ఈశాన్య భారత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో పలుచోట్ల భానుడి ప్రతాపం కొనసాగుతుంటే ఈశాన్య భారతాన్ని మాత్రం గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో త్రిపుర, అసోం, మణిపూర్, మిజోరాంలలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
త్రిపురలో భారీ వర్షాలతో దక్షిణ త్రిపుర, ఉనకోటి, ఉత్తర త్రిపుర, ఖవోయి, గోమటి జిల్లాలను వరద ముంచెత్తింది. ఎడతెరిపిలేని వర్షాలతో ఇళ్లల్లోకి నీరు చేరడంతో 189 సహాయ శిబిరాల్లో దాదాపు 3,500 కుటుంబాలు పైగా తలదాచుకున్నాయని అధికారులు తెలిపారు.
వరద సహాయక కార్యక్రమాల్లో ఆర్మీ పాలుపంచుకోవాలని త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. త్రిపురకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలను పెద్దసంఖ్యలో పంపాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను విప్లవ్ దేవ్ కోరారు. త్రిపురకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం అవసరమైన ఏర్పాట్లు తక్షణమే చేపట్టాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను ఆదేశించింది. కాగా వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు త్రిపుర ప్రభుత్వం రూ 5 లక్షల పరిహారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment