ఈశాన్యం ఎవరి వశం! | BJP is expanding in North Eastern states | Sakshi
Sakshi News home page

ఈశాన్యం ఎవరి వశం!

Published Tue, Apr 2 2024 1:22 AM | Last Updated on Tue, Apr 2 2024 1:22 AM

BJP is expanding in North Eastern states - Sakshi

క్రమంగా విస్తరిస్తున్న బీజేపీ 

11 సీట్లలో 2019లో 5 కైవసం 

ఈసారీ వాటిని నిలుపుకునే చాన్స్‌ 

తగ్గుతూ వస్తున్న కాంగ్రెస్‌ ప్రభ 

ఒక్క సీటే రావచ్చంటున్న సర్వేలు 

పలు రాష్ట్రాల్లో స్థానిక పార్టీల హవా 

సెవెన్‌ సిస్టర్స్‌గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు తక్కువగానే ఉన్నప్పటికీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఏడు రాష్ట్రాలతో పాటు సిక్కింను సోదర రాష్ట్రంగా వ్యవహరింటారు. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాలతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కొన్నేళ్లుగా జాతీయ పార్టీలు వాటికి తీవ్రంగా పోటీ ఇస్తున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలతో ఈశాన్యంలో పాగా వేసింది. అయితే ఇటీవలి మణిపూర్‌ మారణకాండ నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయి... 


నోట్‌: ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్‌సభ సీట్లున్న అసోంపై విడిగా కథనం అందిస్తాం

మణిపూర్‌.. కాంగ్రెస్‌కు షాక్‌ 
మణిపూర్లో అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ పట్టు నిలుపుకుంటూ వస్తున్న కాంగ్రెస్‌కు 2019లో తొలిసారి షాక్‌ తగిలింది. ఇక్కడి రెండు సీట్లలో ఓటమి పాలైంది. ఒకటి బీజేపీ, మరోటి ప్రాంతీయ పార్టీ నేషనల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌)కు గెలుచుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. 60 సీట్లకు గాను బీజేపీ 32 స్థానాలు కైవసం చేసుకుని సొంతంగా మెజారిటీ దక్కించుకుంది. ప్రాంతీయ పార్టీలైన ఎన్‌పీఎఫ్, ఎన్‌పీపీ, లోక్‌ జనశక్తి పార్టీలతో కలిసి బీరేన్‌ సింగ్‌ సీఎంగా ఎన్‌డీఏ సర్కారు కొలువుదీరింది. గతేడాది కుకీ, మెయితీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు దేశమంతటా ప్రకంపనలు సృష్టించాయి. అత్యాచారాలు, సజీవ దహనాలతో మణిపూర్‌ అట్టుడికింది. ఇప్పటికీ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రభుత్వం అల్లర్ల బీజీపీ నివారణలో విఫలమైందని, మోదీ కనీసం ఒక్కసారైనా పర్యటించలేదంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.


మేఘాలయ... బీజేపీకి అందని ద్రాక్ష 
ఇక్కడా ప్రాంతీయ పార్టీల హవాయే సాగుతోంది. కాంగ్రెస్‌ పోటీ ఇస్తున్నా బీజేపీ పెద్దగా సోదిలో లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌పీపీ చెరో సీటు గెలవగా బీజేపీ ఖాతా తెరవలేదు. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగేలా కన్పిస్తోంది. ఇక మిజోరంలో ఏకైక లోక్‌సభ స్థానం ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్‌ మధ్య చేతులు మారుతోంది. 2019లో ఎంఎన్‌ఎఫ్‌ గెలిచింది. నాగాలాండ్‌లో ఏకైక లోక్‌సభ సీటును 2004, 2014ల్లో నాగాలాండ్‌ పీపుల్స్‌ పార్టీ గెలుచుకుంది. 2019లో నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ గెలిచింది. ఈసారి ఎన్సీపీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. 

సర్వేలు ఏమంటున్నాయి... 
అరుణాచల్, త్రిపురల్లోని 4 సీట్లూ బీజేపీవేనని, మణిపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ చెరోటి, మిజోరంలో జెడ్‌పీఎం, నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ, సిక్కింలో ఎస్‌కేఎం, మేఘాలయలో ఎన్‌పీపీకి 2 సీట్లు దక్కుతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ ఈశాన్యంలో తన 5 సీట్లను నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని చేజార్చుకోనుంది. 
రెండు విడతల్లో పోలింగ్‌ అసోం మినహా ఈశాన్య రాష్ట్రాల్లో 11 లోక్‌సభ స్థానాలున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపురలో రెండేసి, మిజోరం, నాగాలాండ్, సిక్కింలో ఒక్కో సీటు ఉన్నాయి. అరుణాచల్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర వెస్ట్, ఇన్నర్‌ మణిపూర్‌ నియోజకవర్గాల్లో తొలి విడత (ఏప్రిల్‌ 19) ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర ఈస్ట్, ఔటర్‌ మణిపూర్‌లో రెండో దశలో (ఏప్రిల్‌ 26) పోలింగ్‌ నిర్వహించనున్నారు.  

త్రిపుర.. కమ్యూనిస్టుల కోట బద్దలు 
ఈ కమ్యూనిస్టుల కంచుకోటలో ఎట్టకేలకు కాషాయ జెండా ఎగరింది. 1998 నుంచి 2018 దాకా రాష్ట్రాన్ని సీపీఎం నేత మాణిక్‌ సర్కార్‌ ఏలారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లలో 36 స్థానాలు దక్కించుకుని బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు సీట్లలోనూ బీజేపీ చేతిలో సీపీఎం ఓటమి చవిచూసింది. కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపుతున్నా లోక్‌సభ పోరులో మాత్రం పూర్తిగా వెనకబడింది. 

అరుణాచల్‌లో బీజేపీ పాగా 
కాంగ్రెస్‌ కంచుకోట అయిన ఈ రాష్ట్రంలో ఎట్టకేలకు కమలనాథులు పాగా వేశారు. ఇక్కడ లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 2004 నుంచి 2014 దాకా రాష్ట్రంలో కాంగ్రెసే అధికారాన్ని చేజక్కించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లనూ 2004లో బీజేపీ, 2009లో కాంగ్రెస్‌ నెగ్గాయి. 2014లో చెరో సీటు దక్కించుకున్నాయి. 2019 మాత్రం మోదీ సునామీ ఈశాన్యాన్ని కూడా ముంచెత్తింది. దాంతో అరుణాచల్‌ పూర్తిగా బీజేపీ ఖాతాలో చేరింది.

రెండు లోక్‌సభ సీట్లతో పాటు అసెంబ్లీలోనూ ఎన్‌డీఏ పాగా వేసి కాంగ్రెస్‌ (యూపీఏ) సుదీర్ఘ పాలనకు తెరదించింది. 60 సీట్ల అరుణాచల్‌ అసెంబ్లీలో ఎన్‌డీఏ భాగస్వాములు బీజేపీ 41 సీట్లు, జేడీయూ 7, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ 5 గెలుచుకున్నాయి. పెమా ఖండూ సీఎంగా తొలిసారి పూర్తి మెజారిటీతో బీజేపీ సర్కారు కొలువుదీరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోలింగ్‌కు ముందే ఖాతా తెరిచింది. సీఎం పెమా ఖండూతో సహా 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో కూడా ఖండూతో పాటు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. ఈసారి మొత్తం 60 సీట్లలోనూ బీజేపీ బరిలో ఉంది.

 సిక్కింలో లోకల్‌ హవా 
ఈ బుల్లి రాష్ట్రంలో కూడా లోక్‌సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరుతున్నాయి. ఇక్కడ లోకల్‌ పార్టీలదే పూర్తి హవా. దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సీఎం పదవిలో కొనసాగిన రికార్డు దక్కించుకున్న (1994 నుంచి 2019 వరకు, 5 సార్లు) పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌కు గత ఎన్నికల్లో షాక్‌ తగిలింది. ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) చేతిలో చామ్లింగ్‌ పార్టీ సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) ఓటమి చవిచూసింది. లోక్‌సభ సీటు కూడా ఎస్‌కేఎం వశమైంది. దాంతో ఈసారి పోరు ఆసక్తికరంగా  మారింది.  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement