
ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉధృతి
సాక్షి, గువహటి : గత వారం రోజులుగా ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరదలతో అసోం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాట్లతో ఈ మూడు రాష్ట్రాల్లో 21 మంది మరణించగా, 4.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు సహాయచర్యలను అధికారులు ముమ్మరం చేశారు. త్రిపుర, అసోంలోని వరద ప్రభావిత ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయ పునరావస సామాగ్రిని బాధితులకు భారత వాయుసేన ద్వారా చేరవేశారు. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం పెరుగుతున్నదని, మరో రెండు రోజుల్లో ఇది ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని కేంద్ర జల సంఘం పేర్కొంది.
ఈశాన్య రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. వరద ఉధృతితో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కచర్, కరీంగంజ్, హైలకండి జిల్లాల్లో 6 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించాయి. కాగా వరద ప్రభావిత రాష్ట్రాలను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని నీతి ఆయోగ్ భేటీ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు.