గువాహటి: ఈశాన్య రాష్ట్రాల్లో నూతన ఆసుపత్రులు, వైద్య కళాశాలల రాకతో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కాబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈశాన్య భారతంలో సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం తొమ్మిదేళ్లుగా శ్రమిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ఈశాన్య ప్రాంతాన్ని ఆమడ దూరంలో ఉంచాయని, తమ ప్రభుత్వం దగ్గరికి చేర్చుకుంటోందని వివరించారు.
ఈశాన్య భారతదేశంలో నిర్మించిన తొలి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. అస్సాం రాజధాని గువాహటిలో రూ.1,123 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. అలాగే నల్బారీ, నాంగావ్, కోక్రాజార్‌లో మెడికల్ కాలేజీలను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.
రూ.546 కోట్లతో నిర్మించే అస్సాం అడ్వాన్స్‌డ్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ ఇనిస్టిట్యూట్ (ఏఏహెచ్‌ఐఐ)కు పునాదిరాయి వేశారు. దీన్ని అస్సాం ప్రభుత్వం, ఐఐటీ–గువాహటి సంయుక్తంగా నిర్మించనున్నాయి. 1.1 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. విపక్షాలు దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు.
రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ
గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రూ.7,300 కోట్లతో కూడిన ఐదు రైల్వే ప్రాజెక్టులను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. బ్రహ్మపుత్ర నదిపై రూ.3,200 కోట్లతో పలాస్‌బారీ–సువాల్‌కుచీ బ్రిడ్జి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. దిబ్రూగఢ్‌లో రూ.1,709 కోట్లతో నిర్మించిన మిథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అస్సాంలో సంప్రదాయ బిహూ నృత్యోత్సవంలో మోదీ పాల్గొన్నారు. 11,000 మందికిపైగా నృత్యకారులు, కళాకారులు అలరించారు. ఇక్కడ గురువారం నిర్వహించిన బిహూ
నృత్యం రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సృష్టించడం తెలిసిందే.
సాంకేతికతతో సత్వర న్యాయం
గౌహతి హైకోర్టు వార్షికోత్సవంలో మోదీ
న్యాయసేవలు అందించే వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. టెక్నాలజీతో సత్వర న్యాయం అందించవచ్చని, దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల వంటి మూరుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతోమేలు జరుగుతుందన్నారు. శుక్రవారం అస్సాంలో గౌహతి హైకోర్టు 70వ వార్షికోత్సవ ముగింపు సభలో మోదీ ప్రసంగించారు. నూతన టెక్నాలజీతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. లక్షలాది మంది పౌరులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేశామని ప్రధాని మోదీ వివరించారు. దానివల్ల ఆస్తుల సంబంధిత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment