుదీరిన తేదీని ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించి, ఆ తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీల అన్నింటి గడువూ.. వాటి ఐదేళ్ల కాలపరిమితితో సంబంధం లేకుండా.. లోక్‌సభతో పాటే ముగిసే ప్రతిపాదనను అమలు చేయాలి.
ఇలా ఒకసారి చేస్తే సరిపోతుందని, ఇక అప్పటి నుంచి జమిలి ఎన్నికలే ఉంటాయని కోవింద్ కమిటీ పేర్కొంది. ఇందులో ఆచరణపరంగా ఎన్నో ఇబ్బందులున్నాయన్నది నిపుణుల మాట. అంతేగాక అసలు ఈ ప్రతిపాదన రాష్ట్రాల అధికారాల్లో అవాంఛిత జోక్యమే తప్ప మరోటి కాదని పలు పార్టీలు వాదిస్తున్నాయి. పైగా లోక్‌సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే జాతీయాంశాలే తెరపైకి వస్తాయని, రాష్ట్రాల్లోని స్థానికాంశాలు పక్కకు పోతాయని ప్రాంతీయ పారీ్టలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా డీఎంకే వంటి పలు పారీ్టలు జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం కూడా చేశాయి. పైగా హంగ్, అవిశ్వాస తీర్మానం నెగ్గడం వంటి ఏ కారణంతో అయినా గడువుకు ముందే చట్టసభ రద్దయితే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త సభ ఐదేళ్లు కాకుండా రద్దయిన సభలో మిగిలిన కాలావధి పాటు మాత్రమే కొనసాగాలని కోవింద్ కమిటీ సూచించింది. అలాగైతే జమిలి ప్రక్రియకు భంగం కలగకుండా ఉంటుందని పేర్కొంది. కానీ దీనిపైనా పలు పారీ్టలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రజాతీర్పు కోరి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు కొనసాగరాదనడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని వాదిస్తున్నాయి.
రాజ్యాంగ వ్యతిరేకం: ఖర్గే
‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక మన దేశంలో ఆచరణ సాధ్యం కాదు. ఇలాంటి ఎన్నికలు రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్తకొత్త ఎత్తుగడలు వేయడం బీజేపీకి అలవాటే. ప్రజాస్వామ్య విరుద్ధమైన జమిలి ఎన్నికలను దేశ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరు’’
అది సంఘ్ పరివార్ రహస్య అజెండా
‘‘ఒకే దేశం–ఒకే ఎన్నిక అనేది దేశ సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఇది సంఘ్ పరివార్ రహస్య అజెండాలో ఒక భాగమే. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల వ్యవస్థను మార్చేసి అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని తీసుకురావాలన్నదే సంఘ్ పరివార్ అసలు కుట్ర. భారత పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీయాలన్న ఆలోచనను మానుకోవాలి’’.
– పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి
ప్రజలంతా వ్యతిరేకించాలి
సమాఖ్య వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నిర్మాణాన్ని దెబ్బతీసే జమిలి ఎన్నికలను ప్రజలంతా వ్యతిరేకించాలి. ఒకే దేశం–ఒకే ఎన్నిక ద్వారా ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ కుతంత్రాలు సాగిస్తోంది. ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతే ఏం చేస్తారు?
– అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment