ఈవీఎంలపై గళమెత్తిన మరో ముఖ్యమంత్రి!
ఈవీఎంలపై గళమెత్తిన మరో సీఎం
కోల్‌కతా: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎంలు) ట్యాంపరింగ్‌కు గురయ్యాయంటూ ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణాస్త్రాలు సంధిస్తుండగా.. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ విషయమై గళమెత్తారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్నిపార్టీలతో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చునంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్న వీడియోక్లిప్ గురించి ఆమె తాజాగా స్పందించారు. 'ఇది నేను చెప్పిన విషయం కాదు. చట్టబద్ధంగా ప్రసిద్ధుడైన సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. ఆయన చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకొని.. విచారణ జరపాలి' అని ఆమె అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమంటూ ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను తాను చూశానని, అయితే, వాటిని ట్యాంపరింగ్ చేయవచ్చునంటూ సుబ్రహ్యణ్యస్వామి పేర్కొంటున్నారని, కాబట్టి ఈ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆమె కోరారు. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలు గోల్‌మాల్ చేశాయని, ఈ అంశంపై విచారణ నిర్వహించాలని మాయావతి, అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.