సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్ రాష్ట్రంలో 157 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న మొత్తం 108 ఎమ్మెల్యేల్లో 88 మంది, ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ఉన్న 69 మంది ఎమ్మెల్యేల్లో 54 మంది, 14 మంది ఇండిపెండెంట్లలో 12 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) వెల్లడించింది. ధోడ్ (ఎస్సీ) నియోజకవర్గ సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పరశురామ్ మోర్దియా రూ.172 కోట్లతో అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచారు.
కాగా, చోరాసి(ఎస్టీ) నియోజకవర్గ భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ రూ.1.22 లక్షలతో రాష్ట్రంలో అతి తక్కువ ఆస్తిపరుడైన ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఉదయ్‌పూర్ అసెంబ్లీ నియోజకర్గం ఖాళీగా ఉన్న నేపథ్యంలో 199 నియోజకవర్గాల ప్రస్తుత ఎమ్మెల్యేల ఆస్తులు, నేరచరిత్ర తదితర అంశాలపై సమీక్ష చేపట్టి శుక్రవారం నివేదిక విడుదల చేసింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీలు మారారు.
అందులో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, ధోలాపూర్ ఎమ్మెల్యే శోభారాణి కుషా్వహాను బీజేపీ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, మొత్తం 199 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 46 (23%) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు 28 (14%) సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్న 108 మంది ఎమ్మెల్యేలలో 27 (25%) మంది, బీజేపీకి చెందిన 69 మంది ఎమ్మెల్యేల్లో 11 (16%) మంది, సీపీఎంలోని ఇద్దరు ఎమ్మెల్యేల్లో 2 (100%), 14 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఆరుగురు (43%) ఎమ్మెల్యేలు అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారు.
మొత్తం 199 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 157 మంది (79%) కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 88 (81%) మంది, బీజేపీ నుంచి 54 (78%) మంది, స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 12 (86%) మంది కోటీశ్వరులుగా తమ ఆస్తులను ప్రకటించారు. ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆస్తుల సగటు రూ.7.49 కోట్లుగా ఉంది. కాగా, కాంగ్రెస్‌లో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.9.28 కోట్లు, బీజేపీలో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ.5.45 కోట్లుగా ఉంది. అయితే మొత్తం ఎమ్మెల్యేల్లో 59 (30%) ఎమ్మెల్యేలు తమ విద్యార్హత 5 తరగతి నుంచి 12 తరగతి మధ్య ఉన్నట్లు ప్రకటించారు.
128 మంది (64%) ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లు ప్రకటించారు. వయస్సు పరంగా చూస్తే 80 (40%) మంది ఎమ్మెల్యేలు తమ వయస్సు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నట్లు, 119 (60%) మంది ఎమ్మెల్యేలు తమ వయస్సు 51 నుంచి 85 సంవత్సరాల మధ్య ఉన్నట్లు ప్రకటించారు. కాగా ఏడీఆర్ విశ్లేషించిన మొత్తం 199 ఎమ్మెల్యేల్లో 27 (14%) మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment