వికారాబాద్, న్యూస్‌లైన్: ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు)ల భద్రత డొల్లేనని తేలింది. అధికారుల నిర్లక్ష్యానికి వికారాబాద్ స్ట్రాంగ్‌రూం ఘటన నిలువుటద్దంగా నిలిచింది. బుధవారం కురిసిన ఆకాల వర్షానికి అందులోని ఓటింగ్ యంత్రాలు తడిసిముద్దయ్యాయి. మోకాల్లోతు నీరు గది లోపలికి చేరడంతో ఈవీఎంలు నీటిలో మునిగాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు తాపీగా అక్కడకు చేరుకొని.. తడిసిన ఈవీఎంలను అరబెట్టడం కొసమెరుపు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 580 బ్యాలెట్ యూనిట్లు, 520 కంట్రోల్ యూనిట్లను ఇక్కడి గదుల్లో ఉంచారు. వీటిని కంటికిరెప్పలా కాపాడేందుకు సాయుధ పోలీసులు, అసిస్టెంట్ రిటర్నింగ్ స్థాయి అధికారిని నియమించారు. అయితే, భారీ వర్షం కురిసిన సమయంలో ఇక్కడ వీరెవ్వరూ లేనట్లు ఉన్నతాధికారుల విచారణలో స్పష్టమైంది.
తాపీగా వచ్చారు..
బుధవారం సాయంత్రం ఎడతెరిపిలేకుండా వాన కురిసింది. గాలి కూడా తోడుకావడంతో వాన ఉధృతి పెరిగింది. ఈ క్రమంలోనే ఈవీఎంలను భద్రపరిచిన మహావీర్ ఆస్పత్రి గదుల ను వర్షపు నీరు ముంచెత్తింది. స్ట్రాంగ్ రూంలోకి నీరొచ్చిన విషయాన్ని అర్ధరాత్రి తెలుసుకున్న సబ్‌కలెక్టర్/ రిటర్నింగ్ అధికారి ఆమ్రపాలి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తడిసిన ఈవీఎంలను ఆమెతో సహా ఎన్నికల సిబ్బంది శుభ్రపరిచారు. గురువారం మధ్యాహ్నం వరకు అక్కడే తిష్టవేసిన ఆమ్రపాలి ఈవీఎంలను అరబెట్టడాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.
ఇదిలావుండగా, స్ట్రాంగ్‌రూంలకు కాపలా ఉండాల్సిన పోలీసులు/ ఏఆర్‌ఓ సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంతో ఈవీఎంలు నీటమునిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. సాయంత్రం వర్షంకురిస్తే అర్ధరాత్రి ఒంటి గంటవరకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వర్షంపడే సమయంలో వీరు అక్కడలేకపోవడంతో సమాచారం చేరవేయలేదని, ఈవీఎంల భద్రతను చూడాల్సిన సిబ్బంది నిర్లిప్తంగా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని రిట ర్నింగ్ అధికారిని ఆదేశించినట్లు తెలిసింది.
భద్రత డొల నీళ్లలో ఈవీఎంలు
Published Fri, Apr 25 2014 12:05 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement