గోప్యత మాటేమిటి?!
మన ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) వినియోగించడం ప్రారంభించిన నాటి నుంచీ ఏదో రకమైన వివాదం తలెత్తుతూనే ఉంది. అలాంటి వివాదాలకు స్వస్తి పలుకుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోటీచేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఈవీఎంలకు ప్రింటర్‌లను అనుసంధానించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ విధానాన్ని వివిధ సందర్భాల్లో ఎంపికచేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగిస్తూ వచ్చిన సంఘం గత సెప్టెంబర్‌లో నాగాలాండ్‌లోని నోక్సెన్ నియోజకవర్గం ఉప ఎన్నికలో తొలిసారి పూర్తిగా వినియోగించింది. బ్యాలెట్ బాక్సుల విధానానికి స్వస్తిపలికి ఈవీఎంలను ఉపయోగించడం మొదలెట్టాక పరాజితులు తమ ఓటమికి ఈవీఎంలలోనే కారణాన్ని వెదుకుతున్నారు. అధికార పక్షం ఈవీఎంలను ‘టాంపర్’ చేసిందనీ, లేకపోతే తాము భారీ మెజారిటీతో గెలిచేవారమని ఆరోపించడం పరిపాటైంది. ఎన్నికల ఫలితాలను హుందాగా స్వీకరించే మనస్తత్వాన్ని పరాజితులు ఏనాడూ ప్రదర్శించలేదు.
మన రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు 2004 ఎన్నికల్లో ఓడినప్పటినుంచీ ఈవీఎంలంటే విరక్తి పుట్టింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారీ బాబు ఈవీఎంల గురించి రాద్ధాంతం చేసేవారు. 2009 ఎన్నికల్లోనూ ఇది కొనసాగింది. ఓడిన రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీసహా దాదాపు అన్ని పార్టీలూ ఈ తరహా వాదనలు చేయడం పరిపాటైంది. నిరుడు జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల సోర్స్ కోడ్‌ను అధికార అకాలీదళ్ హ్యాకర్లద్వారా మార్చి ఎన్నికల్లో విజేతగా నిలిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈవీఎంలపై తరచుగా వస్తున్న ఆరోపణల పర్యవసానంగా ఈ అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఈవీఎంలకు ప్రింటర్లను అనుసంధానించమని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తన ఓటు ఎంపికచేసుకున్న పార్టీకే వెళ్లిందో, లేదో ఓటరు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని, అలాగే ఓట్ల లెక్కింపులో వివాదం తలెత్తినప్పుడు సరిచూసుకోవడానికి కూడా తోడ్పడుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఈవీఎంలపై ఓటర్లకు విశ్వాసం కలగాలంటే ఇదొక్కటే మార్గమని వారు తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలనాటికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే, ఆరునెలల వ్యవధిలో లక్షలాది ఈవీఎంలకు అవసరమైన ప్రింటర్లు ఉత్పత్తిచేయడం సాధ్యంకాదు గనుక అప్పటికల్లా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అమలుచేయగలమని ఎన్నికల సంఘం పేర్కొంది. వాస్తవానికి ఈవీఎంలపై పరాజితుల ఆరోపణలే తప్ప, సాధారణ ఓటర్లనుంచి ఏనాడూ ఫిర్యాదులు లేవు. పరాజితుల ఆరోపణలు కూడా ఏనాడూ రుజువైంది లేదు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లోపభూయిష్టంగా ఉన్నదని, మొరాయిస్తున్న దని ఫిర్యాదులు వచ్చినప్పుడు వెనువెంటనే దాని స్థానంలో మరో ఈవీఎంను సమకూరుస్తున్నారు. మూడేళ్లక్రితం ఒక ఈవీఎంను దొంగిలించి, దాన్ని మార్చగలిగి నట్టు ఒక వ్యక్తి చూపించడానికి ప్రయత్నించినా అది పెద్దగా ఫలించలేదు. ఓటింగ్ సమయంలోగానీ, కౌంటింగ్ సమయంలోగానీ ఈవీఎంను దేనితోనూ అనుసంధా నించే అవకాశం లేకుండా రూపొందించారు. దాన్ని రిమోట్ కంట్రోల్‌తోగానీ, మరే ఇతర పద్ధతిలోగానీ మార్చడానికి అవకాశంలేని రీతిలో తయారుచేశారు. అందువల్లే తాము ఇచ్చే ఈవీఎంను తమ ఎదురుగా మార్చి దాని పనితీరులోని లోపాన్ని బయటపెట్టాలని అనేక సందర్భాల్లో ఎన్నికల సంఘం సవాల్‌చేసింది.
ఈ సవాల్‌ను ఎవరూ స్వీకరించలేదు. పోలింగ్‌కు ముందు ఈవీఎంలను ప్రతి దశలోనూ తనిఖీ చేసుకునేందుకు, వాటి పనితీరును పరీక్షించేందుకు పార్టీల ప్రతినిధులకు అవకాశమిస్తారు. ఏ జిల్లాకు ఎక్కడి ఈవీఎంలు వెళ్తాయో, జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు వెళ్లే ఈవీఎంలేవో తెలుసుకునే అవకాశమే ఉండదు. మళ్లీ నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవకాశం ఉన్న ఈవీఎంలు ఏవేవో తెలుసుకోవడం కూడా కష్టం. ఎన్నికలను నిర్దుష్టంగా జరిపించడం కోసం మన ఎన్నికల సంఘం ఇలా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఈవీఎంలను తారుమారు చేయాలనుకునేవారికి అసాధ్యమయ్యేలా ఈ ఏర్పాట్లన్నీ చేశారు. కొన్ని దేశాల్లో ఈవీఎంలకు స్వస్తిపలికి, మళ్లీ బ్యాలెట్ బాక్సుల విధానానికి వెళ్లడం నిజమే. కానీ, అక్కడ వినియోగించిన ఈవీఎంలు ప్రైవేటు సంస్థలు తయారుచేసినవి. మన దేశంలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఈవీఎంలన్నిటినీ ప్రతిష్టాత్మకమైన బెంగళూరులోని బెల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ సంస్థలు ఉత్పత్తిచేశాయి.
సరే, కారణమేదైనా ఈవీఎంలకు ప్రింటర్‌ను అనుసంధానించే విధానం మొదలుకాబోతున్నది. ఈవీఎంలో ఓటరు తనకు నచ్చిన పార్టీకి ఎదురుగాగల బటన్‌ను నొక్కిన వెంటనే ప్రింటర్‌నుంచి ఆ ఓటు ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి వేశారో తెలియజేస్తూ ఒక స్లిప్ బయటికొచ్చే ఏర్పాటుంది. ఏడు సెకన్లపాటు ప్రింటర్‌కు అమర్చిన గాజుపలక వెనుక కనిపించే ఆ స్లిప్ అటు తర్వాత ఒక బాక్సులో పడే విధంగా ఏర్పాటు చేశారు. అయితే, ఈ విధానంపై రేపు వివాదాలు తలెత్తవన్న నమ్మ కం లేదు. తాను ఫలానా పార్టీకి ఓటువేస్తే స్లిప్‌పై వేరే పార్టీ పేరు వచ్చిందని పేచీకి దిగేవారు ఉండొచ్చు. పర్యవసానంగా పోలింగ్ నిలిచిపోతుంది.అంతా సవ్యంగా ఉన్నదని సంతృప్తిపడ్డాకగానీ తిరిగి మొదలయ్యే స్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఓటు హక్కుకు ఉండాల్సిన గోప్యత గల్లంతవుతుంది. ఆ ఓటరు ఎవ రికి ఓటేశాడో అక్కడున్నవారికి తెలిసిపోతుంది. దానివల్ల ఆ ఓటరుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. పారదర్శకత ఉండాల్సిన చోట ఉండాలి. కానీ, ఇలాంటి సందర్భాల్లో కాదు. దాదాపు రూ.1,700 కోట్లు వ్యయమయ్యే విధానం చివరకు ఇలాంటి స్థితికి దారితీయడం ఇబ్బందికరమే. కనీసం ఇప్పుడు న్యూఢిల్లీ నియోజకవర్గంలో వచ్చే అనుభవం తర్వాతైనా ఈవీఎంల పనితీరు నిర్ధారించుకుని, అందుకు అనుగుణంగా నిర్ణయాలను సవరించుకోవడం ఉత్తమం.