ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ పరాజయంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మౌనం వీడారు. ‘త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంద’ని రాహుల్ ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసి, తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలందరికీ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. హోలీ వారాంతంలో తన 93 ఏళ్ల అమ్మమ్మను పరామర్శించేందుకు రాహుల్ ఇటలీ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కీలక సమయంలో పార్టీ శ్రేణులను విడిచివెళ్లడం పట్ల బీజేపీ రాహుల్‌పై విమర్శలు గుప్పించింది.
రాహుల్ తీరుపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. ‘ఆయన సహజమైన నాయకుడు కాదు...పరిస్థితుల ప్రభావంతో పగ్గాలు చేపట్టారు..ఓ రాణికి జన్మించిన ఆయన ఓసారి 56 రోజులు అదృశ్యమయ్యారు..మళ్లీ ఇప్పుడు పత్తాలేకుండా పోయా’రని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇలాంటి కీలక సమయంలో ఏ నేత పార్టీ శ్రేణులకు దూరంగా ఉండరు..రాహుల్ అసలు ఒత్తిడిని ఎదుర్కోలే’రని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. త్రిపురలో కనీసం ఒక్కసీటు దక్కకపోగా, మేఘాలయాలో అధికారాన్ని కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment