‘పుర’పోరుకుసర్వం సిద్ధం
- ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
- 532 పోలింగ్ స్టేషన్లు... 608 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు
- మునిసిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 5,72,115 మంది
- అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 128
- 2,089 మందితో భారీ పోలీస్ బందోబస్తు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించేందుకు ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, పాల కొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో అధికారులు విసృ్తత ఏర్పాట్లు చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లు, మిగిలిన పట్టణాల్లో 291 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. మొ త్తంగా 291 స్థానాల్లో 946 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 143 మంది మహిళా అభ్యర్థులు.
5,72,115 మంది ఓటర్లు
ఏలూరు నగరపాలక సంస్థ, 8 పట్టణాల్లో మొత్తంగా 5,72,115మంది ఓటర్లు ఉన్నారు. ఏలూరులో 1,39,363 మంది, పాలకొల్లులో 44,518 మంది, భీమవరంలో 1,02,725, నిడదవోలులో 32,303 మంది, తణుకులో 72,462 మంది, కొవ్వూరులో 28,739 మంది, తాడేపల్లిగూడెంలో 72,251 మంది, నరసాపురంలో 42,566, జంగారెడ్డిగూడెంలో 37,188 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉం ది. వీటిలో 585 పోస్టల్ బ్యాలెట్‌లు, 112 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 539 పోలింగ్ కేంద్రాలు నెలకొల్పారు. 608 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో 135 సమస్యాత్మకమైనవికాగా, 128 ఘర్షణలు జరగడానికి అవకాశం ఉండే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
వెబ్ కెమెరాల ఏర్పాటు
పోలింగ్ జరిగే ప్రాంతాలను 38 జోన్లు, 56 రూట్‌లుగా విభజించా రు. పోలింగ్ కేంద్రాలతోపాటు ఇతర చోట్ల 197 వెబ్ కెమెరాలను అమర్చారు. ఏ పోలింగ్ స్టేషన్‌లో ఏం జరుగుతుందనేది ఈ వెబ్‌కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు వీక్షించే ఏర్పాట్లు చేశారు. 34 మంది వీడియోగ్రాఫర్‌లను సిద్ధం చేశారు. పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు 121 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 595మంది పోలింగ్ అధికారులు, మరో 595 మంది సహాయ పోలింగ్ అధికారులు, 1,785 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 19 షాడో బృందాలను రంగంలోకి దింపారు.
2,089 మందితో బందోబస్తు
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరిగే 9 పట్టణాల్లో 2,089 మంది సిబ్బందిని నియమించారు. 10 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు, 96 మంది ఏఎస్సైలు, 109 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 1,230 మంది కానిస్టేబుళ్లు, 493 మంది హోంగార్డులు, 32మంది ఆర్మ్‌డ్ రిజర్వు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.
ఓటరు స్లిప్‌ల పంపిణీ..
ఈసారి ఓటరు స్లిప్పులను అధికార యంత్రాంగమే పంపిణీ చేయాలని నిర్ణయించి కొంతమేరకు చేయగలిగింది. కొన్నిచోట్ల రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుని స్లిప్పులను పంపిణీ చేశాయి.
వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే పోటీ
మునిసిపాలిటీల్లో ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో నామమాత్రంగా ఉంది. వామపక్షాలు అక్కడక్కడా బరిలో ఉండగా, టీడీపీ పొత్తుతో బీజేపీ కొన్నిచోట్ల పోటీకి దిగింది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు చాలామంది రంగంలో ఉన్నా రు. పోటీ మాత్రం వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్యే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్ల విసృ్తతంగా ప్రచారం చేసింది. ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో మలచుకునేందుకు ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ ప్రచారంతోపాటు రకరకాల ఊహాగానాలు, దుష్ర్పచారాలకు తెరలేపి ఓటర్లను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేసింది. అయినా జనంలో వైఎస్సార్ సీపీకి ఆదరణ కన్పిస్తోంది.