బుధవారం ఏడో విడత పోలింగ్
బుధవారం జరుగనున్న లోక్‌సభ ఏడో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 నియోజక వర్గాల్లో లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్నాయి.
గుజరాత్‌లోని 26 నియోజకవర్గాల్లో, తెలంగాణాలోని 17 లోకసభ నియోజకవర్గాల్లో, ఉత్తర ప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాల్లో, పంజాబ్‌లోని మొత్తం 13 నియోజకవర్గాల్లో, పశ్చిమ బెంగాల్‌లోని 9 నియోజకవర్గాల్లో, బీహారులోని ఏడు నియోజకవర్గాల్లో, జమ్మూ-కాశ్మీరులోని ఒక నియోజకవర్గంలో, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా-నగర్ హవేలిలోని ఒక నియోజకవర్గంలో, డామన్-డయూలోని ఒక నియోజకవర్గంలో లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి. ఇవే కాక తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ కూడా బుధవారమే జరుగుతుంది.
మొత్తం తొమ్మిది విడతల్లో ఇది ఏడవ విడత పోలింగ్.
ఈ విడత బరిలో వున్న నేతల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియాగాంధీ, మధుసూధన్ మిస్త్రీ, కెప్టెన్ అమ్రిందర్‌సింగ్, శ్రీప్రకాష్ జైస్వాల్, బిజెపికి చెందిన నరేంద్ర మోడి, ఎల్.కె.అద్వాని, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, జెడియుకు చెందిన శరద్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా వున్నారు.