Northeast States
-
ఈశాన్యం ఎవరి వశం!
సెవెన్ సిస్టర్స్‌గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు తక్కువగానే ఉన్నప్పటికీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఏడు రాష్ట్రాలతో పాటు సిక్కింను సోదర రాష్ట్రంగా వ్యవహరింటారు. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాలతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కొన్నేళ్లుగా జాతీయ పార్టీలు వాటికి తీవ్రంగా పోటీ ఇస్తున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలతో ఈశాన్యంలో పాగా వేసింది. అయితే ఇటీవలి మణిపూర్ మారణకాండ నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయి... నోట్: ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్‌సభ సీట్లున్న అసోంపై విడిగా కథనం అందిస్తాం మణిపూర్.. కాంగ్రెస్‌కు షాక్ మణిపూర్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ పట్టు నిలుపుకుంటూ వస్తున్న కాంగ్రెస్‌కు 2019లో తొలిసారి షాక్ తగిలింది. ఇక్కడి రెండు సీట్లలో ఓటమి పాలైంది. ఒకటి బీజేపీ, మరోటి ప్రాంతీయ పార్టీ నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు గెలుచుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. 60 సీట్లకు గాను బీజేపీ 32 స్థానాలు కైవసం చేసుకుని సొంతంగా మెజారిటీ దక్కించుకుంది. ప్రాంతీయ పార్టీలైన ఎన్పీఎఫ్, ఎన్పీపీ, లోక్ జనశక్తి పార్టీలతో కలిసి బీరేన్ సింగ్ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. గతేడాది కుకీ, మెయితీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు దేశమంతటా ప్రకంపనలు సృష్టించాయి. అత్యాచారాలు, సజీవ దహనాలతో మణిపూర్ అట్టుడికింది. ఇప్పటికీ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రభుత్వం అల్లర్ల బీజీపీ నివారణలో విఫలమైందని, మోదీ కనీసం ఒక్కసారైనా పర్యటించలేదంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మేఘాలయ... బీజేపీకి అందని ద్రాక్ష ఇక్కడా ప్రాంతీయ పార్టీల హవాయే సాగుతోంది. కాంగ్రెస్ పోటీ ఇస్తున్నా బీజేపీ పెద్దగా సోదిలో లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్పీపీ చెరో సీటు గెలవగా బీజేపీ ఖాతా తెరవలేదు. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగేలా కన్పిస్తోంది. ఇక మిజోరంలో ఏకైక లోక్‌సభ స్థానం ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతోంది. 2019లో ఎంఎన్ఎఫ్ గెలిచింది. నాగాలాండ్‌లో ఏకైక లోక్‌సభ సీటును 2004, 2014ల్లో నాగాలాండ్ పీపుల్స్ పార్టీ గెలుచుకుంది. 2019లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలిచింది. ఈసారి ఎన్సీపీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. సర్వేలు ఏమంటున్నాయి... అరుణాచల్, త్రిపురల్లోని 4 సీట్లూ బీజేపీవేనని, మణిపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్ చెరోటి, మిజోరంలో జెడ్పీఎం, నాగాలాండ్‌లో ఎన్డీపీపీ, సిక్కింలో ఎస్కేఎం, మేఘాలయలో ఎన్పీపీకి 2 సీట్లు దక్కుతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ ఈశాన్యంలో తన 5 సీట్లను నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్ ఒక స్థానాన్ని చేజార్చుకోనుంది. రెండు విడతల్లో పోలింగ్ అసోం మినహా ఈశాన్య రాష్ట్రాల్లో 11 లోక్‌సభ స్థానాలున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపురలో రెండేసి, మిజోరం, నాగాలాండ్, సిక్కింలో ఒక్కో సీటు ఉన్నాయి. అరుణాచల్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర వెస్ట్, ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గాల్లో తొలి విడత (ఏప్రిల్ 19) ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర ఈస్ట్, ఔటర్ మణిపూర్‌లో రెండో దశలో (ఏప్రిల్ 26) పోలింగ్ నిర్వహించనున్నారు. త్రిపుర.. కమ్యూనిస్టుల కోట బద్దలు ఈ కమ్యూనిస్టుల కంచుకోటలో ఎట్టకేలకు కాషాయ జెండా ఎగరింది. 1998 నుంచి 2018 దాకా రాష్ట్రాన్ని సీపీఎం నేత మాణిక్ సర్కార్ ఏలారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లలో 36 స్థానాలు దక్కించుకుని బిప్లవ్ కుమార్ దేవ్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు సీట్లలోనూ బీజేపీ చేతిలో సీపీఎం ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపుతున్నా లోక్‌సభ పోరులో మాత్రం పూర్తిగా వెనకబడింది. అరుణాచల్‌లో బీజేపీ పాగా కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ రాష్ట్రంలో ఎట్టకేలకు కమలనాథులు పాగా వేశారు. ఇక్కడ లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 2004 నుంచి 2014 దాకా రాష్ట్రంలో కాంగ్రెసే అధికారాన్ని చేజక్కించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లనూ 2004లో బీజేపీ, 2009లో కాంగ్రెస్ నెగ్గాయి. 2014లో చెరో సీటు దక్కించుకున్నాయి. 2019 మాత్రం మోదీ సునామీ ఈశాన్యాన్ని కూడా ముంచెత్తింది. దాంతో అరుణాచల్ పూర్తిగా బీజేపీ ఖాతాలో చేరింది. రెండు లోక్‌సభ సీట్లతో పాటు అసెంబ్లీలోనూ ఎన్డీఏ పాగా వేసి కాంగ్రెస్ (యూపీఏ) సుదీర్ఘ పాలనకు తెరదించింది. 60 సీట్ల అరుణాచల్ అసెంబ్లీలో ఎన్డీఏ భాగస్వాములు బీజేపీ 41 సీట్లు, జేడీయూ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ 5 గెలుచుకున్నాయి. పెమా ఖండూ సీఎంగా తొలిసారి పూర్తి మెజారిటీతో బీజేపీ సర్కారు కొలువుదీరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోలింగ్‌కు ముందే ఖాతా తెరిచింది. సీఎం పెమా ఖండూతో సహా 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో కూడా ఖండూతో పాటు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. ఈసారి మొత్తం 60 సీట్లలోనూ బీజేపీ బరిలో ఉంది. సిక్కింలో లోకల్ హవా ఈ బుల్లి రాష్ట్రంలో కూడా లోక్‌సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరుతున్నాయి. ఇక్కడ లోకల్ పార్టీలదే పూర్తి హవా. దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సీఎం పదవిలో కొనసాగిన రికార్డు దక్కించుకున్న (1994 నుంచి 2019 వరకు, 5 సార్లు) పవన్ కుమార్ చామ్లింగ్‌కు గత ఎన్నికల్లో షాక్ తగిలింది. ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) చేతిలో చామ్లింగ్ పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఓటమి చవిచూసింది. లోక్‌సభ సీటు కూడా ఎస్కేఎం వశమైంది. దాంతో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ రాష్ట్రాలకు పౌరసత్వ సవరణ చట్టం నుంచి మినహాయింపు?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులతో సహా ముస్లిమేతర వలసదారులకు ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని ఇవ్వనుంది. అయితే కొన్ని రాష్ట్రాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించారు. ఆ రాష్ట్రాలు ఏవి? ఎందుకు మినహాయింపునిచ్చారు? మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లోని పలు గిరిజన ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయరు. వీటిలో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక హోదా మంజూరైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయాణానికి ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ (ఐఎల్పీ) అవసరమయ్యే అన్ని ఈశాన్య రాష్ట్రాలలో సీఏఏ చట్టం అమలు చేయరు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్లకు ఐఎల్పీ వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో స్వయంప్రతిపత్తి గల కౌన్సిళ్లుగా ఏర్పడిన గిరిజన ప్రాంతాలను కూడా సీఏఏ పరిధి నుంచి తప్పించారు. అసోం, మేఘాలయ, త్రిపురలలో ఇటువంటి స్వయం ప్రతిపత్తి కౌన్సిళ్లు ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందూయేతరులు తొలుత తాము ఈ మూడు దేశాలలో ఎక్కడైనా నివాసితులుగా నిరూపించుకోవాలి. అప్పుడే వారికి భారత పౌరసత్వం వర్తిస్తుంది. ఇందుకోసం వారు వారి పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, అక్కడ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా సర్టిఫికేట్ లేదా లైసెన్స్, భూమి పత్రాలను సంబంధిత అధికారులకు చూపించవలసి ఉంటుంది. -
North East Sammelan: గ్రోత్ ఇంజిన్ ఈశాన్య రాష్ట్రాలే: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ది చెందకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశానికి ఈశాన్య రాష్ట్రాలే గ్రోత్ ఇంజిన్ అని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషల్ సెంటర్లో నిర్వహించిన ‘నార్త్ ఈస్ట్ సమ్మేళన్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యే దృష్టి సారించారని చెప్పారు. పదేళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. స్థిరమైన ప్రభుత్వం, నాయకుడి వల్లే నార్త్ ఈస్ట్‌లో శాంతి నెలకొందని, అభివృద్ధి సాధ్యం అవుతోందన్నారు. -
ఈశాన్యంలో వైద్య సదుపాయాలు బలోపేతం
గువాహటి: ఈశాన్య రాష్ట్రాల్లో నూతన ఆసుపత్రులు, వైద్య కళాశాలల రాకతో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కాబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈశాన్య భారతంలో సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం తొమ్మిదేళ్లుగా శ్రమిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ఈశాన్య ప్రాంతాన్ని ఆమడ దూరంలో ఉంచాయని, తమ ప్రభుత్వం దగ్గరికి చేర్చుకుంటోందని వివరించారు. ఈశాన్య భారతదేశంలో నిర్మించిన తొలి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. అస్సాం రాజధాని గువాహటిలో రూ.1,123 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. అలాగే నల్బారీ, నాంగావ్, కోక్రాజార్లో మెడికల్ కాలేజీలను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.546 కోట్లతో నిర్మించే అస్సాం అడ్వాన్స్డ్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ ఇనిస్టిట్యూట్ (ఏఏహెచ్‌ఐఐ)కు పునాదిరాయి వేశారు. దీన్ని అస్సాం ప్రభుత్వం, ఐఐటీ–గువాహటి సంయుక్తంగా నిర్మించనున్నాయి. 1.1 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. విపక్షాలు దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రూ.7,300 కోట్లతో కూడిన ఐదు రైల్వే ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. బ్రహ్మపుత్ర నదిపై రూ.3,200 కోట్లతో పలాస్‌బారీ–సువాల్కుచీ బ్రిడ్జి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. దిబ్రూగఢ్‌లో రూ.1,709 కోట్లతో నిర్మించిన మిథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అస్సాంలో సంప్రదాయ బిహూ నృత్యోత్సవంలో మోదీ పాల్గొన్నారు. 11,000 మందికిపైగా నృత్యకారులు, కళాకారులు అలరించారు. ఇక్కడ గురువారం నిర్వహించిన బిహూ నృత్యం రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సృష్టించడం తెలిసిందే. సాంకేతికతతో సత్వర న్యాయం గౌహతి హైకోర్టు వార్షికోత్సవంలో మోదీ న్యాయసేవలు అందించే వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. టెక్నాలజీతో సత్వర న్యాయం అందించవచ్చని, దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల వంటి మూరుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతోమేలు జరుగుతుందన్నారు. శుక్రవారం అస్సాంలో గౌహతి హైకోర్టు 70వ వార్షికోత్సవ ముగింపు సభలో మోదీ ప్రసంగించారు. నూతన టెక్నాలజీతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. లక్షలాది మంది పౌరులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేశామని ప్రధాని మోదీ వివరించారు. దానివల్ల ఆస్తుల సంబంధిత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. -
ఈశాన్యం అభివృద్ధికి ఆకాశమే హద్దు
షిల్లాంగ్/అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ ఎనిమిదేళ్లలో తొలగించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్ఈస్ట్ కౌన్సిల్ (ఎన్ఈసీ) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ‘‘ఎనిమిదేళ్లలో ఈశాన్యం నుంచి విమాన సేవలు మెరుగవడంతో ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరిగింది. విమానాశ్రయాలు 9 నుంచి 16కు, విమానాల సంఖ్య 900 నుంచి 1,900కు పెరిగాయి. రైల్వేమ్యాప్లో ఈశాన్య రాష్ట్రాలు కూడా చేరాయన్నారు. జాతీయ రహదారులు 50 శాతం పెరిగిందన్నారు. జలమార్గాలను విస్తరించే పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈశాన్యమే కేంద్రస్థానం ఆగ్నేయాసియాకు ఈశాన్య రాష్ట్రాలే మన ముఖద్వారమని మోదీ పేర్కొన్నారు. మొత్తం ఆగ్నేయాసియా అభివృద్ధికి ఈశాన్యం కేంద్రస్థానంగా మారగలదని చెప్పారు. ఆ దిశగా ఇండియన్–మయన్మార్, థాయ్‌లాండ్ ప్రధాన రహదారి, అగర్తలా–అఖురా రైల్వే ప్రాజెక్టు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈశాన్యంలో ఎన్నో శాంతి ఒప్పందాలు, అంతర్రాష్ట్ర సరిహద్దు ఒప్పందాలు కుదిరాయని గుర్తుచేశారు. ఫలితంగా తీవ్రవాద సంఘటనలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం 1971లో పార్లమెంట్ చట్టం ద్వారా నార్త్ఈస్ట్ కౌన్సిల్ ఏర్పాటయ్యింది. 1972 నవంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చింది. త్రిపుర బహుముఖ అభివృద్ధే లక్ష్యం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవిశ్రాంతంగా కష్టపడి పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన ఆదివారం త్రిపుర రాజధాని అగర్తలాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 2 లక్షకుపైగా నూతన గృహాలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారు. త్రిపుర బహుముఖ అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ రోజు 2 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు ఇచ్చామని, మెజారిటీ లబ్ధిదారులు మహిళలేనని చెప్పారు. గత ఐదేళ్లుగా పరిశుభ్రత అనేది ఒక ప్రజాఉద్యమంగా మారిందని, త్రిపుర అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా అవతరించిందని ప్రశంసించారు. త్రిపురలో అనుసంధానం, మౌలిక ప్రాజెక్టుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘త్రిపుర గతంలో ఘర్షణలకు మారుపేరుగా ఉండేది. 2018లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి, అనుసంధానానికి, శుభ్రతకు పర్యాయపదంగా మారింది’’ అన్నారు. ఈశాన్య భారత్‌ను, బంగ్లాదేశ్‌ను అనుసంధానించే 15 కిలోమీటర్ల అగర్తలా–అఖౌరా రైల్వేప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తవుతుందన్నారు. ఆ రాష్ట్రాలు.. అష్టలక్ష్ములు ఈశాన్య ప్రాంతాల ప్రగతికి ప్రతిబంధకంగా మారిన అవినీతి, వివక్ష, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలకు రెడ్‌కార్డ్ చూపించామని మోదీ అన్నారు. ‘‘నార్త్ఈస్ట్ను విభజించేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మేమొచ్చాక అలాంటి ఆటలు సాగనివ్వడం లేదు’’ అన్నారు. ఆదివారం ఉదయం షిల్లాంగ్‌లో ఆయన కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. గత 50 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎన్ఈసీ పోషించిన పాత్రను వివరిస్తూ రచించిన ‘గోల్డెన్ ఫూట్ప్రింట్స్’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈశాన్యం అభివృద్ధి విషయంలో ఎన్ఈసీ అందించిన సేవలను మరువలేమని ప్రధాని మోదీ ప్రశంసించారు. నార్త్ఈస్ట్లోని ఎనిమిది రాష్ట్రాలను అష్టలక్ష్మిలుగా అభివర్ణించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనిమిది పునాది స్తంభాలపై ప్రభుత్వం పనిచేయాలని ఉద్బోధించారు. అవి.. శాంతి, అధికారం, పర్యాటకం, 5జీ అనుసంధానం, సంస్కృతి, ప్రకృతి వ్యవసాయం, క్రీడలు పనిచేయగల శక్తి అని వివరించారు. -
ఈశాన్యంలో ఆశాదీపం కాన్రాడ్ కె సంగ్మా
షిల్లాంగ్: తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం, అంతర్జాతీయ యూనివర్సిటీల్లో నేర్చుకున్న బిజినెస్ పాఠాలు, గిరిజనులకు సేవ చేయాలన్న సంకల్పంతో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా ఈశాన్య ప్రాంతంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రి, లోక్‌సభ దివంగత స్పీకర్ పీఏ సంగ్మా వేసిన బాటలో నడుస్తూ ఎన్పీపీని ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ పార్టీ స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నారు. మణిపూర్ గిరిజనుల హక్కులను కాపాడడం కోసం అవతరించిన పార్టీ, ఇప్పుడు ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయి అధికారాన్ని దక్కించుకోవాలన్నది సంగ్మా ఆశ. సంగీతం అంటే చెవి కోసుకుంటారు. గిటార్, పియానో వాయిస్తారు. ప్రయాణాలు చేయడమంటే ఆయనకు అమితమైన ఆసక్తి. గిరిజనులకు ఆశాదీపంలా మారిన తమ పార్టీని వాళ్లే ఆదుకుంటారన్న వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారు. బీజేపీ సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి సొంతంగా పోటీకి దిగి మణిపూర్‌లోనూ అధికారం దక్కించుకోవడానికి తహతహలాడుతున్నారు. మేఘాలయా సీఎంగా ఉంటూనే మణిపూర్‌లో కూడా పార్టీని కింగ్‌మేకర్‌గా నిలపాలని ఆరాటపడుతున్నారు. ► పీఏసంగ్మా దంపతులకు 1978వ సంవత్సరం, జనవరి 27న మేఘాలయలోని తురాలో జన్మించారు. ► ఢిల్లీలో పెరిగారు. సెయింట్ కొలంబియాలో ప్రాథమిక విద్య అభ్యసించారు. ► అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి బీబీఏ, లండన్ ఇంపీరియల్ కాలేజీ నుంచి ఎంబీఏ చేశారు. ► డాక్టర్ మెహతాబ్ అజితోక్‌ను పెళ్లాడిన సంగ్మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ► తండ్రి పీఏ సంగ్మా ఎన్సీపీలో ఉన్నప్పుడు ఆయన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేవారు. ► 2003లో తొలిసారిగా ఎన్సీపీ నుంచి సెల్సెల్లా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 182 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ► 2008లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆర్థిక, విద్యుత్, ఐటీ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ► ఎన్నికల్లో విజయం సాధించిన పదిరోజుల్లోనే ఆర్థిక మంత్రిగా మేఘాలయ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సాధించారు. ► 2009–2013 వరకు మేఘాలయలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ► 2016 మార్చిలో సంగ్మా మరణానంతరం ఎన్పీపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది తుర లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఉపఎన్నికల బరిలోకి దిగి 1.92 లక్షల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ► 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసి మేఘాలయ సీఎం అయ్యారు. ► పీఏ సంగ్మా ఫౌండేషన్ చైర్మన్‌గా విద్య, పర్యావరణ రంగాల్లో కృషి చేస్తున్నారు. ► కిందటి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన ఎన్పీపీ నాలుగు స్థానాలను దక్కించుకుంది. ► ముఖ్యమంత్రి ఎన్.బైరన్ సింగ్‌పై వ్యతిరేకతతో ఒకానొక దశలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని కూడా అనుకున్నారు కాన్రాడ్ సంగ్మా. ► ఆ తర్వాత బీజేపీ హైకమాండ్‌తో రాజీకొచ్చిన సంగ్మా ఈసారి కూడా తనకున్న చరిష్మా మీదే పార్టీకి అత్యధిక స్థానాలు లభించేలా వ్యూహాలు పన్నుతున్నారు. ► రాష్ట్రంలో ఎన్పీపీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న సంగ్మా మణిపూర్ ఎన్నికల భారం అంతా ఒంటి చేత్తో మోస్తున్నారు. ► హిందూ మైటీ, ముస్లిం మైటీ–పంగల్ వర్గాలకు ఎస్టీ హోదా, నాగాల సమస్యలకు శాంతియుత పరిష్కారం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణ వంటి అంశాలపై సంగ్మా అలుపెరుగని పోరాటమే చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆందోళన వద్దు సోదరా..
ధన్‌బాద్: పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) పార్లమెంటు ఆమోదించడాన్ని నిరసిస్తూ అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు అంతకంతకూ ఉధృతంగా మారడంతో ప్రధాన మంత్రి మోదీ వారిని శాంతింప జేసే ప్రయత్నాలు చేశారు. కొత్త చట్టంపై ఎలాంటి ఆందోళన వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ధన్‌బాద్ ఎన్నికల ర్యాలీలో గురువారం ప్రసంగించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈశాన్య రాష్ట్ర ప్రజలకున్న ప్రత్యేక గుర్తింపుని, సంస్కృతిని, భాషని కాపాడతా మని హామీ ఇచ్చారు. క్యాబ్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈశాన్య ప్రాంతంలో అస్సాం సహా ప్రతీ రాష్ట్రంలో ఆదివాసీ సమాజ సంస్కృతీ సంప్రదాయాల్ని, వారి జీవన విధానాన్ని పరిరక్షిస్తామన్నారు. అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కిందకు వచ్చే ఆదివాసీ ప్రాంతాలను కొత్త చట్టం నుంచి మినహాయించినట్టు మోదీ చెప్పారు. అంతకు ముందు ప్రధాని ఇంగ్లీషు, అస్సామీ భాషల్లో వరస ట్వీట్లు చేస్తూ స్థానిక హక్కులు కాపాడే నిబంధన 6 స్ఫూర్తికి భంగం కలిగించబోమన్నారు. -
అట్టుడుకుతున్న అస్సాం
న్యూఢిల్లీ/గువాహటి: పార్లమెంట్ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు. రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఇంటర్నెట్ సేవలపై మరో 48 గంటలపాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్పై నిషేధం ఉండగా ట్విట్టర్లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గువాహటి యుద్ధరంగం రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. నగరంలో ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం, రోడ్లపై టైర్లు కాల్చడం, అడ్డంకులు కల్పించడం, పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో పలుచోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని అధికారులు అంటున్నారు. అయితే, ముగ్గురు మృతి చెందారని ఆందోళన కారులు అంటున్నారు. గువాహటిలో పర్యటిస్తున్న అస్సాం పోలీస్ చీఫ్ భాస్కర్ జ్యోతి మహంత కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదు. పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆసు(ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్) పిలుపు మేరకు గువాహటిలోని లతాశిల్ మైదానంలో సినీ, సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా వందలాదిగా ప్రజలు, విద్యార్థులు హాజర య్యారు. ఆందోళనకారులు దిగ్బంధించడంతో వేలాది మంది ప్రయాణికులు గువాహటి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. రహదారుల దిగ్బంధం కారణంగా దిబ్రూగఢ్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. డిబ్రూగఢ్‌లో ముఖ్యమంత్రి సోనోవాల్, ఎమ్మెల్యే బినోద్ హజారికా నివాసాలకు, వాహనా లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పోలీసు సర్కిల్ అధికారి కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కామ్రూప్ జిల్లాలో దుకాణాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. 31వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. జోర్హాత్ జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. 39వ నంబర్ జాతీయరహదారిపై బైఠాయించిన వారిని చెదరగొట్టేందుకు గోలా ఘాట్ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రంగియాలో కూడా పోలీసు కాల్పులు జరిగాయి. విమాన సర్వీసుల రద్దు అస్సాంలో శాంతిభద్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, స్పైస్‌జెట్ ప్రకటించగా గో ఎయిర్, ఎయిర్ ఏషియా ఇండియా షెడ్యూల్‌ను మార్చుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. జాతీయతను, దేశ సమగ్రతను దెబ్బతీసేవి, హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయవద్దని శాటిలైట్ టీవీ చానెళ్లను కేంద్రం కోరింది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులపై మరో 48 గంటలపాటు నిషేధం పొడిగించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ప్రభుత్వం గువాహటి పోలీస్ అదనపు కమిషనర్ దీపక్ కుమార్‌ను తొలగించి మున్నాప్రసాద్ గుప్తాను నియమించింది. అదేవిధంగా, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) ముకేశ్ అగర్వాల్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో జీపీ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. త్రిపుర,అస్సాంలకు రైళ్లు బంద్ ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే రైళ్లను రద్దు చేయడమో లేక కుదించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారని తెలిపింది. 12 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను తరలిస్తున్నట్లు వెల్లడించింది. -
కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..!
తిరువనంతపురం: భారీ వర్షాలతో కేరళలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, కన్నూర్ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. మణిమలలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇద్దరు వ్యక్తులు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. కొల్లాంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో రెడ్అలర్ట్ ప్రకటించారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా 2018 చివర్లో కేరళను వరదలు ముంచెత్తి వందలాదిమందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. 159కి చేరిన మృతుల సంఖ్య... భారీ వర్షాలు నేపాల్ నుంచి వస్తున్న వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణుకిపోతున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 159 మరణించారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. సహయాక బృందాలు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా బిహార్‌లోనూ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అక్కడ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు, వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీనిని జాతీయ విపత్తుగా గుర్తించాలని బిహార్, అసోం ప్రభుత్వాలు కేంద్రాన్ని విఙ్ఞప్తి చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో పంజాబ్, హరియాణాల్లోని నదులు ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. -
ఈశాన్యంలో వరదలు
గువాహటి: ఈశాన్యరాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతల మవుతున్నాయి. వరదలు, కొండచెరియలు విరిగిపడిన ఘటనల్లో అరుణాచల్, అస్సాం, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో 16 మంది చనిపోయారు. అస్సాంలోని 21 జిల్లాల్లోని 8.7 లక్షల మంది ప్రజలపై వరదల ప్రభావం పడింది. శనివారం నాటికి రాష్ట్రంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. బ్రహ్మపుత్ర నది పొంగి ప్రవహిస్తోంది. 2,168 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా 51 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. లుండింగ్–బాదర్పూర్ పర్వత ప్రాంత రైల్వే లైను దెబ్బతినడంతో ఆ మార్గంలో రైళ్లు రద్దయ్యాయి. అస్సాం ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. శనివారం ఆయన సీఎం సోనోవాల్‌తో ఫోన్లో మాట్లాడారు. నీటమునిగిన కజిరంగ నేషనల్ పార్క్ సమీపంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సాయపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, వరదల్లో మేఘాలయలో ఐదుగురు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. -
‘ఈశాన్య’ సంస్కృతి వాళ్లకో వింత
ఐజ్వాల్/లుంగ్లీ: ఈశాన్య ప్రాంతమంటే కాంగ్రెస్‌కు ఏ మాత్రం గౌరవం లేదని, అక్కడి సంప్రదాయాలు, వస్త్రధారణను ఆ పార్టీ వింతగా చూడటం తనను బాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిజోరంలోని లుంగ్లీలో శుక్రవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఈశాన్య ప్రాంతంలో రవాణా మార్గాలను మెరుగుపరిచి మార్పు తీసుకురావాలన్నదే తమ అభివృద్ధి మంత్రమని తెలిపారు. లుంగ్లీలో ప్రచారం ముగిశాక రాజధాని ఐజ్వాల్‌లో మోదీ..ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులు, పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలతో ముచ్చటించారు. వారికి అధికారమే కావాలి.. కాంగ్రెస్‌ను వదిలించుకునేందుకు మిజోరంకు ఇదే చక్కటి అవకాశమని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ప్రధాన్యతాంశాల్లో ప్రజలు లేరని, అధికారం కోసమే వెంపర్లాడుతోందని మండిపడ్డారు. ‘మీ ఆశలు, ఆకాంక్షలంటే కాంగ్రెస్‌కు పట్టింపు లేదు. అధికారం దక్కించుకోవడమే వారికి ముఖ్యం. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే మిజోరం అభివృద్ధిలో కొత్త శిఖరాల్ని చేరుకుంటుంది. బీజేపీ హయాంలో ఈశాన్య ప్రాంతంలో రైల్వే మార్గాల విస్తరణ మూడింతలు పెరిగింది. క్రీడా నైపుణ్యానికి మిజోరం కేంద్ర బిందువు. ఇక్కడ పుట్టిన బిడ్డ ‘రోటి’ అనే పదం పలకడానికి ముందే బలంగా బంతిని తన్నడం నేర్చుకుంటాడుæ’ అని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. -
భారత వృద్ధికి చోదకశక్తి
పాక్యాంగ్ (సిక్కిం): భారత్ అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలను చోదకశక్తిగా మారుస్తామనీ, ఇందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం లో అభివృద్ధి మందగించిందన్నారు. సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని సోమవారం ఇక్కడి పాక్యాంగ్ పట్టణంలో ఆవిష్కరించిన మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ..‘హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా విమానయానం చేయాలనే దిశగా మేం కృషి చేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ దేశంలో 65 విమానాశ్రయాలు ఉండేవి. కానీ గత నాలుగేళ్లలో కొత్తగా 35 విమానాశ్రయాలను మేం ప్రారంభించాం. గతంలో సగటున ఏడాదికి ఓ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే, ఇప్పుడు ఆ సంఖ్య 9 కి చేరుకుంది’ అని మోదీ చెప్పారు. పాక్యాంగ్ పట్టణంలో సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో కొండలపై 201 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. దీన్ని మోదీ ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించారు. కొత్తగా ఓ ప్రాంతంలో పూర్తిస్థాయిలో నిర్మించే ఎయిర్‌పోర్టును గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా పిలుస్తారు. విమానాశ్రయం ఆవిష్కరణ సందర్భంగా మోదీ నేపాలీ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించారు. సిక్కిం ప్రజలు ఇక్కడి ప్రకృతి అంత అందమైనవారన్నారు. ఉదయాన్నే చల్లటిగాలి వీస్తుండగా కొండలపై నుంచి సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం అద్భుతంగా ఉందనీ, ఈ సందర్భంగా ఫొటోలు తీసుకోకుండా తనను తాను నియంత్రించుకోలేకపోయానన్నారు. -
ఉత్తరాదిని ముంచెత్తనున్న భారీ వర్షాలు
పుణె/సిమ్లా: రాబోయే మూడ్రోజుల్లో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, జాలర్లు వేటకెళ్లొద్దని సూచించింది. ఢిల్లీ, హరియాణా, అస్సాం, మేఘాలయల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నెల 27 నాటికి అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో భారీ వర్షాలు కురవచ్చు. హిమాచల్‌లోని ధర్మశాలలో 60 ఏళ్ల తర్వాత తొలిసారి ఆగస్టులో రికార్డు స్థాయి వర్షం పడింది. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకూ(24 గంటల్లో) ధర్మశాలలో 292.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. -
వరదలతో ఈశాన్య రాష్ట్రాలు విలవిల
సాక్షి, గువహటి : గత వారం రోజులుగా ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరదలతో అసోం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాట్లతో ఈ మూడు రాష్ట్రాల్లో 21 మంది మరణించగా, 4.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు సహాయచర్యలను అధికారులు ముమ్మరం చేశారు. త్రిపుర, అసోంలోని వరద ప్రభావిత ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయ పునరావస సామాగ్రిని బాధితులకు భారత వాయుసేన ద్వారా చేరవేశారు. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం పెరుగుతున్నదని, మరో రెండు రోజుల్లో ఇది ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని కేంద్ర జల సంఘం పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. వరద ఉధృతితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కచర్, కరీంగంజ్, హైలకండి జిల్లాల్లో 6 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించాయి. కాగా వరద ప్రభావిత రాష్ట్రాలను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని నీతి ఆయోగ్ భేటీ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. -
ప్రకృతి ప్రకోపం.. 23 మంది మృతి
తిరువనంతపురం/లక్నో: దేశవ్యాప్తంగా ప్రకృతి ప్రకోపానికి 23 మంది చనిపోయారు. భారీ వర్షాలు, కొండచరియలు కేరళలో బీభత్సం సృష్టించగా, యూపీలో పెనుగాలులు భారీగా ప్రాణ నష్టం కలిగించాయి. మరోవైపు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మణిపూర్, మిజోరాం అతలాకుతలమయ్యాయి. యూపీలో 15 మంది, కేరళలో నలుగురు, ఈశాన్య రాష్ట్రాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కేరళలో కురుస్తున్నభారీ వర్షాలకు కోజికోడ్ జిల్లా తమరస్సెరి తాలుకాలోని కట్టిపారా గ్రామంలో గురువారం కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు చిన్నారులున్నారు. మరో 10 మంది గల్లంతయ్యారు. దీంతో ఇప్పటి వరకు వర్ష సంబంధ ఘటనల్లో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 27కు పెరిగిందని ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ వెల్లడించారు. కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వాయనాడ్, కసర్గాడ్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఈశాన్యంలో కుండపోత.. గత మూడురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. నలుగురు మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తక్షణమే మరిన్ని మిలిటరీ, ప్రకృతి విపత్తు నిర్వహణ బృందాలను పంపాలని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవదేవ్ విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పొరుగు రాష్ట్రమైన మణిపూర్‌లో వరదల కారణంగా రాజధాని ఇంఫాల్, ఇతర ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు శుక్రవారం వరకూ సెలవు ప్రకటించారు. -
ఈశాన్య భారత్‌ను వణికిస్తున్న వర్షాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో పలుచోట్ల భానుడి ప్రతాపం కొనసాగుతుంటే ఈశాన్య భారతాన్ని మాత్రం గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో త్రిపుర, అసోం, మణిపూర్, మిజోరాంలలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. త్రిపురలో భారీ వర్షాలతో దక్షిణ త్రిపుర, ఉనకోటి, ఉత్తర త్రిపుర, ఖవోయి, గోమటి జిల్లాలను వరద ముంచెత్తింది. ఎడతెరిపిలేని వర్షాలతో ఇళ్లల్లోకి నీరు చేరడంతో 189 సహాయ శిబిరాల్లో దాదాపు 3,500 కుటుంబాలు పైగా తలదాచుకున్నాయని అధికారులు తెలిపారు. వరద సహాయక కార్యక్రమాల్లో ఆర్మీ పాలుపంచుకోవాలని త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. త్రిపురకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పెద్దసంఖ్యలో పంపాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను విప్లవ్ దేవ్ కోరారు. త్రిపురకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం అవసరమైన ఏర్పాట్లు తక్షణమే చేపట్టాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను ఆదేశించింది. కాగా వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు త్రిపుర ప్రభుత్వం రూ 5 లక్షల పరిహారం ప్రకటించింది. -
ఈశాన్య ఓటమిపై రాహుల్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ పరాజయంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మౌనం వీడారు. ‘త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంద’ని రాహుల్ ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసి, తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలందరికీ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. హోలీ వారాంతంలో తన 93 ఏళ్ల అమ్మమ్మను పరామర్శించేందుకు రాహుల్ ఇటలీ టూర్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కీలక సమయంలో పార్టీ శ్రేణులను విడిచివెళ్లడం పట్ల బీజేపీ రాహుల్‌పై విమర్శలు గుప్పించింది. రాహుల్ తీరుపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. ‘ఆయన సహజమైన నాయకుడు కాదు...పరిస్థితుల ప్రభావంతో పగ్గాలు చేపట్టారు..ఓ రాణికి జన్మించిన ఆయన ఓసారి 56 రోజులు అదృశ్యమయ్యారు..మళ్లీ ఇప్పుడు పత్తాలేకుండా పోయా’రని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇలాంటి కీలక సమయంలో ఏ నేత పార్టీ శ్రేణులకు దూరంగా ఉండరు..రాహుల్ అసలు ఒత్తిడిని ఎదుర్కోలే’రని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. త్రిపురలో కనీసం ఒక్కసీటు దక్కకపోగా, మేఘాలయాలో అధికారాన్ని కోల్పోయింది. -
మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు?!
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ పెట్టుబడులపై చైనాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఘాటుగా సామాధానం చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి చేసేందుకు జపాన్- సంయుక్తంగా ముందుకు సాగుతాయని.. అందులో బయటి దేశాల జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. భారత్ సార్వభౌమాధికారం కలిగిన దేశం అని.. ఈ విషయాన్ని చైనా గుర్తుంచుకుని వ్యాఖ్యలు చేయాలని సూచించారు. సరిహద్దుల లోపల ఏం చేయాలి? ఎలా చేయాలి? అబివృద్ధి పనులకు ఎవరి సహకారం తీసుకోవాలి? అన్న అంశాలపై సొంత నిర్ణయం తీసుకునే హక్కు మాకుంది. మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు ఏ దేశానికి లేదు అని అమిత్ షా చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో జపాన్‌తో కలిసి సంయుక్తంగా పెట్టుబడులు పెట్టడంపై చైనా శనివారం ఉదయం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో మూడో దేశం జోక్యం చేసుకోవడం మంచిది కాదంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన అధికార ప్రతినిధి హువా చున్యింగ్ పేర్కాన్నారు. ఇండో-చైనా సరిహద్దులపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని పరోక్షంగా చైనాకు అమిత్ షా చురకలు అంటించారు. -
కబేళాలపై కోరడా ఝుళిపించిన 4 రాష్ట్రాలు
-
ఆ రాష్ట్రాలకే ఎందుకు పంపుతున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద ఎత్తున రద్దైన నోట్లు ఎందుకు వెళ్తున్నాయో తెలుసా?. నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకోవడానికి నల్లకుబేరులు అల్లుతున్న సరికొత్త ప్లాన్ ఇది. అదెలా సాధ్యం రాష్ట్రాలు దాటితే నల్లధనం తెల్లధనం అవుతుందా?. అవుతుంది. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంటు వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలకు పన్ను చెల్లింపుల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం ఇవి నల్ల కుబేరుల పాలిట వరంగా మారాయి. దీంతో డబ్బును ఆయా రాష్ట్రాలకు తరలించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు నల్లకుబేరులు యత్నిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో అధిక విలువ కలిగిన పాత కరెన్సీ నోట్ల కట్టలు పోలీసులకు చిక్కుతుండటానికి గల ప్రధానకారణం కూడా ఇదే. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో నివాసం ఉండే ఎస్టీలకు ఐటీ శాఖ పన్ను నుంచి కొంత మినహాయింపును ఇచ్చింది. అస్సాంలోని ఉత్తర కఛర్ హిల్స్, మికిర్ హిల్స్, మేఘాలయలోని ఖాసి హిల్స్, గరో హిల్స్, జైన్ టియా హిల్స్, జమ్మూ,కశ్మీర్ లోని లడఖ్, సిక్కీం రాష్ట్ర ప్రజలకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది. ఈ ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వెనుకబడిన వర్గాలు త్వరగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతోనే ఆయా ప్రాంతాల్లో పన్నుకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అయితే, అధిక విలువ కలిగిన నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు నల్లకుబేరులు ఈ రాష్ట్రాలు సులువైన మార్గంగా ఎన్నుకుంటున్నారు. వ్యవసాయ భూములు, చారిటబుల్ ట్రస్టులు, ఖాదీ పరిశ్రమలు, గ్రామస్ధాయి పరిశ్రమలు, లాభాపేక్ష లేని విద్యాసంస్ధలు, లాభాపేక్ష లేని ఆసుపత్రులు, రాజకీయ పార్టీలకు ఐటీ యాక్ట్ లో పూర్తి పన్ను మినహాయింపు ఉంది. దీంతో పెద్ద మొత్తంలో నల్లధనాన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు తరలించి అక్కడి సంస్ధల్లో పెట్టుబడులు పెట్టడమో లేదా రాజకీయపార్టీలకు ఫండ్ గా ఇవ్వడమో జరుగుతోంది. -
స్థానిక నాయకులవల్లే ‘ఈశాన్యం’ వెనుకబాటు
సాక్షి, ముంబై : ఈశాన్య రాష్ట్రాల వెనుకబాటుతనానికి దేశ రాజధాని న్యూఢిల్లీ కాదని, స్థానిక నాయకుల వైఫల్యమే కారణమని కే్రంద హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజ్యుజీ అన్నారు. దాదర్‌లోని వీర్‌సావర్కర్ స్మృతిపథ్ సభాగృహంలో సోమవారం రాత్రి ‘మైహోం ఇండియా’ సామాజిక సంస్థ నిర్వహించిన ‘అవర్ నార్త్ ఈస్ట్ (వన్) ఇండియా అవార్డ్ ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరెన్ మాట్లాడుతూ..స్థానిక నాయకుల ఉదాసీనత కారణంగానే ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాలను భారత దేశం నుంచి విడిగా చూడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందనీ, ఇటీవల ఈశాన్య రాష్ట్రాలలో రైల్వే ప్రాజెక్టు ప్రారంభించడమే ఇందుకు తార్కాణమని చెప్పారు. ఈశాన్య భారతంలో అద్భుతమైన సహజ వనరులున్నాయనీ వాటిని క్రమపద్ధతిలో సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన ప్రగతిని సాధించ వచ్చని కిరెన్ పేర్కొన్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఇచ్చే వన్ ఇండియా అవార్డ్- 2014కు గాను ‘శిలాంగ్ టైమ్స్’ ఆంగ్ల దిన పత్రిక సంపాదకురాలు ప్యాట్రీషియా ముఖీంకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహిత మాట్లాడుతూ.. నిజానికి 95 శాతం భారతదేశం సరిహద్దు ఈశాన్య ప్రాంతంలోనే ఉందని చెప్పారు. ఈ కారణంగా భారత ప్రభుత్వం ఈశాన్య భారతంలో మరింత మౌలిక అభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని సూచించారు. మై హోం ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు సునీల్ దేవ్‌ధర్ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కలంతో పోరాడిన ప్యాట్రీషియ ముఖీంకు వన్ ఇండియా అవార్డును ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి నగర బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్, వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు. -
ఈశాన్య రాష్ట్రాలకు 53 వేల కోట్లు..
న్యూఢిల్లీ: ఈశాన్య భారత ఒంటరితనానికి ముగింపు పలికేందుకు కేంద్రం సాధారణ బడ్జెట్లో వరాల వర్షం కురిపించింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం భారీగా రూ. 53,706 కోట్లు కేటాయించింది. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడానికి రోడ్లు, రైలు మార్గాల విస్తరణ, సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధి తదితరాలను అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఈశాన్య భారతం వెనుకబాటుతనంతో కునారిల్లుతోందని, సరైన అనుసంధానం లేక పోవడంతో ఏకాకితనం భావన నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతానికి 10 శాతం ప్రణాళికా నిధుల కేటాయింపును అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఇదివరకటి ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరి చేసిందని గుర్తు చేశారు. తాజా బడ్జెట్ నుంచి ఈశాన్య ప్రాంతానికి కేటాయింపులపై ప్రత్యేక పత్రాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. బడ్జెట్లో ఈశాన్య రాష్ట్రాల కేటాయింపులు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.2,332.78 కోట్లు. బ జాతీయ రహదారుల సంస్థ, రాష్ర్ట్ర రహదారుల వ్యవస్థలో ప్రతిపాదించిన రూ. 38 వేల కోట్ల పెట్టుబడుల్లో రూ.3 వేల కోట్లు ఈశాన్యానికి. బ రైలు మార్గాల విస్తరణ కోసం మధ్యంతర బడ్జెట్ కేటాయింపులతోపాటు రూ. 1,000 కోట్లు. బ మణిపూర్‌లో క్రీడా విశ్వవిద్యాలయం. బ ‘అరుణ్ ప్రభ’ పేరుతో టీవీ చానల్.బ సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధికి రూ.100 కోట్లు. -
ఈశాన్య రాష్ట్రాల సహకారం అవసరం
అగర్తలా: భారత-బంగ్లాదేశ్ ల మధ్య అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాల సహకారం అవసరమని బంగ్లా దేశ్ మాజీ విదేశాంగ మంత్రి దిపూ మోనీ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడాలంటే త్రిపురతో సహా ఈశాన్య రాష్ట్రాల భాగస్వామ్యం అవసరమని ఆమె పేర్కొన్నారు. బంగ్లాకు అత్యంత దగ్గరగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడితే ఇరు దేశాల మధ్య సఖ్యత మరింత పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే బుధవారం బంగ్లాదేశ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమయ్యింది. బంగ్లాకు ఉత్తరాది ప్రాంతాలతో పాటు, సన్నిహితంగా ఉండే దేశాలకు సంబందించి విదేశీ వ్యవహారాలపై ఆ కమిటీలో చర్చించారు. -
ఈశాన్యం ఎటువైపు ?
2014లో భిన్నమైన తీర్పునిచ్చే అవకాశం ఎలక్షన్ సెల్: బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్.. ఈ ఐదు దేశాలతో సరిహద్దులను పంచు కునే ఈశాన్య రాష్ట్రాలు విభిన్న జాతులు, భాషలు, సంప్రదాయాల సమాహారం. దశాబ్దాలుగా జాతుల మధ్య విభేదాలు, సీమాంతర ఉగ్రవాదం, శరణార్థుల అక్రమ చొరబాట్లు, వేర్పాటువాద ఉద్యమాలు, తిరుగుబాట్లతో ఈ ప్రాంతం వెనకబాటుకు గురైంది. అస్థిరతకు ఆలవాలమైంది. అయితే ఇటీవలి కాలంలో ఈశాన్య రాష్ట్ర్రాల ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా గతంలో తీవ్రవాదం ఉండేదని, ఇప్పుడు ఆ స్థానంలో ఆర్థికాభివృద్ధి, విద్య, ఉద్యోగ కల్పన, సంక్షేమం, ఆరోగ్యం మొదలైన అంశాలు చేరాయి. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అసోం సహా ఈ రాష్ట్రాల సగటు వృద్ధి జాతీయ సగటును అధిగమించి 9.95% గా ఉండటం గమనార్హం. సీట్లు పెంచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహం అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, త్రిపురల్లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలున్నాయి. రాజకీయంగా చూస్తే మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం. మణిపూర్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయాల్లో ఆ పార్టీనే అధికారంలో ఉంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ఈ ప్రాంత అభివృద్దికి సంబం ధించి పలు ప్రతిపాదనలు రూపొందించారు. 2009లో గెలుచుకున్న స్థానాలను నిలుపుకోవడం తో పాటు మరికొన్ని సీట్లు పెంచుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీజేపీ.. ప్రత్యేక ప్రణాళిక ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం కూడా గణనీయంగానే ఉంది. వాజ్‌పేయి హయాంలోని ‘లుక్ ఈస్ట్’ విధానం సత్ఫలితాలను ఇచ్చిందన్న భావన ఇక్కడి ప్రజల్లో ఉంది. అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా మారుస్తామని చెబుతోంది. ప్రతి ఈశాన్య రాష్ట్రానికి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోంది. జాతీయ పార్టీలకు సంగ్మా సవాలు.. ఇక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. అదీగా, ఈ ఎన్నికల్లో 10 పార్టీలు ఒక్కటై లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా నేతృత్వంలో ‘నార్త్ఈస్ట్ రీజినల్ పొలిటికల్ ఫ్రంట్(ఎన్ఈఆర్పీఎఫ్)’గా ఏర్పడ్డాయి. అసోంతో కలుపుకుని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గానూ 21 స్థానాల్లో ఈ ఫ్రంట్ అభ్యర్థులను బరిలో దింపడం కాంగ్రెస్, బీజేపీల విజయావకాశాలను దెబ్బతీసే అంశమే. స్థానికత, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం, జాతీయ పార్టీలపై వ్యతిరేకత, సంగ్మా వ్యక్తిత్వం.. ఈ ఎన్నికల్లో ఎన్ఈఆర్పీఎఫ్కు కలిసొచ్చే అంశాలు. ‘లోక్‌సభలో మాకంటూ ఒక బలమైన ప్రాతినిధ్యం కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు’ అని సంగ్మా చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు? అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ - ఏప్రిల్ 9న. త్రిపుర - ఏప్రిల్ 7, ఏప్రిల్ 12 సిక్కిం - ఏప్రిల్ 12 మేఘాలయ: 2 స్థానాలు మొత్తం ఓటర్లు , 15.53లక్షలు మేఘాలయలో కాంగ్రెస్‌కు కొంత ఆశాజనక పరిస్థితి కన్పిస్తోంది. యునెటైడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీఎఫ్)తో పొత్తు కలిసిరావొచ్చు. బీజేపీ మోడీ మంత్రాన్నే జపిస్తోంది. త్రిపుర: 2 స్థానాలు మొత్తం ఓటర్లు : 23.5లక్షలు త్రిపురలో సీపీఎం హవా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఈసారి కాంగ్రెస్, బీజేపీలకు పెద్దగా ఆశలు లేనట్టే. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 50 వామపక్షాలే గెలిచాయి. లెఫ్ట్ పార్టీలను తరిమికొట్టాలన్న రాహుల్ పిలుపు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. మణిపూర్: 2 స్థానాలు మొత్తం ఓటర్లు: 17.5లక్షలు 2009లో రెండు స్థానాలనూ కాంగ్రెసే గెలుచుకుంది. రాష్ర్టంలో తామే అధికారంలో ఉండడంతో రెండు ఎంపీ స్థానాలను గెల్చుకోగలమని కాంగ్రెస్ దీమాతో ఉంది. సీఎం ఇబోబి సింగ్‌పై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం కాంగ్రెస్‌కు కలిసిరావొచ్చు. అరుణాచల్ ప్రదేశ్ : 2 స్థానాలు మొత్తం ఓటర్లు: 7.5లక్షలు రాష్ర్టంలోని రెండు ఎంపీ స్థానాలను 2009లో కాంగ్రెస్ గెల్చుకోగా.. 2004లో బీజేపీ సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభావం కనిపించవచ్చు. 2004 ఫలితాలను మళ్లీ సాధించాలనే కృతనిశ్చయంతో బీజేపీ ఉంది. ‘రాజకీయాల్లోంచి రిటైరయ్యాక అరుణాచల్ ప్రదేశ్‌లోనే సెటిల్ అవుతాను..’ అంటూ ఇటీవల రాహుల్‌గాంధీ ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సిక్కిం స్థానాలు మొత్తం ఓటర్లు: 3.5లక్షలు సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డిఎఫ్)కు ఎదురులేదు. జనంలో మంచి పట్టుంది. ఈసారి కూడా ఎంపీ సీటును గెల్చుకోవచ్చని అంచనా. మిజోరం: మొత్తం ఓటర్లు స్థానాలు: 6.4లక్షలు ఏకైక సీటును 2004లో మిజో నేషనల్ ఫ్రంట్, 2009లో కాంగ్రెస్ నెగ్గింది. ఈసారి ఈ రెండింటి మధ్యే ప్రధాన పోరు ఉంటుంది. నాగాలాండ్: మొత్తం ఓటర్లు స్థానాలు, 11.7లక్షలు రాష్ర్టంలో నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు ఎదురు లేదు. ఈ ఎన్నికల్లో కూడా ఎంపీ స్థానాన్ని నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. రాహుల్ టీ షర్ట్.. నమో టీ మగ్ ఎన్నికల పుణ్యమా అని ఆన్లైన్ షాపింగ్ సైట్లకు అమ్మకాల కళ వచ్చింది! కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్)లకు సంబంధించిన వస్తువులు కావాలంటూ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని సైట్ల యజమానులు సంబరపడిపోతున్నారు. స్నాప్‌డీల్, బ్లూగేప్, ఫ్లిప్‌కార్ట్, ప్రింట్వెన్యూ మొదలైన సైట్లకు అభిమానుల తాకిడి బాగా ఉందిట. సైట్లలో ముఖ్యంగా రాహుల్‌గాంధీ ఫొటో ఉన్న టీ షర్ట్, నరేంద్రమోడీ బొమ్మ ఉన్న టీ మగ్ (బాల్యంలో రైల్వేస్టేషన్లో మోడీ టీ అమ్మిన విషయం ఇటీవల బాగా ప్రచారంలోకి రావడం తెలిసిందే)లకు విపరీతమైన క్రేజ్ ఉందట. వాటితోపాటు రాహుల్‌గాంధీ, నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రీవాల్‌ల ఫొటోలు ప్రింటై ఉన్న గడియారాలు, ల్యాప్‌టాప్ బ్యాగులు కూడా బాగానే అమ్ముడుపోతున్నాయట. ఆప్ గుర్తు చీపురుకట్టకూ డిమాండ్ బాగానే ఉంది. ‘మేం ఝాడూ క్యాంపేయిన్(చీపురుకట్ట ప్రచారం) ప్రారంభించిన తొలి రెండు రోజుల్లో 6 వేల చీపుర్లను అమ్మగలిగాం’ అని ట్రేడస్ వెబ్సైట్ సీఈఓ ముదిత్ ఖోస్లా గుర్తుకు తెచ్చుకున్నారు. రామ్.. శ్యామ్.. కృష్ణ ఎవరివీ పేర్లు అనుకుంటున్నారా..? ప్రస్తుతం బీహార్‌లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో చాలామంది పేర్లు ఇవే! అన్ని పార్టీల అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే.. పేరులో రామ్ అని ఉన్న అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో కృష్ణ, శ్యామ్ అనే పేర్లు నిలిచాయి. విచిత్రమేంటంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశంతో పాపులర్ అయిన బీజేపీలో రామ్ పేరున్న అభ్యర్థులు అతి తక్కువగా.. కేవలం ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు లాలూ ప్రసాద్‌కు చాలా దగ్గరివాడు, ఇటీవలే బీజేపీలో చేరి పాటలిపుత్ర స్థానం నుంచి బరిలో ఉన్న రామ్‌కృపాల్ యాదవ్. ఇక బీజేపీతో జతగట్టిన లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నుంచి ముగ్గురు ‘రామ్’ నామ అభ్యర్థులున్నారు. వారు రామ్ విలాస్ పాశ్వాన్, రామ్ కిశోర్‌సింగ్, రామ్ చంద్ర పాశ్వాన్. దాంతో ‘ఎల్జేపీ ఇప్పుడు నిజమైన కాషాయరంగు దాల్చింది’ అంటూ లాలూ ప్రసాద్ ఇటీవల చమత్కరించారు. కర్ణాటక బరిలో ఐదుగురు సీఎంలు కర్ణాటకలో ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు నిలిచారు. వారు ఎం.వీరప్ప మొయిలీ (కాంగ్రెస్), ఎన్ ధరమ్‌సింగ్ (కాంగ్రెస్), బీఎస్ యడ్యూరప్ప (బీజేపీ), డీవీ సదానంద గౌడ (బీజేపీ), జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ. వీరితో పాటు దేవెగౌడ కుమారుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నారు. మొయిలీ చిక్‌బళ్లాపుర స్థానం నుంచి పోటీకి దిగాలనుకుంటున్నారు. యడ్యూరప్ప షిమోగా నుంచి, సదానంద గౌడ ఉత్తర బెంగళూరు నుంచి, దేవెగౌడ హసన్ నుంచి, ధరమ్‌సింగ్ బీదర్ నుంచి పోటీలో ఉన్నారు. వీరిలో ధరమ్‌సింగ్, యడ్యూరప్ప, దేవెగౌడ విజయం సులభమే కానీ మొయిలీ, సదానందలకు గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఈశాన్యవాసులకు గట్టి భద్రత
న్యూఢిల్లీ: నగరంలో ఈశాన్య వాసులపై జరుగుతున్న వరుస దాడులను నియంత్రించేందుకు ఢిల్లీ పోలీసులు నడుం బిగించారు. ఇటీవల కాలంలో ఈశాన్యరాష్ట్రాల వాసులపై నగరంలో దాడుల పరంపర కొనసాగుతోంది. దీనిపై సాక్షాత్తు రాష్ట్రపతి సైతం విచారం వ్యక్తం చేశారు. అంతేకాక దేశవ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వారి భద్రత నిమిత్తం కొత్త యూనిట్‌ను ఏర్పాటుచేయడంతోపాటు హెల్ప్‌లైన్ నంబర్ (1093)ను ఏర్పాటుచేసినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ శనివారం తెలిపారు. దీనికోసం కంట్రోల్ రూంలో ఐదు లైన్లను ఏర్పాటుచేసినట్లు వివరించారు. పోలీసుల సహాయం కోసం 100కు ఫోన్ చేసినట్లే, ఎవరైనా ఈశాన్య వాసులకు ఇబ్బంది ఎదురైతే వెంటనే 1093కి ఫోన్ చేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని బస్సీ చెప్పారు. ఈశాన్య విద్యార్థి నిడో తానియా హత్య తర్వాత ఈ చర్యలు తీసుకోవడానికి తాము యోచించినట్లు కమిషనర్ తెలిపారు. అలాగే హైకోర్టు సైతం ఈశాన్యవాసుల రక్షణార్థం నగరంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినందున దీనికోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఈ కొత్త విభాగం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన 4వ బెటాలియన్ డీసీపీ కిమ్ కామింగ్ నేతృత్వంలో నానక్పురా నుంచి పనిచేస్తుందని చెప్పారు. అతడు జాయింట్ కమిషనర్, చీఫ్ కోఆర్డినేటర్ రాబిన్ హిబూతో కలిసి ఈ విభాగం పనితీరును పర్యవేక్షిస్తారని వివరించారు. ఈ విభాగం జాతీయ రాజధానిలో నివాసముండే ఈశాన్యవాసుల భద్రతకు బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఇంతకుముందు ఢిల్లీ పోలీసులు ఈశాన్య ప్రజల సమస్యలను పట్టించుకునేందుకు ఏడుగురు నోడల్ అధికారులను నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అన్ని జిల్లాలకు చెందిన డీసీపీలను నోడల్ అధికారులగా గుర్తించేందుకు నిర్ణయించామన్నారు. వీరందరూ స్థానికంగా ఉన్న ఈశాన్యవాసుల సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారని, ఎవరికైనా వ్యక్తిగతంగా సమస్య ఎదురైతే వెంటనే స్పం దిస్తారని కమిషనర్ తెలిపారు. ద్వారకాలోని ముని ర్కా వంటి ఈశాన్యవాసులు ఎక్కువగా నివసించేప్రాంతాలపై ఇకనుంచి ప్రత్యేక దృష్టి పెడతామని బస్సీ వివరించారు. ఇదిలా ఉండగా, ఈశాన్యవాసుల భద్రత నేపథ్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసినట్లుగానే విదేశీయుల కోసం కూడా ఒక ప్రత్యేక విభాగాన్ని, హెల్ప్‌లైన్ నంబర్ ను ఏర్పాటుచేశామని కమిషనర్ తెలిపారు. ఈ విభాగానికి జాయింట్ కమిషనర్ ముఖేష్ మీనా సంధానకర్తగా వ్యవహరిస్తారన్నారు. సెల్ నంబర్- 08750871111, హెల్ప్‌లైన్-1098 లకు ఆపదలో ఉన్న విదేశీయులెవరైనా ఫోన్ చేస్తే తాము వెంటనే స్పందిస్తామని బస్సీ వివరించారు. నగరంలో ఇటీవల కాలంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ నగరంలో ఉండే ప్రతిఒక్కరికీ రక్షణ కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు కమిషనర్ బి.ఎస్.బస్సీ తెలిపారు.