
నేపాల్‌లో ఖాట్మండూలో చిన్నారితో కలసి వరదనీటిని దాటుతున్న స్థానికుడు
గువాహటి: ఈశాన్యరాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతల మవుతున్నాయి. వరదలు, కొండచెరియలు విరిగిపడిన ఘటనల్లో అరుణాచల్, అస్సాం, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో 16 మంది చనిపోయారు. అస్సాంలోని 21 జిల్లాల్లోని 8.7 లక్షల మంది ప్రజలపై వరదల ప్రభావం పడింది. శనివారం నాటికి రాష్ట్రంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. బ్రహ్మపుత్ర నది పొంగి ప్రవహిస్తోంది. 2,168 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా 51 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. లుండింగ్–బాదర్‌పూర్ పర్వత ప్రాంత రైల్వే లైను దెబ్బతినడంతో ఆ మార్గంలో రైళ్లు రద్దయ్యాయి. అస్సాం ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. శనివారం ఆయన సీఎం సోనోవాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. నీటమునిగిన కజిరంగ నేషనల్ పార్క్ సమీపంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సాయపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, వరదల్లో మేఘాలయలో ఐదుగురు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.