ఆ రాష్ట్రాలకే ఎందుకు పంపుతున్నారో తెలుసా?
ఆ రాష్ట్రాలకే ఎందుకు పంపుతున్నారో తెలుసా?
Published Thu, Nov 24 2016 8:06 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద ఎత్తున రద్దైన నోట్లు ఎందుకు వెళ్తున్నాయో తెలుసా?. నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకోవడానికి నల్లకుబేరులు అల్లుతున్న సరికొత్త ప్లాన్ ఇది. అదెలా సాధ్యం రాష్ట్రాలు దాటితే నల్లధనం తెల్లధనం అవుతుందా?. అవుతుంది. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంటు వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలకు పన్ను చెల్లింపుల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది.
ప్రస్తుతం ఇవి నల్ల కుబేరుల పాలిట వరంగా మారాయి. దీంతో డబ్బును ఆయా రాష్ట్రాలకు తరలించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు నల్లకుబేరులు యత్నిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో అధిక విలువ కలిగిన పాత కరెన్సీ నోట్ల కట్టలు పోలీసులకు చిక్కుతుండటానికి గల ప్రధానకారణం కూడా ఇదే.
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో నివాసం ఉండే ఎస్టీలకు ఐటీ శాఖ పన్ను నుంచి కొంత మినహాయింపును ఇచ్చింది. అస్సాంలోని ఉత్తర కఛర్ హిల్స్, మికిర్ హిల్స్, మేఘాలయలోని ఖాసి హిల్స్, గరో హిల్స్, జైన్ టియా హిల్స్, జమ్మూ,కశ్మీర్ లోని లడఖ్, సిక్కీం రాష్ట్ర ప్రజలకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది.
ఈ ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వెనుకబడిన వర్గాలు త్వరగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతోనే ఆయా ప్రాంతాల్లో పన్నుకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అయితే, అధిక విలువ కలిగిన నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు నల్లకుబేరులు ఈ రాష్ట్రాలు సులువైన మార్గంగా ఎన్నుకుంటున్నారు.
వ్యవసాయ భూములు, చారిటబుల్ ట్రస్టులు, ఖాదీ పరిశ్రమలు, గ్రామస్ధాయి పరిశ్రమలు, లాభాపేక్ష లేని విద్యాసంస్ధలు, లాభాపేక్ష లేని ఆసుపత్రులు, రాజకీయ పార్టీలకు ఐటీ యాక్ట్ లో పూర్తి పన్ను మినహాయింపు ఉంది. దీంతో పెద్ద మొత్తంలో నల్లధనాన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు తరలించి అక్కడి సంస్ధల్లో పెట్టుబడులు పెట్టడమో లేదా రాజకీయపార్టీలకు ఫండ్ గా ఇవ్వడమో జరుగుతోంది.
Advertisement
Advertisement